ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలిస్తున్న బృందం
సాక్షి, అమరావతి: ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం, ఆహార భద్రత, మహిళా, రైతు సాధికారతకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల నుంచి తాము ఎంతో స్ఫూర్తి పొందామని, తమ దేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమల్లో మహిళా సంఘాలు పోషిస్తున్న పాత్ర అద్భుతమని తెలిపింది.
రాష్ట్ర పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం సభ్యులు మొహమ్మద్, రఫీకుల్ ఇస్లాం, తాఫిక్ హుస్సేన్ షా చౌదురి, ఆఫ్రిన్ సుల్తానా, కపిల్‌కుమార్‌పాల్, శంసాద్ ఫర్జానా, ఏకేఎం జహీరుల్ ఇస్లాంలు శనివారం ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్‌ను సందర్శించారు. పెదవేగి మండలం జనార్దనవరంలో మిచాంగ్ తుపానుపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు.
చిరుధాన్యాలు, పోషక విలువలు కలిగిన దినుసులతో తయారు చేసిన పిండి పదార్థాలతోపాటు, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆకుకూరలు, కాయగూరలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి, వాటి తయారీ గురించి తెలుసుకున్నారు. రైతు సాధికార సంస్థ థిమాటిక్ లీడ్ అరుణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment