సాక్షి, ముంబై: నగరంలోని శక్తిమిల్లు ప్రాంగణంలో మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను సెల్‌ఫోన్ల ఆధారంగానే పోలీసులు పట్టుకోగలిగారు. అత్యాచారం తర్వాత ఐదుగురు నిందితులూ సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. ప్రధాన నిందితుడైన మహమ్మద్ కాసిం హఫీజ్ షేక్ అలియాస్ కాసిం బెంగాలీ మరీన్ లైన్స్ పరిసరాలకు వెళ్లాడు. అప్పటికే అత్యాచారం సంఘటనపై వార్త దావానలంగా వ్యాపించిన విషయాన్ని తెలుసుకుని, అప్రమత్తమయ్యాడు. తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేసి రెండురోజులు దాక్కున్నాడు. రెండు రోజుల తర్వాత అతడు సెల్‌ఫోన్‌ను ఆన్ చేయడంతో సిగ్నల్స్ ద్వారా పోలీసులు అతడు ఇంకా నాగ్‌పాడా ప్రాంతంలోనే ఉన్న విషయాన్ని గుర్తించగలిగారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడకు చేరుకునే లోగానే అతడు అక్కడి నుంచి పారిపోయాడు.
అయితే, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని వెంటాడిన పోలీసులు ఆదివారం అతడిని పట్టుకోగలిగారు. జైభవానీనగర్ మురికివాడలో నివసించే మరో నిందితుడు చాంద్‌బాబు సత్తార్ షేక్‌ను సంఘటన జరిగిన 8 గంటల్లోనే పోలీసులు పట్టుకోగలిగారు. ఈ విషయం తెలియగానే అతడి సహచరుడు సలీం అన్సారీ గోవండిలోని మిత్రుని వద్దకు పారిపోయాడు. అతడి వద్ద కొంత డబ్బు తీసుకుని, కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి రైల్లో ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీకి చేరుకున్నాక అతడు తన మిత్రుడికి ఫోన్ చేయడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఢిల్లీకి వెళ్లి అతడిని పట్టుకున్నారు. అతడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు అతడిని సెప్టెంబర్ 5 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇదిలాఉండగా, జరిగిన ఘాతుకాన్ని చిత్రించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒక్క ఫొటో మాత్రమే తీసినట్లు నిందితులు చెబుతున్నారని, అది కూడా మొబైల్‌లో ప్రస్తుతం లేదని, ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నామని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇప్పటికే ముంబై చేరుకుందని, గుజరాత్ ఫోరెన్సిక్ నిపుణులు త్వరలోనే రానున్నారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్నామన్నారు. నిందితుల్లో ముగ్గురు పాత నేరస్తులేనని చెప్పారు. చాంద్‌బాబు సత్తార్ షేక్, విజయ్ జాధవ్, మహమ్మద్ కాసింలపై చోరీ, దోపిడీ తదితర పలు కేసులు ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా, బాధితురాలు మెల్లగా కోలుకుంటోందని, మానసిక వైద్యనిపుణులు ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని జస్‌లోక్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ తరంగ్ జ్ఞాన్‌చందానీ చెప్పారు.
దేశ ప్రజలకు బాధితురాలి కుటుంబం కృతజ్ఞతలు
అత్యాచారం సంఘటన తర్వాత తమ కుమార్తెకు అండగా నిలిచిన మహారాష్ట్ర వాసులతో పాటు దేశప్రజలందరికీ, మీడియాకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మీడియాకు లేఖ రాశారు. అందరి అండ లభించడంతో తాము ధైర్యంగా ఉండగలుగుతున్నామన్నారు.
నిందితులను పట్టించిన సెల్‌ఫోన్లు
Published Tue, Aug 27 2013 7:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement