సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న రెండు కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఆయా సంస్థలతో మరోసారి చర్చించడం ద్వారా రూ.4,881 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరింది. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఆయా సంస్థలతో అధికారులు జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలనివ్వడంతో ఖజానాకు పెద్ద ఎత్తున అదనపు ఆదాయం లభిస్తోంది. కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్‌కో విద్యుత్ ప్రాజెక్టు,భోగాపురంలో జీఎమ్మార్ చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల్లో ఈ అదనపు ఆదాయం దక్కింది. గత సర్కారు హయానికి, ఇప్పటికి ఉన్న తేడాను ఇది మరోసారి రుజువు చేసింది.
విద్యుత్తు ప్రాజెక్టులో అదనపు ఆదాయం ఇలా...
►కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్‌కో విద్యుత్తు ప్రాజెక్టు కోసం 4,766.28 ఎకరాల భూమి ఇచ్చేలా 2018 జూలైలో ఒప్పందం కుదిరింది. ఎకరా కేవలం రూ.2.5 లక్షలకే గత సర్కారు కేటాయించగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక మరోసారి కంపెనీతో చర్చలు జరపడంతో ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున చెల్లించేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. అవే ప్రమాణాలతో విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించింది.
►ఎకరానికి రూ.2.5 లక్షల చొప్పున అదనపు ఆదాయం రావడంతో ప్రభుత్వానికి ఇందులో మొత్తం రూ.119 కోట్ల మేర అదనపు ఆదాయం లభించినట్‌లైంది.
►ఇదే కాకుండా సోలార్/విండ్ పవర్ ద్వారా ఉత్పత్తి చేసే 1,550 మెగావాట్లలో కూడా మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున చెల్లించేందుకు కంపెనీ అంగీకరింది. తద్వారా ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్ల వ్యవధిలో రూ.322 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనుంది.
►రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్పత్తయ్యే 1,680 మెగావాట్ల విద్యుత్తులో మెగావాట్‌కు మొదటి పాతికేళ్లలో ఏడాదికి రూ.16.8 కోట్లు, ఆ తరువాత ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించనుంది. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 2,940 కోట్ల మేర అదనంగా ఆదాయం వస్తుంది.
►మొత్తంగా ఒక్క గ్రీన్‌కో విద్యుత్తు ప్రాజెక్టు విషయంలోనే చర్చలు జరపడం ద్వారా రూ.3,381 కోట్ల మేర ప్రభుతానికి అదనపు ఆదాయం లభిస్తుండటం గమనార్హం. గత సర్కారు కేవలం రూ.119 కోట్లు మాత్రమే ఆదాయంగా చూపింది.
భోగాపురంలో అదనపు ఆదాయం ఇలా
►గత సర్కారు భోగాపురం విమానాశ్రయం కోసం 2,703 ఎకరాలను కేటాయించగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలు జరపడంతో 2,203 ఎకరాల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి జీఎమ్మార్ సంస్థ ముందుకొచ్చింది. గతంలో ఒప్పందం సమయంలో పేర్కొన్న ప్రతి సదుపాయాన్నీ కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కంపెనీ మారలేదు.. ఒప్పందమూ మారలేదు.. అప్పటికి, ఇప్పటికి మారింది ప్రభుత్వం మాత్రమే. కంపెనీతో మరోసారి చర్చలు జరపడం ద్వారా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరా రూ. 3 కోట్లు చొప్పున లెక్కించినా ప్రభుత్వానికి రూ.1,500 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరినట్‌లైంది.
Comments
Please login to add a commentAdd a comment