Shakti Mills
-
జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోవాల్సిందే
ముంబై: ‘మరణశిక్ష అనేది దోషులకు పశ్చాత్తాపం నుంచి వెంటనే విముక్తి పొందేలా చేస్తుంది. జీవితఖైదు విధిస్తేనే వారు జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోతారు’ అంటూ సామూ హిక అత్యాచార కేసు దోషుల మరణశిక్ష నుంచి జీవితఖైదుకు తగ్గిస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. ‘ రేప్ అనేది అత్యంత హేయమైన చర్య. బాధితురాలు శారీరకంగానే కాదు మానసికం గానూ అత్యంత వేదనకు గురవుతారు. మహిళ గౌరవాన్ని కించపరుస్తూ, అత్యంత తీవ్రస్థాయిలో ఉల్లంఘనకు పాల్పడిన ఈ దోషులెవరూ జీవితకాలంలో ఎన్నడూ సమాజంలోకి తిరిగి వెళ్లలేరు. జీవితాంతం తమ ఘోరమైన నేరానికి పశ్చాత్తాపం చెందాలంటే మరణశిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షే సరైంది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2013 ఆగస్ట్ 22న సెంట్రల్ ముంబైలోని నిరుపయోగంగా ఉన్న శక్తి మిల్స్ కాంపౌండ్‌లో 22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై ఐదుగురు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో దోషులుగా తేలిన ఐదుగురుకీ మరణశిక్ష విధిస్తూ ఏడేళ్ల క్రితమే ట్రయల్ కోర్టు శిక్ష ఖరారుచేసింది. వీరిలో విజయ్ జాధవ్, మొహమ్మద్ ఖాసిం బెంగాలీ షేక్, మొహమ్మద్ అన్సారీ మరణశిక్షను సవాల్ చేస్తూ 2014 ఏప్రిల్‌లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ సాధనా జాధవ్, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌ల డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ‘ దోషులకు మరణశిక్ష సరిపోదు. అంతకు మించిన శిక్ష విధించాలి. జీవితాంతం వీరు పశ్చాత్తాపంతో కుంగిపోవాలనే ఉద్దేశంతోనే, కింది కోర్టు ఖరారుచేసిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం’ అని హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. ‘ ఏ నేరానికి ఏ శిక్ష అనే విధానంలో.. ఇలాంటి దారుణమైన ఘటనల్లో మరణశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించాలనే ఒక నియమంగా పెట్టాలి’ అని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ‘సంచలనం రేపిన ఈ కేసులో ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహావేశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులు చెప్పడం కుదరదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
‘శక్తిమిల్స్’కీచకులకు ఉరి
వీరికి ఉరే సరైన శిక్ష అన్న కోర్టు కొత్తగా ప్రవేశపెట్టిన ఐపీసీ సెక్షన్ 376 (ఈ) తొలిసారి అమలు అత్యాచార నేరానికి మళ్లీమళ్లీ పాల్పడితే మరణశిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తున్న కొత్త సెక్షన్ ముగ్గురికి మరణశిక్ష, నాలుగో దోషికి యావజ్జీవం ముంబై: ముంబైలోని పాడుబడిన శక్తి మిల్స్‌లో జరిగిన రెండు సామూహిక అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసుల్లో దోషులుగా నిర్ధారించిన ముగ్గురికి స్థానిక సెషన్స్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. మళ్లీ మళ్లీ అత్యాచార నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేందుకు వీలు కల్పిస్తూ సవరించిన ఐపీసీ సెక్షన్ 376(ఈ)ను దేశంలోనే తొలిసారిగా న్యాయమూర్తి ఈ సందర్భంగా అమలు చేశారు. అత్యాచార కేసుల్లో బాధితులు చనిపోనప్పటికీ దోషులకు గరిష్టస్థాయిలో మరణశిక్ష విధించేందుకు ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తోంది. ఢిల్లీలో 2012 డిసెంబర్లో జరిగిన ఘోర అత్యాచార ఘటనానంతరం సవరించిన ఈ చట్టం అమల్లోకి వచ్చింది. గత ఏడాది జూలైలో శక్తి మిల్స్ ప్రాంగణంలో 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. అదే ఆవరణలో ఆ ఏడాది ఆగస్టు 22న 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టుపై కూడా సామూహిక అత్యాచారం జరిగింది. తొలి కేసులో దోషులుగా నిర్ధారించిన ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అరుుతే రెండో కేసులో కూడా ఈ ముగ్గురు దోషులని తేలడంతో సెషన్స్ కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఈ కేసులో కాని పక్షంలో మరే కేసులో మరణశిక్ష విధించాలని ప్రశ్నించిన జడ్జి షాలినీ ఫన్సాల్కర్ జోషి .. దోషులు కాసిమ్ బెంగాలి (21), విజయ్ జాదవ్ (19), మహమ్మద్ సలీమ్ అన్సారీ (28)లకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వారు చనిపోయేంత వరకు మెడకు ఉరి వేయూలని అన్నారు. లైంగిక నేరగాళ్లు సమాజానికి చీడపురుగుల్లా మారారని, వీరిని ఎలాంటి దయూదాక్షిణ్యాలు లేకుండా శిక్షించాల్సిన అవసరం ఉందని, కేసులో అవసరమైనప్పుడు న్యాయం అనే కత్తిని ఉపయోగించేందుకు న్యాయమూర్తి సందేహించరాదని జడ్జి షాలిని వ్యాఖ్యానించారు. కాగా ఒకే అత్యాచారంలో నిందితుడైన సిరాజ్ రెహమాన్‌కు జడ్జి జీవితఖైదు విధించారు. అసహజ లైంగిక చర్య, దాడి, సాక్ష్యాల విధ్వంసం తదితర నేరాలకు గాను జడ్జి నలుగురు నిందితులకు ఐపీసీతో పాటు ఐటీ చట్టం కింద జైలు శిక్షలు, జరిమానాలు విధించారు. క్షణిక కామోద్రేకంతో కాకుండా ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే నిందితులు నేరానికి పాల్పడ్డారని న్యాయమూర్తి చెప్పారు. తాజా కేసులో దోషులు బాధితురాలి పట్ల కనికరం లేకుండా వ్యవహరించారని అన్నారు. బాధితురాలి హక్కులన్నిటినీ కాలరాశారు.. బాధితురాలి హక్కులన్నింటినీ కాలరాసిన ఈ నిందితులకు అత్యంత కఠిన శిక్ష వేయాల్సిందేనని, లేనిపక్షంలో సామాన్యుడికి వ్యవస్థపై నమ్మకం పోతుందని చెప్పారు. తనను వెళ్లనివ్వమని ఆర్థించిన బాధితురాలిని చూసి నిందితులు నవ్వారన్నారు. కేవలం లైంగిక దాడినే కాకుండా బాధితురాలి నిస్సహాయ పరిస్థితిని కూడా వారు ఆస్వాదించారని చెప్పారు. బాధితురాలు ధైర్యంగా ముందుకువచ్చి ఫిర్యాదు దాఖలు చేయడంతో దారుణ కృత్యం వెలుగుచూసిందన్నారు. బాధితురాలు అనుభవించిన మానసిక క్షోభ, నొప్పిని కోర్టు గమనించిందన్నారు. ఇది కేవలం బాధితురాలి ప్రాథమిక, రాజ్యాంగపరమైన హక్కులను ఉల్లంఘించడమే కాకుండా ఆమె స్వేచ్ఛను హరించడమేనని జడ్జి అభిప్రాయపడ్డారు. ఇది కేవలం బాధితురాలికి వ్యతిరేకంగా జరిగిన నేరమే కాకుండా యూవత్ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని జడ్జి షాలిని పేర్కొన్నారు. నిందితులు యుక్త వయస్సులో ఉండటమనేది వారిపై దయూదాక్షిణ్యాలు చూపడానికి ప్రాతిపదిక కాబోదని స్పష్టం చేశారు. కాగా, పగతో తాము దోషులకు మరణశిక్ష కోరడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అంతకుముందు కోర్టుకు స్పష్టం చేశారు. నేరాన్నే కాకుండా నిందితులు నేరానికి పాల్పడిన తీరును కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని నివేదించారు. ‘సూర్యనెల్లి’ కేసులో దోషులకు శిక్షలు కొచ్చి: పద్దెనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సూర్యనెల్లి సామూహిక అత్యాచార కేసులో దోషులకు కేరళ హైకోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. ప్రధాన దోషి ధర్మరాజన్‌కు జీవితకాల కారాగారవాసం విధించిన కోర్టు.. మరో 23 మందికి శిక్షలు వేసింది. దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను విచారించిన జస్టిస్ కేటీ శంకరన్, జస్టిస్ ఎంఎల్ జోసెఫ్ ఫ్రాన్సిస్‌లతో కూడిన ధర్మాసనం ఆ తీర్పును ప్రకటించింది. అత్యాచార సమయంలో మైనరైన బాధితురాలిని 40 మంది కలసి 40 రోజుల పాటు కేరళ, తమిళనాడు ప్రాంతంలో మూడు వేల కిలోమీటర్లకుపైగా తిప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడ్డ వారిలో 36 మంది దోషులుగా తేలగా సుదీర్ఘ విచారణ సమయంలో ఐదుగురు చనిపోయారు. -
'శక్తిమిల్స్' రేపిస్టులకు మరణశిక్ష
-
రెండు రేప్ కేసుల్లో ముగ్గురు ఉమ్మడి దోషులు
-
శక్తిమిల్స్ గ్యాంగ్ రేప్: నలుగురికి జీవితఖైదు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోని శక్తిమిల్స్ ప్రాంగణంలో 19 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. ఈ సంఘటన 2013 జూలై 31న జరిగింది. దోషులు సహజంగా మరణించేవరకు ఈ శిక్ష అమలవుతుంది. దోషులు విజయ్ జాదవ్ (18), ఖాసిం హఫీజ్ షేక్ అలియాస్ ఖాసిం బెంగాలీ (20), సలీం అన్సారీ (27), మహ్మద్ ఆష్ఫక్ షేక్ (26)లతో పాటు మరో మైనర్ కూడా ఈ కేసులో ఉన్నాడు. బాధితురాలు సిద్దివినాయకుని గుడికి తన స్నేహితుడితో కలిసి వెళ్తూ, దగ్గర దారి అవుతుందని శక్తి మిల్స్ మీదుగా వెళ్తుండగా ఈ ఐదుగురు ఆమెపై దాడిచేశారు. మొదట్లో ధైర్యం లేక పోలీసులకు చెప్పకపోయినా.. తర్వాత ఆగస్టు 22న అక్కడే మరో జర్నలిస్టుపై కూడా అలాగే జరగడంతో తర్వాత బయటపెట్టింది. ఈ రెండు కేసుల్లోనూ జాదవ్, బెంగాలీ, అన్సారీ దోషులని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి షాలినీ ఫన్సాల్కర్ జోషి తీర్పునిచ్చారు. ఈ రెండు కేసుల్లో వేర్వేరుగా దోషులైన ఇద్దరు మైనర్లను ముంబై బాల నేరస్థుల బోర్డు ప్రత్యేకంగా విచారిస్తుంది. -
దోషులే
సాక్షి, ముంబై: గతేడాది శక్తి మిల్లు కంపౌండ్‌లో జరిగిన రెండు అత్యాచార కేసుల్లో స్థానిక కోర్టు ఐదుగురు నిందితులను దోషులుగా ప్రకటించింది. గతేడాది ఆగస్టు 22న జరిగిన మహిళా ఫొటోజర్నలిస్ట్, జూలై 31న జరిగిన కాల్‌సెంటర్ ఉద్యోగిపై సామూహిక అత్యాచారం కేసుల్లో వీరికి శుక్రవారం శిక్ష ఖరారు చేయనుంది. విజయ్ జాదవ్, క్వాసీమ్ హాఫీజ్ షేక్ అలియాస్ బెంగాలీ, మహమ్మద్ సలీం అన్సారీలను రెండు కేసుల్లో దోషులుగా కోర్టు గుర్తించింది. మహిళా ఫొటో జర్నలిస్ట్ అత్యాచారం కేసులో సిరాజ్ ఖాన్, కాల్ సెంటర్ ఉద్యోగి కేసుల్లోనూ అస్ఫక్వి షేక్‌లను దోషులుగా ప్రకటించింది. ఈ రెండు కేసులపై ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శాలిని పాన్సల్కర్ జోషి శుక్రవారం తీర్పును వెలువరించనున్నారు. గతేడాది ఆగస్టు 22వ తేదీన శక్తిమిల్లు కంపౌండ్‌లో ఓ మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. దీనిపై ముంబైతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు బాధితురాలు అందించిన ఆధారాల మేరకు నిందితులు విజయ్ జాదవ్, కాసీమ్ బంగాలీ, సలీం అన్సారీ, సిరాజ్ రెహమాన్‌తోపాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారించగా మరో టెలిఫోన్ ఉద్యోగిని కూడా అత్యాచారం చేసినట్టు తెలిపారు. ఈ రెండు కేసులలో నిందితులు ఒక్కరే కావడంతో విచారణ ఒకేసారి సంయుక్తంగా చేపట్టారు. 2013 సెప్టెంబర్ 19న మహిళా ఫొటో జర్నలిస్ట్ కేసులో నిందితులపై 600 పేజీల చార్జీషీట్‌ను, టెలిఫోన్ ఆపరేటర్ అత్యాచారం కేసులో నిందితులపై 362 పేజీల చార్జీషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసు 2013 సెప్టెంబర్ 23న సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి శాలిని జోషీ ముందు విచారణకు వచ్చింది. మహిళా ఫొటో జర్నలిస్ట్ కేసులో 44 మంది సాక్షులు, ఆపరేటర్ కేసులో 31 మంది సాక్షులను విచారించారు. అందరి వాదనలు విన్న అనంతరం కోర్టు గురువారం నిందితులను దోషులుగా ప్రకటించింది. అయితే ఈ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ మైనర్ బాలుడిని జువైనల్ కోర్టు త్వరలో విచారించనుంది. కాగా, గురువారం జరిగిన కోర్టు విచారణకు రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ హాజరయ్యారు. కఠిన శిక్షను విధించాలి.. ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ ఉజ్వల్ నికమ్ మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారికి కఠినమైన శిక్షను విధించాలని కోర్టును కోరారు. ఈ కేసుల్లో నిందితులను దోషులని న్యాయస్థానం ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. వారికి కఠినమైన శిక్షను విధించాలన్నారు. మరోవైపు మైనర్ నిందితునిపై కేసు విచారణ తొందర్లోనే ప్రారంభం కానుందని చెప్పారు. గుణపాఠం కావాలి: పాటిల్ ఈ కేసు తీర్పు తొందరగా వెలువడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని, దీంతో చాలా తక్కువ సమయంలోనే దర్యాప్తు పూర్తయిందని హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ పేర్కొన్నారు. కోర్టుకు వచ్చిన ఆయన కేసుల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడేందుకు సాహసం చేయకుండే ఉండేందుకు నిందితులకు కఠిన శిక్ష విధించాలన్నారు. ఇది నిందితులందరికి ఒక గుణపాఠంగా మారాలని అభిప్రాయపడ్డారు. కోర్టు ఇచ్చే తీర్పుతో నింది తులు ఇలాంటి సంఘటనలకు పాల్పడేందుకు సాహసించరన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు మహిళలెవరైనా పోలీసుల మద్దతు తప్పక తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాధితురాలికి న్యాయం జరిగేది ప్రత్యక్షంగా చూసేందుకు కోర్టుకు వచ్చినట్టు చెప్పారు. -
ముంబై అత్యాచారం: నలుగురు నిందితులకు 19 వరకు కస్టడీ
ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను ఈనెల 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ముంబైలోని ఓ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. షిరాజ్ రెహ్మాన్ ఖాన్, విజయ్ జాదవ్, ఖాసిం బెంగాలీ, సలీమ్ అన్సారీలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని మేజిస్ట్రేట్ యూఎం పద్వాడ్ ఆదేశించారు. వాళ్లతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించాలని క్రైం బ్రాంచి కోరడంతో కస్టడీకి పంపారు. అంతకుముందు విధించిన పోలీసు కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ కేసులో మరో మైనర్ నిందితుడిని ఆగస్టు 30న జువెనైల్ కోర్టులో ప్రవేశపెట్టగా అక్కడినుంచి డోంగ్రిలోని జువెనైల్ రిమాండ్ హోంకు పంపారు. అతడిపై నేరం రుజువైతే గరిష్ఠంగా మూడు సంవత్సరాల శిక్ష మాత్రమే పడుతుంది. అదే ఇతర నిందితులకైతే కనీసం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు పడే అవకాశం ఉంది. నిందితులలో ఒకరి సోదరుడు అతడు చదివిన స్కూలు నుంచి టీసీ తీసుకొచ్చి, అతడు 1997 ఫిబ్రవరిలో పుట్టినట్లు నిరూపించడంతో ఆ నిందితుడిని మైనర్‌గా నిర్ధరించారు. -
వారు నన్నూ రేప్ చేశారు
ముంబై: ఫొటో జర్నలిస్ట్ గ్యాంగ్ రేప్ కేసు నిందితుల నేరాల చిట్టా రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వారిలో కొందరు తనపైనా అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి(19) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫొటో జర్నలిస్ట్ రేప్ జరిగిన శక్తి మిల్స్ ప్రాంగణంలోనే తనపై వారు ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపింది. సోమవారం ఆమె ఈ మేరకు భాండప్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ వినాయక్ దేశ్‌ముఖ్ తెలిపారు. ‘జూలై 31న ఆమె తన స్నేహితుడితో ఓ పని మీద మహాలక్ష్మి ఏరియాకు వెళ్లింది. అక్కడ కొందరు ఫొటో జర్నలిస్ట్ కేసులో చేసినట్లుగానే వీరినీ మోసపుచ్చి.. భయపెట్టి.. శక్తి మిల్స్ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్నేహితుడిని కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు’ అని పోలీసులు చెప్పారు. ఫొటో జర్నలిస్ట్ కేసులో అరెస్టైన ఐదుగురిలో ఇద్దరు లేదా ముగ్గురు.. తన పై అత్యాచారం చేసిన వారిలో ఉన్నారని సదరు యువతి తెలిపినట్లు వివరించారు. ఇప్పటికే పలువురిని ప్రశ్నించామని.. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఫొటో జర్నలిస్ట్ రేప్ కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు ప్రశ్నించినప్పుడు.. గతంలోనూ తాము పలువురిపై అత్యాచారం జరిపిన విషయాన్ని వారు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూలై 31 రేప్ ఘటనపైనా వారిని ప్రశ్నిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. -
నిందితులను పట్టించిన సెల్ఫోన్లు
సాక్షి, ముంబై: నగరంలోని శక్తిమిల్లు ప్రాంగణంలో మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను సెల్ఫోన్ల ఆధారంగానే పోలీసులు పట్టుకోగలిగారు. అత్యాచారం తర్వాత ఐదుగురు నిందితులూ సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. ప్రధాన నిందితుడైన మహమ్మద్ కాసిం హఫీజ్ షేక్ అలియాస్ కాసిం బెంగాలీ మరీన్ లైన్స్ పరిసరాలకు వెళ్లాడు. అప్పటికే అత్యాచారం సంఘటనపై వార్త దావానలంగా వ్యాపించిన విషయాన్ని తెలుసుకుని, అప్రమత్తమయ్యాడు. తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేసి రెండురోజులు దాక్కున్నాడు. రెండు రోజుల తర్వాత అతడు సెల్‌ఫోన్‌ను ఆన్ చేయడంతో సిగ్నల్స్ ద్వారా పోలీసులు అతడు ఇంకా నాగ్పాడా ప్రాంతంలోనే ఉన్న విషయాన్ని గుర్తించగలిగారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడకు చేరుకునే లోగానే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని వెంటాడిన పోలీసులు ఆదివారం అతడిని పట్టుకోగలిగారు. జైభవానీనగర్ మురికివాడలో నివసించే మరో నిందితుడు చాంద్‌బాబు సత్తార్ షేక్‌ను సంఘటన జరిగిన 8 గంటల్లోనే పోలీసులు పట్టుకోగలిగారు. ఈ విషయం తెలియగానే అతడి సహచరుడు సలీం అన్సారీ గోవండిలోని మిత్రుని వద్దకు పారిపోయాడు. అతడి వద్ద కొంత డబ్బు తీసుకుని, కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి రైల్లో ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీకి చేరుకున్నాక అతడు తన మిత్రుడికి ఫోన్ చేయడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఢిల్లీకి వెళ్లి అతడిని పట్టుకున్నారు. అతడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు అతడిని సెప్టెంబర్ 5 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇదిలాఉండగా, జరిగిన ఘాతుకాన్ని చిత్రించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఫొటో మాత్రమే తీసినట్లు నిందితులు చెబుతున్నారని, అది కూడా మొబైల్లో ప్రస్తుతం లేదని, ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నామని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇప్పటికే ముంబై చేరుకుందని, గుజరాత్ ఫోరెన్సిక్ నిపుణులు త్వరలోనే రానున్నారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్నామన్నారు. నిందితుల్లో ముగ్గురు పాత నేరస్తులేనని చెప్పారు. చాంద్‌బాబు సత్తార్ షేక్, విజయ్ జాధవ్, మహమ్మద్ కాసింలపై చోరీ, దోపిడీ తదితర పలు కేసులు ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా, బాధితురాలు మెల్లగా కోలుకుంటోందని, మానసిక వైద్యనిపుణులు ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని జస్లోక్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ తరంగ్ జ్ఞాన్‌చందానీ చెప్పారు. దేశ ప్రజలకు బాధితురాలి కుటుంబం కృతజ్ఞతలు అత్యాచారం సంఘటన తర్వాత తమ కుమార్తెకు అండగా నిలిచిన మహారాష్ట్ర వాసులతో పాటు దేశప్రజలందరికీ, మీడియాకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మీడియాకు లేఖ రాశారు. అందరి అండ లభించడంతో తాము ధైర్యంగా ఉండగలుగుతున్నామన్నారు. -
ఆమె ‘నిర్భయ’
సాక్షి, ముంబై: సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, దురాగతాలకు చిత్రరూపమిచ్చే మహిళా జర్నలిస్టు....చివరికి తనకే అన్యాయం జరుగుతుందని ఊహించలేకపోయింది. ఆడదానిలో అమ్మను కాకుండా శృంగారబొమ్మను చూసే రావణాసురుల చేతిలో తన బతుకు ఛిద్రమైపోతుందని కలలో కూడా అనుకోలేదు. గురువారం సాయంత్రం నగరంలోని శక్తిమిల్లులో అత్యాచారానికి గురైన మహిళా జర్నలిస్టు ఆ ఘటన తర్వాత తొలిసారిగా తల్లిని చూసి చిన్నపిల్లలా విలవిలలాడింది. తన గోడు వెళ్లగక్కుకుంది. ‘అమ్మా...ఐదుగురు నా జీవితాన్ని నాశనం చేశారు. ఆ కామాంధులకు కనీసం జీవితఖైదు శిక్షయినా వేయాలి’ అంటూ ‘ముంబై నిర ్భయ’ చేసిన రోదనలు అక్కడి వారందరినీ కంటతడిపెట్టించాయి. మరోవైపు ఈ స్థితిలో కన్నకూతురిని చూడాల్సిరావడంతో ఆ తల్లి సైతం కన్నీరుమున్నీరైంది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. కాగా తనకు మద్దతుగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి దిగారని తెలియడంతో ఎంతో ధైర్యం వచ్చినట్టు బాధితురాలు చెప్పిందని డాక్టర్లు మీడియాతో పేర్కొన్నారు. ఫోన్లో వివరాలు చెప్పివుంటే? శక్తిమిల్లు కాంపౌండ్‌లో సదరు ఘటన జరగకముందు బాధితురాలికి తల్లి రెండుసార్లు ఫోన్ చేసింది. అయినప్పటికీ కామాంధుల బెదిరింపుల కారణంగా ముంబై నిర్భయ మౌనం వహించింది. ఫోన్ చేసిన సమయంలో వివరాలు తెలియజేసినట్టయితే ఫలితముండేదని కొందరంటున్నారు. డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ కోర్సు పూర్తిచేసిన అనంతరం ఈ ఏడాది మే నెలలో ఓ ఆంగ్ల మాసపత్రికలో ట్రైనీ ఫొటోగ్రాఫర్‌గా బాధితురాలు విధుల్లో చేరింది. గురువారం విధి నిర్వహణలో భాగంగానే తన సహచరునితో కలసి శక్తిమిల్లు వద్దకు వెళ్లగా అక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సంఘటనకు ముందు ఎక్కడున్నావంటూ బాధితురాలికి తల్లి ఫోన్ చేసింది, అయితే నిందితులు బీర్ బాటిల్‌తో పొడిచేస్తామంటూ బెదిరించడమే కాకుండా క్షేమంగానే ఉన్నట్టు చెప్పమని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె ఆ విధంగానే చెప్పాల్సివచ్చింది. అయితే భయంభయంగా మాట్లాడుతుండడాన్ని గమనించిన తల్లి మరోసారి బాధితురాలికి ఫోన్ చేసింది. అయినప్పటికీ ఆ సమయంలో నిందితుల బెదిరింపుల కారణంగా ఏమీ చెప్పలేకపోయింది. ఆ తర్వాత ఘోరం జరిగిపోయింది. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్ మహిళల భద్రత అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతానని గవర్నర్ శంకర్ నారాయణన్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో శనివారం దాదాపు 15 మందితో కూడిన మహిళా జర్నలిస్టుల బృందం గవర్నర్‌ను కలసి ఓ విన తిపత్రం సమర్పించింది. శివారు ప్రాంత రైళ్లలో రాకపోకలు సాగించే మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఈ బృందం గవర్నర్‌కు తెలియజే యడంతో గవర్నర్ పైవిధంగా హామీ ఇచ్చారు. శివారు ప్రాంత రైళ్లలో రాకపోకలు సాగించే మహిళలకు భద్రత కల్పించే అంశాన్ని సీఎం పృథ్వీరాజ్‌చవాన్‌తోపాటు రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతానన్నారు. ‘మహిళల భద్రతకు సంబంధించి మనవద్ద గట్టి చట్టాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కావాల్సిందేమిటంటే వాటిని ప్రభావవంతంగా అమలు చేయడం’ అని అన్నారు. నిందితులందరికీ శిక్ష పడాలి ‘అత్యాచారం జీవితానికి ముగింపు కాదని, నిందితులందరికీ కఠినశిక్ష పడాలని కోరుకుంటున్నానని ముంబై నిర్భయ తెలిపినట్టు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సామంత్ ప్రభవాల్కర్ పేర్కొన్నారు. జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె శనివారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గాయాలనుంచి క్రమేణా బాధితురాలు కోలుకుంటోందని తెలిపారు. రంగంలోకి ప్రెస్ కౌన్సిల్ బృందం ఫొటో జర్నలిస్టు అత్యాచార ఘటనపై విచారణకోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నియమించిన కమిటీ శనివారం రంగంలోకి దిగింది. తొలుత హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్‌లతో సమావేశమై సంప్రదింపులు జరిపింది. ఈ కేసుపై విచారణ జరిపేందుకు పీసీఐ అధ్యక్షుడు మార్కండేయ కట్జూ... రాజీవ్ సబడే నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జర్నలిస్టుల వివరణ తీసుకుని వీలైనంత త్వరగా తమకు నివేదించాలని ఆదేశించారు. ఈ మేరకు ముంబై మరాఠీపత్రకార్ సంఘ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరో ఇద్దరి అరెస్టు కాగా ఫొటో జర్నలిస్టుపై అత్యాచార ఘటనకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చాంద్‌బాబు సత్తార్ షేక్ అలియాస్ మహ్మద్ అబ్దుల్‌ను నగరంలోని భోయివాడలోగల కోర్టుకు హాజరుపరచగా ఈ నెల 30వ తేదీదాకా రిమాండ్‌కు ఆదేశించారు. అనంతరం మధ్యాహ్నం అదే కోర్టుకు కొద్దిగంటల తర్వాత ఇదే కేసుకు సంబంధించిన మరో నిందితుడు విజయ్జాదవ్ను కూడా కోర్టులో హాజరుపరిచారు. కాగా తాను నేరానికి పాల్పడిన మాట నిజమేనంటూ నిందితుడు రెండో నిందితుడు అంగీకరించాడని కమిషనర్ సత్యపాల్‌సింగ్ శనివారం మీడియాకు తెలియజేశారు. విచారణ సరైన దిశలో కొనసాగుతోందన్నారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ ధీమా వ్యక్తం చేశారు.