హామీలను మించి లబ్ధి | BC Leaders Praises YS Jagan Mohan Reddy Government Budget In AP | Sakshi
Sakshi News home page

హామీలను మించి లబ్ధి

Published Mon, Jul 15 2019 2:24 AM | Last Updated on Mon, Jul 15 2019 11:11 AM

BC Leaders Praises YS Jagan Mohan Reddy Government Budget In AP - Sakshi

సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నవ శకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారని బీసీ సంఘాల నేతలు, ప్రముఖులు కొనియాడుతున్నారు. రాజ్యాధికారంలో బీసీలకు సింహభాగం కల్పించడమే కాకుండా.. బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమిచ్చారని ప్రశంసిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో బీసీ ఉప ప్రణాళికకు మేనిఫెస్టోలో చెప్పినదానికంటే అధికంగా నిధుల కేటాయింపుతో చరిత్ర తిరగరాశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి మార్గం సుగమం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్య గౌడ్‌ (రిటైర్డ్‌), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య వంటి ప్రముఖులతోపాటు బీసీ కులాల ప్రతినిధులు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజ్యాధికారం అంటే ఇదీ..
బీసీలకు నిజమైన రాజ్యాధికారం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చూపించారని బీసీ సామాజికవర్గ ప్రముఖులు కొనియాడుతున్నారు. అందుకు ఆయన మంత్రివర్గ కూర్పే నిదర్శనమని ఆర్‌.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం కేటాయిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఆ వర్గాలకు తన మంత్రివర్గంలో ఏకంగా 60 శాతం పదవులు కేటాయించారు. అంతేకాకుండా బీసీవర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. బీసీ వర్గానికి చెందిన మంత్రులకు కీలకమైన శాఖలను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకమైన రెవెన్యూ, పురపాలక, జలవనరులు, ఆర్‌ అండ్‌ బి, కార్మిక శాఖలను ఆ వర్గాలకు ఇచ్చారు. అతి ముఖ్యమైన అసెంబ్లీ స్పీకర్‌ పదవిని కూడా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు ఇవ్వడం విశేషం.

ఇక మీదట నియమించనున్న అన్ని నామినేటెడ్‌ పోస్టుల్లోనూ బీసీలకే అగ్ర ప్రాధాన్యం ఇస్తామని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. దాంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నట్లుగా స్పష్టమవడంతో ఆ వర్గాలకు ఆనందం కలిగిస్తోంది. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టడాన్ని ఆర్‌.కృష్ణయ్య ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో బీసీ పార్టీలని చెప్పుకుంటున్న పార్టీలు కూడా ఇంత వరకు ఆ దిశగా ప్రయత్నించలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం సామాజిక న్యాయ సాధన కోసం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు తమ పార్టీ ద్వారా బిల్లును ప్రవేశపెట్టడం మంచి పరిణామమన్నారు. ఆయన ప్రయత్నం దేశంలో చర్చకు దారి తీసిందని, సామాజిక న్యాయ సాధనకు ముందడుగు వేశారని ప్రశంసించారు. 

మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే అధికం
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌ బడ్జెట్‌లో నిధులు కేటాయించారని బీసీ వర్గాలు కొనియాడుతున్నాయి. బీసీ ఉప ప్రణాళికకు ఏటా రూ.15 వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ అంతకంటే కొంచెం ఎక్కువగానే 2019–20 బడ్జెట్‌లో బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి చెప్పారు. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం కేటాయించిన దానికంటే 23.46 శాతం అధికంగా కేటాయించడం విశేషం. బీసీల సంక్షేమానికి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ దేశంలో అందరి దృష్టిని ఆకర్షించారని జస్టిస్‌ ఈశ్వరయ్య (రిటైర్డ్‌) అన్నారు. 

కార్పొరేషన్లతో 139 కులాలకు నేరుగా లబ్ధి
బీసీ కుటుంబాలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టమైన కార్యాచరణ చేపట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రశంసించారు. ప్రస్తుతం ఏపీలో 29 బీసీ కులాలకే ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి. దాంతో ఆయా ఉప కులాల్లోని పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతూ వచ్చింది.  బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అన్నట్లుగానే బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తొలి బడ్జెట్‌లోనే ప్రకటించింది. అంటే కొత్తగా మరో 110 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ఆయా బీసీ ఉప కులాల్లోని లబ్ధిదారులకు అందించడం సాధ్యపడుతుంది. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా మహిళలకు నాలుగు విడతలుగా ఇచ్చే రూ.75 వేలను ఈ కొత్త కార్పొరేషన్ల ద్వారానే అందిస్తారు. దళారుల బెడద లేకుండా ఇతర ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధిదారులకు సకాలంలో అందుతాయి. ఇది బీసీలందరికీ ప్రయోజనం కలిగిస్తుందని బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంక్షేమ పథకాల్లో సగం బీసీలకే
ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా బీసీలకే అత్యధికంగా లబ్ధి కలిగేలా ప్రభుత్వ పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌ రూపొందించారని జస్టిస్‌ ఈశ్వరయ్య (రిటైర్డ్‌) పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పథకాల్లోను దాదాపు 50 శాతం మంది లబ్ధిదారులు బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నందున ఈ ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించిందనడానికి నిదర్శనమన్నారు. అందులో అత్యధికంగా విద్య, ఉపాధి కల్పనకు సంబంధించిన పథకాలు ఉండటం బీసీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపకరిస్తుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, సామాజిక పింఛన్లు, కౌలు రైతుల సంక్షేమం.. ఇలా అన్ని పథకాల్లోనూ సగం మంది లబ్ధిదారులు బీసీలేనన్నది సుస్పష్టం. ఈ దృష్ట్యా ప్రధానంగా బీసీ విద్యార్థుల విద్యాభ్యాసానికి సీఎం వైఎస్‌ జగన్‌ బాసటగా నిలిచారని జస్టిస్‌ ఈశ్వరయ్య (రిటైర్డ్‌) ప్రశంసించారు. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి, కాలేజీలకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నారు.

తద్వారా రాష్ట్రంలో 4.50 లక్షల మంది తల్లులకు ప్రయోజనం కలగనుంది. వారిలో దాదాపు 50 శాతం అంటే 2 లక్షల మందికిపైగా బీసీలు ఉన్నారు. వారి కోసమే రూ.1,294.73 కోట్లు కేటాయించడం విశేషం. ఇక వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ.20 వేలు చొప్పున చెల్లిస్తారు. తద్వారా రాష్ట్రంలో 15,35,911 మంది విద్యార్థుల తల్లులకు ఊరట కలుగుతుంది. వారిలో దాదాపు 7.82 లక్షల మంది బీసీ వర్గాలకు చెందినవారే ఉంటారని అధికారుల అంచనా. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. అందుకోసం ఏకంగా రూ.3,151.74 కోట్లు కేటాయించారు. దీని ద్వారా రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 

బీసీ రైతులకు బాసట
బీసీ రైతుల కష్టాలు తీర్చడం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. చరిత్రలో తొలిసారి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఉద్దేశించిన  ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకం కింద రైతులకు ఏటా రూ.12,500 ఆర్థిక సహాయం చేస్తారు. దాంతో రాష్ట్రంలో 64.07లక్షల మంది రైతులు, 15.37 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కలగనుంది. రైతుల్లో దాదాపు 40 శాతం మంది, కౌలు రైతుల్లో 50 శాతం మంది బీసీలే ఉన్నారని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దాంతో రైతు భరోసా పథకం ద్వారా దాదాపు 26 లక్షల మంది బీసీ రైతులు, దాదాపు 8 లక్షల మంది బీసీ కౌలు రైతులకు లబ్ధి చేకూరనుంది. 

పింఛన్ల ద్వారా భారీగా లబ్ధి
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సామాజిక పింఛన్ల పెంపు ద్వారా బీసీల సామాజిక భద్రతకు అండగా నిలిచిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య కొనియాడారు. సామాజిక పింఛన్లను దశల వారీగా రూ.3 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. మొదటి దశగా ఈ ఏడాది రూ.2,250కు పెంచింది. అంతే కాకుండా వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. తలసేమియా, పక్షవాతం, కుష్టు రోగులు, డయాలసిస్‌ పేషంట్లకు నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం పింఛన్‌ అందుకుంటున్న 53.32 లక్షల మందికి అదనంగా మరో 11.20 లక్షల మంది అర్హులవుతారు. అంటే సామాజిక పింఛన్ల లబ్ధిదారులు 64.52 లక్షల మందిలో దాదాపు 30 లక్షల మంది బీసీలే ఉంటారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంతేకాకుండా బీసీ కమిషన్‌ను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు సామాజిక న్యాయం త్వరితగతిన సాధ్యమవుతుందని ఆర్‌.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. 

మనసున్న ప్రభుత్వం.. 
బీసీల సంక్షేమం అంటే చంద్రబాబులా కేవలం నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం కాదు.. వారికి ఆర్థిక స్వావలంబన కలిగిస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో తరచూ చెప్పేవారు. అన్నట్లుగానే సీఎం కాగానే తొలి బడ్జెట్‌లో బీసీల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి పెద్దపీట వేశారు. బీసీల్లోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి కుల వృత్తులకు అండగా నిలిచారు. మత్య్సకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, రజకులు.. ఇలా అన్ని బీసీ కులాల సంక్షేమానికి ఉపక్రమించారు. దర్జీలు, ఆటో డ్రైవర్లు.. ఇలా బీసీలే అత్యధికంగా ఉండే వివిధ కార్మిక వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. ఇక జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, సామాజిక పింఛన్లు.. ఇలా అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ 50 శాతం వరకు బీసీలకే లబ్ధి చేకూరునుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
 
మత్స్యకారులకు వరాలు
పొడవైన తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న మత్స్యకారులపై సీఎం వైఎస్‌ జగన్‌ వరాల జల్లు కురిపించారని  విశాఖ కోస్టల్‌ మెక్‌నైజ్డ్‌ ఫిషింగ్‌ బోట్‌ ఆపరేటర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బర్రి కొండ బాబు సంతోషం వ్యక్తం చేశారు.  సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. తద్వారా రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మత్స్యకార కుటుంబాలకు చెందిన 30 లక్షల మంది జీవితాలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న భృతి రూ.4 వేలను ఏకంగా రూ.10 వేలకు పెంచారు. అందుకోసం రూ.100 కోట్లు కేటాయించారు. దాంతో మత్స్యకార కుటుంబాల్లో ధైర్యాన్ని కల్పించారు. సముద్రంలో వేటకు వెళ్లే బోట్ల డీజిల్‌పై రాయితీని రూ.6.03 నుంచి రూ.12.93కు పెంచారు. దాంతో బోటు యజమానులైన మత్స్యకారులకు భరోసా కలిగిందని రాజు అనే మత్స్యకారుడు ఆనందంతో చెప్పారు.  

  • చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు అందిస్తామని ప్రకటించారు. తద్వారా దాదాపు లక్ష కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. 
  • కుల వృత్తులపై ఆధారపడిన నాయిబ్రాహ్మణ, రజక కుటుంబాలకు ఏటా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 1.92 లక్షల మంది రజకులు, 23 వేల మంది నాయిబ్రాహ్మణులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. 
  • వైఎస్సార్‌ బీమా పథకంతో బీసీ కుటుంబాలకు భరోసా కలిగించారు. బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు.
  •  వైఎస్సార్‌ కల్యాణ కానుక పథకం ద్వారా బీసీ యువతుల వివాహానికి ప్రభుత్వం చేయూతనివ్వనుంది. ఒక్కో వధువుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. తద్వారా ఒక్క 2019–20లో 75 వేల మంది వధువులకు ప్రయోజనం కలుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement