మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివద్ధి సంస్థ (మాడా) అదనపు రాబడి వేటలో పడింది.
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివద్ధి సంస్థ (మాడా) అదనపు రాబడి వేటలో పడింది. ఇందులోభాగంగా సొంత భవనాలపై ప్రకటనలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించనుంది. ఇటీవల జరిగిన మాడా పరిపాలన విభాగం సమావేశంలో ఈ బృహత్తర నిర్ణయానికి అధికారులు ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఈ సంస్థ వీలైనంత త్వరగా ప్రారంభించనుంది.
నగరంలో అక్కడక్కడ మాడాకు చెందిన 56 కాలనీలు ఉండగా, అందులో మూడు వేలకుపైగా భవనాలున్నాయి. ఇందులో కొన్ని భవనాలను అందులో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కు (ఓనర్‌షిప్) కల్పించి నిర్వహణ బాధ్యతలను వారికే అప్పగించింది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక భవనాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఇందులో కొన్ని భవనాలు ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్నాయి. మరికొన్ని కీలక ప్రాంతాలు, రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద ఉన్నాయి.
వీటిపై ప్రకటనలు ఏర్పాటుకు వివిధ వాణిజ్య సంస్థలు ఏనాటి నుంచో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం నగరంలోని అనేక ప్రైవేటు భవనాలపై ప్రకటనల బోర్డులు, హోర్డింగులు విపరీతంగా వెలుస్తున్నాయి. వాటివల్ల ఆ భవన యజమానులకు అదనపు రాబడి వస్తోంది. ఇదే తరహాలో తన సొంత భవనాలపై ప్రకటనలు ఏర్పాటుచేస్తే అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని మాడా భావించింది. అయితే ఈ నిర్ణయం నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు ఎంతమేర స్పందిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇటీవల మాడా భవనాలపై మొబైల్ టవర్లను ఏర్పాటుచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే మొబైల్ కంపెనీలు మాత్రం ఆ భవనాలపై టవర్ల ఏర్పాటుపై ఆసక్తి కనబర్చలేదు. ఇప్పుడు ప్రకటనలు, హోర్డింగులు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంజూరు ఇచ్చినప్పటికీ వాణిజ్య సంస్థల నుంచి ఎంతమేర స్పందన వస్తుంది...? ఎంత మేర ఆదాయం రానుందనే విషయం త్వరలో స్పష్టం కానుంది.