జూన్ 15న మాడా లాటరీ
- రేపటి నుంచి యూజర్ అకౌంట్లకోసం పేర్ల నమోదు ప్రక్రియ
- మే ఆరు నుంచి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) వివిధ వర్గాల కోసం నిర్మించిన ఇళ్లకు లాటరీ తీసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల నియమావళి కారణంగా వాయిదా పడిన ఈ ప్రక్రియ మే 28వ తేదీ వరకు కొనసాగుతుందని మాడా అధికారులు ప్రకటించారు. 2,641 ఇళ్లకు మొదటగా నిర్ణయించిన మే 31నాడు కాకుండా జూన్ 15వ తేదీన లాటరీ తీస్తామన్నారు. ఆన్‌లైన్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి యూజర్ అకౌంట్ల కోసం పేర్లు నమోదు చేసుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియ మే 28వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు.
అంతకుముందు ముంబైలోని కుర్లా, మాన్‌ఖుర్డ్, సైన్, పొవాయి, శాంతాక్రజ్, బోరివలి, దహిసర్ తదితర ప్రాంతాల్లోని 814 భవనాలు, విరార్‌బోలింజ్‌లోని 1,716, సింధుదుర్గా జిల్లా వెంగుర్లాలోని 111 భవనాలలోని ఇళ్ల కోసం మే 31న లాటరీ తీయనున్నట్టు ఫిబ్రవరి 28న మాడా ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనలో ఏప్రిల్ 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొంది. అయితే ఎన్నికల నియమావళి కారణంగా ఈ ప్రక్రియను వాయిదా వేసింది. రాష్ట్రంలో ఈ నెల 24న ఎన్నికలు పూర్తి కావడంతో ఈసీ కోడ్ సడలించింది. తాజాగా మాడా ఇళ్ల కోసం లాటరీ తేదీని ఖరారు చేసింది.
ఈ ప్రకటన ప్రకారం మాడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదుచేసుకుని యూజర్ అకౌంటర్లను రూపొందించుకోవాలి. ఈ యూజర్ అకౌంట్‌లో తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ మే 28వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు యూజర్ అకౌంట్లను రూపొందించుకున్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను మే ఆరో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభించనున్నారు. ఇది మే 30వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.
డిపాజిట్ నగదును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇవ్వాలనుకునే దరఖాస్తుదారులు యాక్సిస్ బ్యాంక్‌లో జూన్ రెండో తేదీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం లాటరీ కోసం స్వీకరించినవారి దరఖాస్తుదారుల పేర్లను వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. జూన్ 15వ తేదీ బాంద్రాలోని రంగశారద హాల్‌లో ఉదయం 10 గంటలకు లాటరీ తీయనున్నారు. లాటరీలో ఇళ్లు లభించిన వారి వివరాలను వెబ్‌సైట్‌లో అదే రోజు పొందుపరుస్తారని మాడా అధికారి ఒకరు తెలిపారు.
మాడా లాటరీ వివరాలు...
యూజర్ అకౌంట్ల కోసం పేర్ల నమోదు ప్రక్రియ: ఏప్రిల్ 28 నుంచి మే 28 సాయంత్రం ఆరు గంటల వరకు
దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ: మే 6 నుంచి మే 30
స్వీకరించిన దరఖాస్తు దారుల జాబితా: జూన్ 9
లాటరీ: జూన్ 15