Additional revenue
-
ఏపీకి రూ.4,881 కోట్ల అదనపు ఆదాయం
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న రెండు కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఆయా సంస్థలతో మరోసారి చర్చించడం ద్వారా రూ.4,881 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరింది. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఆయా సంస్థలతో అధికారులు జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలనివ్వడంతో ఖజానాకు పెద్ద ఎత్తున అదనపు ఆదాయం లభిస్తోంది. కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్కో విద్యుత్ ప్రాజెక్టు,భోగాపురంలో జీఎమ్మార్ చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల్లో ఈ అదనపు ఆదాయం దక్కింది. గత సర్కారు హయానికి, ఇప్పటికి ఉన్న తేడాను ఇది మరోసారి రుజువు చేసింది. విద్యుత్తు ప్రాజెక్టులో అదనపు ఆదాయం ఇలా... ►కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్కో విద్యుత్తు ప్రాజెక్టు కోసం 4,766.28 ఎకరాల భూమి ఇచ్చేలా 2018 జూలైలో ఒప్పందం కుదిరింది. ఎకరా కేవలం రూ.2.5 లక్షలకే గత సర్కారు కేటాయించగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక మరోసారి కంపెనీతో చర్చలు జరపడంతో ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున చెల్లించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. అవే ప్రమాణాలతో విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించింది. ►ఎకరానికి రూ.2.5 లక్షల చొప్పున అదనపు ఆదాయం రావడంతో ప్రభుత్వానికి ఇందులో మొత్తం రూ.119 కోట్ల మేర అదనపు ఆదాయం లభించినట్లైంది. ►ఇదే కాకుండా సోలార్/విండ్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసే 1,550 మెగావాట్లలో కూడా మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున చెల్లించేందుకు కంపెనీ అంగీకరింది. తద్వారా ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్ల వ్యవధిలో రూ.322 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది. ►రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్పత్తయ్యే 1,680 మెగావాట్ల విద్యుత్తులో మెగావాట్‌కు మొదటి పాతికేళ్లలో ఏడాదికి రూ.16.8 కోట్లు, ఆ తరువాత ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించనుంది. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 2,940 కోట్ల మేర అదనంగా ఆదాయం వస్తుంది. ►మొత్తంగా ఒక్క గ్రీన్కో విద్యుత్తు ప్రాజెక్టు విషయంలోనే చర్చలు జరపడం ద్వారా రూ.3,381 కోట్ల మేర ప్రభుతానికి అదనపు ఆదాయం లభిస్తుండటం గమనార్హం. గత సర్కారు కేవలం రూ.119 కోట్లు మాత్రమే ఆదాయంగా చూపింది. భోగాపురంలో అదనపు ఆదాయం ఇలా ►గత సర్కారు భోగాపురం విమానాశ్రయం కోసం 2,703 ఎకరాలను కేటాయించగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరపడంతో 2,203 ఎకరాల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి జీఎమ్మార్ సంస్థ ముందుకొచ్చింది. గతంలో ఒప్పందం సమయంలో పేర్కొన్న ప్రతి సదుపాయాన్నీ కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కంపెనీ మారలేదు.. ఒప్పందమూ మారలేదు.. అప్పటికి, ఇప్పటికి మారింది ప్రభుత్వం మాత్రమే. కంపెనీతో మరోసారి చర్చలు జరపడం ద్వారా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరా రూ. 3 కోట్లు చొప్పున లెక్కించినా ప్రభుత్వానికి రూ.1,500 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరినట్లైంది. -
ఆర్టీసీకి అదనపు ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం అప్పులు, నష్టాలు కొండలా పేరుకుపోయినా, చేష్టలుడిగి చూసిన ఆర్టీసీ ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందటంలో చురుగ్గా వ్యవహరిస్తోంది. దండిగా ఆదాయం పొందే అవకాశం ఉన్నా, దాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ వింతగా వ్యవహరించి ఎట్టకేలకు ఇప్పుడు తప్పు దిద్దుకుంటోంది. ఇన్నేళ్లకు సొంతంగా పార్శిల్, కొరియర్ సర్వీ సు ప్రారంభించి దినదినాభివృద్ధి చేసుకుంటోంది. కరోనాతో కార్యకలాపాలు స్తంభించిపోయిన తరుణంలోనూ సగటు న నెలకు రూ.2 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. దాన్ని మరో వారంలో రెట్టింపు చేసుకునేందుకు సిద్ధమైంది. కరోనా సమసిపోయి వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటే సాలీనా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ సేవలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ఆర్టీసీ గతంలో ప్రారంభించి ప్రస్తుతం వార్షికంగా రూ.80 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. ఆ మొత్తాన్ని మరింత పెంచుకునేందు కు కసరత్తు చేస్తోంది. టీఎస్ఆర్టీసీ ప్రయత్నిస్తే అంతకంటే ఎక్కువ ఆదాయం పొందటం కష్టం కాబోదని తెలుస్తోంది. కార్గోతో కలుపుకొంటే రెట్టింపు ఆదాయం.. టీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టిసారించే క్రమంలో సంస్థ సరుకు రవాణా వ్యవస్థను కొత్తగా ప్రారంభించింది. పాత బస్సులను కార్గో బస్సులుగా మార్చి వాటిల్లో, ధాన్యం, పుస్తకాలు, రేషన్ సరుకులు, మందులు, మద్యం.. ఇలా ప్రభుత్వ కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని రకాల సరుకులు తరలించటం ద్వారా సాలీనా రూ.300 కోట్ల మేర ఆదాయాన్ని పొందొ చ్చని అప్పట్లో అంచనా వేసింది. కానీ ఆ ఏర్పాట్లు చేయటంలో సంబంధిత అధికారులు జాప్యం చేయటంతో అది వెంటనే పట్టాలెక్కలేదు. ఈలోపు కరోనా సమస్య రావటంతో ఇబ్బందులేర్పడ్డాయి. దీంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెంటనే పార్శిల్, కొరియర్ సేవలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పాత బస్సుల బాడీ మార్చి సరుకు రవాణా (కార్గో)కు వీలుగా ప్రత్యేక బస్సులు రూపొందిస్తున్నా, ప్రజలు కొరియర్ ద్వారా పంపే చిన్నచిన్న వస్తువులు, కవర్లు పంపేందుకు వీలుగా ప్రయాణికుల బస్సులే వినియోగించాలని నిర్ణయించారు. మంత్రి చొరవతో వెంటనే అది అమలులోకి వచ్చింది. అయితే ప్రారంభంలో ఉండే ఇబ్బందుల వల్ల అనుకున్న స్థాయిలో వెంటనే పుంజుకోలేదు. ఇటీవల జరిగిన ఓ సమీక్షలో సీఎం కేసీఆర్ దీన్ని తీవ్రంగా పరిగణించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్పటివరకు బాధ్యతలు చూసే అధికారిని తప్పించి రవాణాశాఖ మంత్రి ఓఎస్డీగా ఉన్న కృష్ణకాంత్‌ను దీనికి ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆయన తొలి రోజు నుంచే మార్కెట్లో తిరుగుతూ ఆర్డర్లు వచ్చేలా చూశారు. గత వారం రోజులుగా సగటున నిత్యం రూ.6.5 లక్షల ఆదాయం వస్తోంది. దశాబ్దాలుగా కొరియర్, పార్శిల్ సర్వీసు నిర్వహిస్తున్న పేరు న్న పెద్ద ప్రైవేట్ సంస్థలకు కూడా కరోనా కష్టకాలంలో రోజు వారి ఆదాయం రూ. 15 లక్షలకు మించటం లేదు. అలాంటిది అనతి కాలం లోనే ఆర్టీసీ పుంజుకోవటం విశేషం. ఇంతకాలం ప్రైవేటు సంస్థల జేబుల్లోకి.. ఆర్టీసీ బస్సుల్లో పార్శిళ్ల తరలింపు చాలాకాలంగా జరుగుతోంది. కానీ సొంతంగా నిర్వహించకుండా ప్రైవేటు సంస్థలకు ఆ బాధ్యత అప్పగిస్తూ వచ్చారు. ఆ సంస్థలు భారీగా ఆదాయం పొందుతూ ఆర్టీసీకి మాత్రం నామమాత్రపు చార్జీ చెల్లించేవారు. రవాణా మంత్రి ఆ విధానాన్ని మార్చి ఆర్టీసీనే సొంతంగా నిర్వహించేలా చొరవ తీసుకున్నారు. ఏపీలో సంస్థ భారీగా ఆదాయాన్ని పొందుతున్నట్టుగానే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కూడా ఆదాయాన్ని పొందేం దుకు వీలు చిక్కుతోంది. మూడు రోజుల్లో కొత్త ధరలు ‘‘పార్శిల్, కొరియర్ సేవల రూపంలో వస్తున్న రోజువారీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఎవరైనా పార్శిల్ బుక్ చేస్తే వారి ఇంటికే వచ్చి వస్తువులు తీసుకుని, గమ్యస్థానంలోని ఇంటి వరకు చేరవేస్తాం. ఇప్పటికే 300 మంది ఏజెంట్లు, మా సొంత సిబ్బందిని నియమించుకునే పని కొలిక్కి వచ్చింది. మూడ్రోజుల్లో సరుకు రవాణ కోసం కార్గో ధరలను సవరించి కొత్తవి అందుబాటులోకి తెస్తాం. ఇల్లు ఖాళీ చేసేవారు మొదలు ధాన్యం లాంటి పెద్ద సరుకు తరలింపు వరకు కార్గో బస్సులు ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ–కామర్స్ సంస్థలతో కూడా ఒప్పం దం చేసుకుంటున్నాం. వారి వస్తువులు గ్రామీణ ప్రాంతాలకు మేమే చేరవేసేలా చూస్తున్నాం. ఇప్పటికే 150 కార్గో బస్సులు సిద్ధం చేశాం’. – కార్గో విభాగం ప్రత్యేకాధికారి కృష్ణకాంత్ -
అదనపు రాబడి వేటలో మాడా
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివద్ధి సంస్థ (మాడా) అదనపు రాబడి వేటలో పడింది. ఇందులోభాగంగా సొంత భవనాలపై ప్రకటనలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించనుంది. ఇటీవల జరిగిన మాడా పరిపాలన విభాగం సమావేశంలో ఈ బృహత్తర నిర్ణయానికి అధికారులు ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఈ సంస్థ వీలైనంత త్వరగా ప్రారంభించనుంది. నగరంలో అక్కడక్కడ మాడాకు చెందిన 56 కాలనీలు ఉండగా, అందులో మూడు వేలకుపైగా భవనాలున్నాయి. ఇందులో కొన్ని భవనాలను అందులో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కు (ఓనర్షిప్) కల్పించి నిర్వహణ బాధ్యతలను వారికే అప్పగించింది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక భవనాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఇందులో కొన్ని భవనాలు ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్నాయి. మరికొన్ని కీలక ప్రాంతాలు, రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద ఉన్నాయి. వీటిపై ప్రకటనలు ఏర్పాటుకు వివిధ వాణిజ్య సంస్థలు ఏనాటి నుంచో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం నగరంలోని అనేక ప్రైవేటు భవనాలపై ప్రకటనల బోర్డులు, హోర్డింగులు విపరీతంగా వెలుస్తున్నాయి. వాటివల్ల ఆ భవన యజమానులకు అదనపు రాబడి వస్తోంది. ఇదే తరహాలో తన సొంత భవనాలపై ప్రకటనలు ఏర్పాటుచేస్తే అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని మాడా భావించింది. అయితే ఈ నిర్ణయం నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు ఎంతమేర స్పందిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల మాడా భవనాలపై మొబైల్ టవర్లను ఏర్పాటుచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే మొబైల్ కంపెనీలు మాత్రం ఆ భవనాలపై టవర్ల ఏర్పాటుపై ఆసక్తి కనబర్చలేదు. ఇప్పుడు ప్రకటనలు, హోర్డింగులు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంజూరు ఇచ్చినప్పటికీ వాణిజ్య సంస్థల నుంచి ఎంతమేర స్పందన వస్తుంది...? ఎంత మేర ఆదాయం రానుందనే విషయం త్వరలో స్పష్టం కానుంది.