సాక్షి, న్యూఢిల్లీ: పేదలకు ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన స్టే 50 వేల మందికి పైగా పట్టాదారుల ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను అనుమతించకపోతే ఈడబ్ల్యూఎస్ పరిధిలోని వారి ఆర్థిక శ్రేయస్సు దెబ్బతింటుందని తెలిపింది. ఈ నెల 3న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. ఈ ఏడాది మే 17 నాటి హైకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తే తాజా ఉత్తర్వులు పూర్తిగా అనుచితమని పేర్కొంది. రాజధానికి సంబంధించిన తీర్పు ఈ ఆదేశాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇది సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించినదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రకారం భూ కేటాయింపులపై వాస్తవిక పరిశీలన చేయాలని కోరింది.
కేటాయింపులన్నీ రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తులకే జరిగినట్లు వివరించింది. లాండ్ పూలింగ్ స్కీం నిబంధనలు అతిక్రమించిందనడానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రయోజనం కోసం భూకేటాయింపు పరిశీలన కమిటీ దరఖాస్తులకు అనుగుణంగా కేటాయింపులు ఆమోదించినట్లు తెలిపింది.
గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు భూమిని కేటాయించాలని ఏపీసీఆర్‌డీఏ, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపింది. తదనంతరం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూమి అప్పగించడం జరిగిందని, ఆ జిల్లాల్లోని ప్రజలకు 529.04 ఎకరాలు, 569.46 ఎకరాల భూమిని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయిస్తూ మేజిస్ట్రేట్లు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపింది.
చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు
కేటాయింపుదారులకు మంజూరు చేసిన పట్టాల్లో షరతు ప్రకారం పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల పరిష్కారంపై నిర్మాణం/తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టిందని తెలిపింది. అయితే, పట్టాలో ఉపయోగించిన భాషను హైకోర్టు తప్పుగా అర్థం చేసుకోరాదని తెలిపింది. ఈడబ్యూఎస్ వర్గాలకు చెందిన ఉచిత హౌసింగ్‌కు బయట వ్యక్తి లేదా అంతర్గత వ్యక్తి ప్రాతిపదిక తీసుకొని వివక్ష చూపరాదని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment