వారు నన్నూ రేప్ చేశారు | 'Mumbai gang-rape accused raped me at same spot' | Sakshi
Sakshi News home page

వారు నన్నూ రేప్ చేశారు

Published Wed, Sep 4 2013 4:38 AM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM

'Mumbai gang-rape accused raped me at same spot'

ముంబై: ఫొటో జర్నలిస్ట్ గ్యాంగ్ రేప్ కేసు నిందితుల నేరాల చిట్టా రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వారిలో కొందరు తనపైనా అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి(19) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫొటో జర్నలిస్ట్ రేప్ జరిగిన శక్తి మిల్స్ ప్రాంగణంలోనే తనపై వారు ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపింది. సోమవారం ఆమె ఈ మేరకు భాండప్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ వినాయక్ దేశ్‌ముఖ్ తెలిపారు. ‘జూలై 31న ఆమె తన స్నేహితుడితో ఓ పని మీద మహాలక్ష్మి ఏరియాకు వెళ్లింది. అక్కడ కొందరు ఫొటో జర్నలిస్ట్ కేసులో చేసినట్లుగానే వీరినీ మోసపుచ్చి.. భయపెట్టి.. శక్తి మిల్స్ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె స్నేహితుడిని కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు’ అని పోలీసులు చెప్పారు.
 
 ఫొటో జర్నలిస్ట్ కేసులో అరెస్టైన ఐదుగురిలో ఇద్దరు లేదా ముగ్గురు.. తన పై అత్యాచారం చేసిన వారిలో ఉన్నారని సదరు యువతి తెలిపినట్లు వివరించారు. ఇప్పటికే పలువురిని ప్రశ్నించామని.. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఫొటో జర్నలిస్ట్ రేప్ కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు ప్రశ్నించినప్పుడు.. గతంలోనూ తాము పలువురిపై అత్యాచారం జరిపిన విషయాన్ని వారు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూలై 31 రేప్ ఘటనపైనా వారిని ప్రశ్నిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement