ప్రాంక్‌ అని చెప్పి నిజమైన పెళ్లి.. | Woman discovers fake Instagram wedding was real | Sakshi
Sakshi News home page

ప్రాంక్‌ అని చెప్పి నిజమైన పెళ్లి..

Published Sun, Jan 12 2025 6:38 AM | Last Updated on Sun, Jan 12 2025 6:38 AM

Woman discovers fake Instagram wedding was real

రద్దు చేయాలంటూ కోర్టుకెక్కిన మహిళ 

రీల్స్, ఇన్‌స్ట్రాగామ్‌ ప్రపంచాన్ని ఏలుతున్న కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియడం లేదు. ఆ్రస్టేలియాలోని ఓ మహిళకు ఇలాంటి సమస్యే ఎదురైంది. సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి అతను ఏర్పాటు చేసిన ‘ఫేక్‌ వెడ్డింగ్‌’నిజమని తేలడంతో ఆమె కోర్టుకెక్కాల్సి వచ్చింది. చివరకు జడ్జి ఆ పెళ్లిని రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే... మెల్‌బోర్న్‌లో ఉంటున్న ఓ మహిళకు 2023 సెప్టెంబర్‌లో ఆన్‌లైన్‌ డేటింగ్‌ వేదికపై ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 

అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది డిసెంబర్‌లో ఆమెకు అతను ప్రపోజ్‌ చేశాడు. ఆమె అంగీకరించింది. రెండు రోజుల తర్వాత సిడ్నీలో ఓ వైట్‌పార్టీ ఉందని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లో వస్తారని చెప్పారు. ఆమె కూడా అలాగే రెడీ అయి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే.. ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌ స్నేహితుడు తప్ప మరెవరూ లేరు. 

ఇదేంటని ప్రశ్నిస్తే... తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్‌ పెరగడం కోసం ప్రాంక్‌ వెడ్డింగ్‌ నిర్వహిస్తున్నానని, అందుకు సహకరించాలని ఆమెను కోరాడు. అప్పటికే అతనికి 17,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతని వివరణ ఆమెకు సబబుగానే తోచింది. సాయం చేసినట్లవుతుందని ఫేక్‌ పెళ్లికి అంగీకరించింది. సివిల్‌ మ్యారేజ్‌ కోర్టులో జరిగితేనే పెళ్లి చెల్లుబాటవుతుందని నమ్మింది. అదే విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. అదే నిజమైతే వారు ముందుగా వివాహం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్నేహితురాలు కూడా చెప్పడంతో.. ఇది ఉత్తుత్తి పెళ్లే అని నమ్మింది.  

కట్‌ చేస్తే.. రెండు నెలల తరువాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో తనను డిపెండెంట్‌గా చేర్చాలని అతను కోరాడు. పెళ్లి కానిది ఎలా కుదురుతుందని ఆమె ప్రశ్నించగా.. సిడ్నీలో జరిగిన వివాహ వేడుక నిజమైనదని బాంబు పేల్చాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించాడు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి.. వివాహానికి నెలముందే అతను నోటీసులు ఇచ్చాడని అర్థమైంది. అతను మొదటినుంచి అబద్ధం చెప్పాడని, తనను మోసం చేశాడని ఆమె కోర్టుకెక్కింది. పెళ్లి వేడుకలో తాను నటించానే తప్ప.. అది నిజం కాదని కోర్టుకు తెలిపింది. మహిళ వాంగ్మూలాన్ని నమ్మిన మెల్‌బోర్న్‌ జడ్జి 2024 అక్టోబర్‌లో వీరి వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement