సాక్షి, ముంబై: సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, దురాగతాలకు చిత్రరూపమిచ్చే మహిళా జర్నలిస్టు....చివరికి తనకే అన్యాయం జరుగుతుందని ఊహించలేకపోయింది. ఆడదానిలో అమ్మను కాకుండా శృంగారబొమ్మను చూసే రావణాసురుల చేతిలో తన బతుకు ఛిద్రమైపోతుందని కలలో కూడా అనుకోలేదు. గురువారం సాయంత్రం నగరంలోని శక్తిమిల్లులో అత్యాచారానికి గురైన మహిళా జర్నలిస్టు ఆ ఘటన తర్వాత తొలిసారిగా తల్లిని చూసి చిన్నపిల్లలా విలవిలలాడింది. తన గోడు వెళ్లగక్కుకుంది. ‘అమ్మా...ఐదుగురు నా జీవితాన్ని నాశనం చేశారు. ఆ కామాంధులకు కనీసం జీవితఖైదు శిక్షయినా వేయాలి’ అంటూ ‘ముంబై నిర ్భయ’ చేసిన రోదనలు అక్కడి వారందరినీ కంటతడిపెట్టించాయి. మరోవైపు ఈ స్థితిలో కన్నకూతురిని చూడాల్సిరావడంతో ఆ తల్లి సైతం కన్నీరుమున్నీరైంది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. కాగా తనకు మద్దతుగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి దిగారని తెలియడంతో ఎంతో ధైర్యం వచ్చినట్టు బాధితురాలు చెప్పిందని డాక్టర్లు మీడియాతో పేర్కొన్నారు.
ఫోన్‌లో వివరాలు చెప్పివుంటే?
శక్తిమిల్లు కాంపౌండ్‌లో సదరు ఘటన జరగకముందు బాధితురాలికి తల్లి రెండుసార్లు ఫోన్ చేసింది. అయినప్పటికీ కామాంధుల బెదిరింపుల కారణంగా ముంబై నిర్భయ మౌనం వహించింది. ఫోన్ చేసిన సమయంలో వివరాలు తెలియజేసినట్టయితే ఫలితముండేదని కొందరంటున్నారు. డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ కోర్సు పూర్తిచేసిన అనంతరం ఈ ఏడాది మే నెలలో ఓ ఆంగ్ల మాసపత్రికలో ట్రైనీ ఫొటోగ్రాఫర్‌గా బాధితురాలు విధుల్లో చేరింది. గురువారం విధి నిర్వహణలో భాగంగానే తన సహచరునితో కలసి శక్తిమిల్లు వద్దకు వెళ్లగా అక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సంఘటనకు ముందు ఎక్కడున్నావంటూ బాధితురాలికి తల్లి ఫోన్ చేసింది, అయితే నిందితులు బీర్ బాటిల్‌తో పొడిచేస్తామంటూ బెదిరించడమే కాకుండా క్షేమంగానే ఉన్నట్టు చెప్పమని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె ఆ విధంగానే చెప్పాల్సివచ్చింది. అయితే భయంభయంగా మాట్లాడుతుండడాన్ని గమనించిన తల్లి మరోసారి బాధితురాలికి ఫోన్ చేసింది. అయినప్పటికీ ఆ సమయంలో నిందితుల బెదిరింపుల కారణంగా ఏమీ చెప్పలేకపోయింది. ఆ తర్వాత ఘోరం జరిగిపోయింది.
ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్
మహిళల భద్రత అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతానని గవర్నర్ శంకర్ నారాయణన్ పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం మహిళా ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో శనివారం దాదాపు 15 మందితో కూడిన మహిళా జర్నలిస్టుల బృందం గవర్నర్‌ను కలసి ఓ విన తిపత్రం సమర్పించింది. శివారు ప్రాంత రైళ్లలో రాకపోకలు సాగించే మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఈ బృందం గవర్నర్‌కు తెలియజే యడంతో గవర్నర్ పైవిధంగా హామీ ఇచ్చారు. శివారు ప్రాంత రైళ్లలో రాకపోకలు సాగించే మహిళలకు భద్రత కల్పించే అంశాన్ని సీఎం పృథ్వీరాజ్‌చవాన్‌తోపాటు రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతానన్నారు. ‘మహిళల భద్రతకు సంబంధించి మనవద్ద గట్టి చట్టాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కావాల్సిందేమిటంటే వాటిని ప్రభావవంతంగా అమలు చేయడం’ అని అన్నారు.
నిందితులందరికీ శిక్ష పడాలి
‘అత్యాచారం జీవితానికి ముగింపు కాదని, నిందితులందరికీ కఠినశిక్ష పడాలని కోరుకుంటున్నానని ముంబై నిర్భయ తెలిపినట్టు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సామంత్ ప్రభవాల్కర్ పేర్కొన్నారు. జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె శనివారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గాయాలనుంచి క్రమేణా బాధితురాలు కోలుకుంటోందని తెలిపారు.
రంగంలోకి ప్రెస్ కౌన్సిల్ బృందం
ఫొటో జర్నలిస్టు అత్యాచార ఘటనపై విచారణకోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నియమించిన కమిటీ శనివారం రంగంలోకి దిగింది. తొలుత హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్‌లతో సమావేశమై సంప్రదింపులు జరిపింది. ఈ కేసుపై విచారణ జరిపేందుకు పీసీఐ అధ్యక్షుడు మార్కండేయ కట్జూ... రాజీవ్ సబడే నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జర్నలిస్టుల వివరణ తీసుకుని వీలైనంత త్వరగా తమకు నివేదించాలని ఆదేశించారు. ఈ మేరకు ముంబై మరాఠీపత్రకార్ సంఘ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మరో ఇద్దరి అరెస్టు
కాగా ఫొటో జర్నలిస్టుపై అత్యాచార ఘటనకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చాంద్‌బాబు సత్తార్ షేక్ అలియాస్ మహ్మద్ అబ్దుల్‌ను నగరంలోని భోయివాడలోగల కోర్టుకు హాజరుపరచగా ఈ నెల 30వ తేదీదాకా రిమాండ్‌కు ఆదేశించారు. అనంతరం మధ్యాహ్నం అదే కోర్టుకు కొద్దిగంటల తర్వాత ఇదే కేసుకు సంబంధించిన మరో నిందితుడు విజయ్‌జాదవ్‌ను కూడా కోర్టులో హాజరుపరిచారు. కాగా తాను నేరానికి పాల్పడిన మాట నిజమేనంటూ నిందితుడు రెండో నిందితుడు అంగీకరించాడని కమిషనర్ సత్యపాల్‌సింగ్ శనివారం మీడియాకు తెలియజేశారు. విచారణ సరైన దిశలో కొనసాగుతోందన్నారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఆమె ‘నిర్భయ’
Published Sat, Aug 24 2013 11:15 PM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM
Advertisement