Ethiopia Team Praises AP Rythu Bharosa Centres, Details Inside - Sakshi
Sakshi News home page

AP: రైతు భరోసా కేంద్రాలకు ఇథియోపియా బృందం ప్రశంసలు

Published Wed, Oct 12 2022 7:50 PM | Last Updated on Wed, Oct 12 2022 8:14 PM

Ethiopia Team Praises Rythu Bharosa Centres - Sakshi

సాక్షి, అమరావతి: ఇథియోపియా బృందంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.  ఏపీ పర్యటనలో​ భాగంగా ముందుగా గన్నవరంలో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌సెంటర్‌ను ఇథియోపియా బృందం  సందర్శించింది. తర్వాత కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆర్బీకే -2 కేంద్రాన్ని సందర్శించింది.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌

రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, సీఎం జగన్‌ దార్శనికత కనిపిస్తోందని ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి అన్నారు. ఆయన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయి. ఆర్బీకేల వ్యవస్థ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఆర్బీకేల వ్యవస్థ విషయంలో ఈ ప్రభుత్వం నుంచి మేం నేర్చుకోవాల్సింది ఉంది. ఆర్బీకేల్లో వ్యవసాయరంగంలో వివిధ విభాగాల అనుసంధానం బాగుంది.

డిజటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. వ్యవసాయరంగంలో మీకున్న పరిజ్ఞానాన్ని మేం వినియోగించుకుంటాం. అలాగే మాకున్న పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను మీతో పంచుకుంటాం. వ్యవసాయరంగంలో రైతుకు అండగా నిలవాలి, వారికి మంచి జరగాలన్న మీ అభిరుచి, సంకల్పం క్షేత్రస్థాయిలో మంచి మార్పులకు దారితీయడం మమ్మల్ని అబ్బురపరుస్తోందని’’ ఆయన అన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ‘‘మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, కొనసాగుతుంది. ఏ రూపంలో కావాలన్నా మేం తోడుగా ఉంటాం. అలాగే మీ సహాయాన్ని కూడా తీసుకుంటాం. ఆర్బీకేలను సందర్శించడం, అక్కడ రైతులతో మాట్లాడ్డం సంతోషకరం. ప్రతి గ్రామానికీ కూడా వ్యవసాయరంగంలో ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలు చేరుకోవాలన్నది లక్ష్యం, దీంట్లో భాగంగానే ఆర్బీకేలు వచ్చాయి. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందులు, ఎరువుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం మార్గాన్వేషణ చేశాం. అదే సమయంలో రైతుకు సరైన మార్గనిర్దేశం, అవగాహన కల్పించాలన్నది ఉద్దేశం. పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోతే రైతులు ఇబ్బంది పడతారు. ఇవన్నీకూడా మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాం.

అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపడితేం అర్హులందరికీ అది అందాలి. ఈ ఆలోచనల క్రమంలోనే ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది. గ్రామ సచివాలయానికి విస్తరణగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకేలో పెట్టాం. ఆక్వా ప్రాంతాల్లో ఆరంగంలో గ్రాడ్యుయేట్‌ను, హార్టికల్చర్‌ సంబంధిత గ్రాడ్యుయేడ్‌ను ఆర్బీకేల్లో ఉద్యోగాల్లో ఉంచాం. ఆర్బీకేల్లో కియోస్క్‌ను కూడా పెట్టాం. ఆర్డర్‌ ఇచ్చిన వాటిని రైతుల దగ్గరకే చేరుస్తున్నాం. తద్వారా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను నివారిస్తున్నాం. ఆర్బీకేల్లో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం. ఇ–క్రాపింగ్‌ కూడా చేస్తున్నాం

జియో ట్యాగింగ్‌ కూడా చేస్తున్నాం ఇ– క్రాపింగ్‌ను రైతులు కూడా ఆధీకృతం చేస్తున్నారు. ఫిజికల్‌ రశీదు, డిజిటల్‌ రశీదును కూడా ఇస్తున్నాం. పంటలకు వచ్చే ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి సీఎంయాప్‌ను కూడా వినియోగిస్తున్నాం. ఎక్కడైనా ధరలు తగ్గితే అలర్ట్‌ వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి జోక్యం చేసుకుని రైతులకు నష్టంరాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు కనీస మద్దతు ధరలు అందిస్తున్నాం. ప్రతిరోజూకూడా విలేజ్‌అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల నుంచి పంటల ధరలపై నివేదికలు తీసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా ఈ విధానాలను అనుసరిస్తున్నాం. అంకిత భావంతో పనిచేసే అధికారుల వల్ల ఇవన్నీకూడా సాకారమవుతున్నాయి.

వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాలు వచ్చేలా కృషిచేస్తున్నాం. జీవనోపాధి కోసం పట్టణాలకు వచ్చే వలసలను నివారించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు వాడకుండా నివారించాలన్నది మరో లక్ష్యం. దీనికోసం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు కూడా నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాం. సాయిల్‌ టెస్ట్‌ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, రసాయనాలు వాడాలి? అన్నదానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దీనికి సంబంధించి రిపోర్టు కార్డులను కూడా ఇస్తాం. ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను వచ్చే ఏడాది జూన్‌ నుంచి అమల్లోకి తీసుకు వస్తాం’’ అని సీఎం అన్నారు.

ఆర్బీకేల్లో డిజిటల్‌ సొల్యూషన్స్‌ విషయంలో తమకు సహకారాన్ని అందించాల్సిందిగా ఇథియోపియా బృందం కోరగా, కచ్చితంగా సహకారం అందిస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. ఈ భేటీలో ఇథియోపియా బృందంతో పాటు వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, ఏపీస్టేట్‌ సీడ్స్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ జి. శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement