వివిధ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న మంత్రి అమర్‌నాథ్
సాక్షి, అమరావతి: పారిశ్రామిక రంగాన్ని సీఎం జగన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండటంతో రిలయన్స్, బిర్లా, టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. గతేడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కుదిరిన ఒప్పందాలు వేగంగా వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.4,178 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయెన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌కు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులకు బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
‘ఏపీ ఎంఎస్‌ఎంఈ వన్’ వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, హెల్లా ఇన్‌ఫ్రా సంస్థలకు సీఎం తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలను అందిస్తుందని పునరుద్ఘాటించారు. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయని, మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నట్లు వివరించారు.
పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉందని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన భరోసాతో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయని చెప్పారు. గత మూడేళ్లుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పుతుండగా ఏపీ పరిధిలో విశాఖ–చెన్నె, చెన్నె–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాదు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.1,000 కోట్లతో నక్కపల్లి, శ్రీకాళహస్తి నోడ్‌లను అభివృద్ధి చేస్తున్నామని, ఈ రెండు పారిశ్రామిక పార్కుల ద్వారా సుమారు రూ.60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.
తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టి
సుదీర్ఘంగా 974 కి.మీ. పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉన్న మన రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలమని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.20 వేల కోట్లతో నాలుగు ప్రధాన పోర్టులను నిర్మిస్తుండగా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మరో రూ.నాలుగు వేల కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
స్థానిక యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే గత నాలుగేళ్లలో 2.50 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఆరు లక్షల మందికి పైగా ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు 50కిపైగా పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్.రాజేశ్వర్‌రెడ్డితోపాటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment