పాపం అఫ్గాన్ బాలికలు!
తాలిబన్ల పాలనలో దుర్భర పరిస్థితులు
ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తోంది? ఏదో హెయిరాయిల్ ప్రకటనలా ఉంది కదా! కానీ నిజానికి అదో బర్త్‌డే పార్టీ. అత్యంత రహస్యంగా చేసుకున్న పార్టీ. అందులో పాల్గొన్న అమ్మాయిలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ముఖాలు కనబడకుండా జాగ్రత్త పడ్డారు.
బర్త్‌డే పార్టీ అంత రహస్యంగా చేసుకోవడమెందుకు? వేరే ఏ దేశంలోనైనా అవసరం లేదు. కానీ ఆఫ్గానిస్తాన్‌లో మాత్రం అది అత్యవసరం! తాలిబన్ల పాలనలో అక్కడి మహిళలు, బాలికల దుస్థితికి అద్దం పడుతున్న ఈ ఫొటోను ఇరాన్–కెనడియన్ ఫొటో జర్నలిస్ట్ కియానా హయేరి తీశారు. ఇలాంటి చిత్రాల సమాహారాన్ని ‘నో విమెన్స్ లాండ్’ పేరిట ఈ నెల పారిస్‌లో ప్రదర్శించనున్నారు.
ఏడు ప్రావిన్సులు తిరిగి...
ఫ్రెంచ్ పరిశోధకురాలు మెలిస్సా కార్నెట్‌తో హయేరి 2018 నుంచి కలిసి పని చేస్తున్నారు. వారు కొన్నేళ్లుగా అఫ్గాన్‌లోనే ఉంటున్నారు. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్‌ను వీడటం, దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం వంటి పరిణామాలకు వాళ్లు ప్రత్యక్ష సాక్షులు. నానాటికీ దిగజారుతున్న పరిస్థితులు వారిని భయపెట్టాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని కల్లబొల్లి ప్రతిజ్ఞలు చేసిన తాలిబన్లు చివరికి వాళ్లకు అసలు ప్రజా జీవితమే లేకుండా చేశారు. ప్రాథమిక హక్కులతో సహా సర్వం కాలరాశారు. మహిళల గొంతు వినపడటమే నిషేధం. ముసుగు లేకుండా, మగ తోడు లేకుండా గడప దాటడానికి లేదు! బాలికల చదువుకు పాఠశాల స్థాయితోనే మంగళం పాడారు. బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, నృత్యం నిషేధం. అఫ్గాన్ మహిళల దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు హయేరి, కార్నెట్ ఏడు ప్రావిన్సుల్లో పర్యటించారు. ఎంతోమంది మహిళలను కలిశారు.
ఆశలకు ప్రతీకలు కూడా...
ఎంతసేపు అణచివేత గురించే ఎందుకు చెప్పాలి? అందుకే అఫ్గాన్ బాలికలు, మహిళలకు భవిష్యత్తు మీదున్న ఆశను కూడా హయేరి, కార్నెట్ ఫొటోల్లో బందించారు. తమ చీకటి జీవితాల్లో వెలుగులు నింపే వేడుకలను వాళ్లు జరుపుకొంటున్నారో చెబుతున్నారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో బాలికలు, స్త్రీలకు సంబంధించి చిన్న వేడుక అయినా అది నేరుగా తాలిబన్ ప్రభుత్వాన్ని ధిక్కరించడమే. అందుకే బాలికలు పుట్టిన రోజులు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో స్నేహితులను కలుస్తున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ప్రమాదాలు తెచ్చి పెడుతుందని తెలిసీ రిస్క్ చేస్తున్నారు. మహిళలు గుర్తింపుకే నోచుకోని చోట ఇలాంటి చిన్న వేడుకైనా పెద్ద ప్రతిఘటనే! చిరునవ్వులు చిదిమేస్తున్న కాలంలో ఆనందాన్ని ప్రదర్శించడం కూడా తిరుగుబాటే. అందుకే నిరసనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్నీ మహిళలు వదులుకోవడం లేదంటున్నారు. హయేరి, కార్నెట్.
తాలిబన్లలోనూ విభేదాలు!
మహిళలను తీవ్రంగా అణచివేయడంపై తాలిబన్లలోనే వ్యతిరేకత పెరుగుతోంది! అతివాది అయిన దేశాధినేత షేక్ హైబతుల్లా అఖుందా జాదా నిర్ణయాలను తాలిబన్లలోనే ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ వంటివాళ్లు బాలికలు, యువతుల విద్య కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఆరో తరగతి తర్వాత కూడా విద్యను అందించే అండర్ గ్రౌండ్ పాఠశాలలపై తాలిబన్లలోని కొన్ని విభాగాలు దృష్టి సారించినట్టు కార్నెట్ పేర్కొన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment