user accounts
-
కస్టమర్లను బ్యాన్ చేస్తున్న అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈజీ రిటర్న్ పాలసీ ఇక నుంచి మీరు అనుకున్నంత సరళంగా ఏం ఉండబోదు. తమ ప్లాట్‌ఫామ్‌పై నిబంధనలను ఉల్లంఘిస్తున్న కొనుగోలుదారులను అమెజాన్ ఇంక్ బ్యాన్ చేస్తోంది. షాపింగ్ చేసి ఉత్పత్తులను కొనుగోలు చేసిన అనంతరం, ఒక్కోసారి ఎలాంటి కారణం లేకుండా వాటిని వెనక్కి ఇచ్చేయడం, ఎక్కువగా రిటర్నులు పెట్టడం చేస్తున్న వారిపై అమెజాన్ చర్యలు తీసుకుంటున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. గత కొన్నేళ్లుగా అమెజాన్ పలువురు కస్టమర్ల అకౌంట్లను రద్దు చేసిందని, ఎలాంటి కారణం లేకుండా తమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వారిపై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. కస్టమర్-సెంట్రిక్ కంపెనీగా అమెజాన్‌కు పేరుంది. అమెజాన్ మాదిరే చాలా ఈ-రిటైలర్లు, ఇతర స్టోర్లు ఈజీ ఫ్రీ రిటర్న్ పాలసీని అవలంభిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ-రిటైల్ స్పేస్‌లో పోటీ విపరీతంగా పెరిగింది. అయితే ప్రస్తుతం ఇవే రిటర్న్ పాలసీలు కస్టమర్లకు సమస్యలను సృష్టిస్తున్నట్టు తెలిసింది. అమెజాన్ ముందస్తుగా ఎలాంటి నోటీసు లేకుండా తమ అకౌంట్లను క్లోజ్ చేసినట్టు పలువురు కస్టమర్లు ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో ఫిర్యాదు చేశారు. ఒక కస్టమర్ అయితే ఏకంగా అమెజాన్ నుంచి వచ్చిన ఈ-మెయిల్‌ను స్క్రీన్‌షాట్ తీసి షేర్చేసింది. గత 12 నెలల్లో ఎందుకు పలు ఆర్డర్లను వెనక్కి తిరిగి ఇచ్చేశారు, దానికి సమాధానం చెప్పండని అమెజాన్ అడిగినట్టు ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది. తమ పాలసీలను ఉల్లంఘిస్తున్నందుకే యూజర్లను తమ ప్లాట్‌ఫామ్‌పై బ్యాన్ చేసినట్టు అమెజాన్ పేర్కొంటోంది. అమెజాన్ తన ప్లాట్‌ఫామ్‌పై యూజర్లను బ్యాన్ చేయడం ఇదేమీ తొలిసారి కాదని, అంతకముందు కూడా పలువురు ప్రైమ్ మెంబర్లను బ్యాన్ చేసిందని తెలిసింది. అప్పుడు కూడా అమెజాన్ సరియైన వివరణ ఇవ్వలేదు. ఇదే విషయంపై కొంతమంది అమెజాన్‌కు వ్యతిరేకంగా దావా కూడా వేశారు. -
ఆధార్ లింక్‌పై ఫేస్బుక్ క్లారిటీ
నకిలీ ఖాతాలను అరికట్టడానికి ఫేస్బుక్ తన యూజర్ అకౌంట్లకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేస్తుందని వస్తున్న వార్తలపై సోషల్ మీడియా దిగ్గజం స్పందించింది. భారత్‌లో యూజర్ అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయడం లేదని ఫేస్బుక్ స్పష్టత ఇచ్చింది. బ్లాగ్ పోస్టు ద్వారా సోషల్ మీడియా దిగ్గజం ఈ క్లారిటీ ఇచ్చింది. తాము ఆధార్ డేటాను సేకరించడం లేదని, ఫేస్‌బుక్‌లోకి సైన్-అప్ అయ్యేటప్పుడు ఆధార్ నెంబర్‌ను యూజర్లు నమోదుచేయాల్సినవసరం లేదని పేర్కొంది. ఇదేసమయంలో యూజర్లు తమ అకౌంట్లకు ఆధార్ కార్డుపై ఉన్న పేరును వాడితే బాగుంటుందని ఇది సూచించింది. దీంతో తమ ప్లాట్‌ఫామ్‌పై యూజర్లను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు తేలికగా కనుగొనవచ్చన్నారు. ''మేము పరీక్షిస్తున్న వాటిలో ఇది ఆప్షనల్. ఆధార్ కార్డుపై ఉన్న పేరును నమోదుచేయాల్సినవసరం లేదు. ఆధార్‌తో ఎలాంటి ప్రమాణీకరణ లేదు'' అని కంపెనీ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. కానీ తాము టెస్ట్ చేస్తున్న దీంతో పేస్‌బుక్‌లో ఎలా సైన్-అప్ అవ్వాల్లో కొత్త యూజర్లకు అర్థమవుతుందని, కుటుంబసభ్యులు, స్నేహితులు తేలికగా కనెక్ట్ అవ్వచ్చని చెప్పింది. -
జూన్ 15న మాడా లాటరీ
- రేపటి నుంచి యూజర్ అకౌంట్లకోసం పేర్ల నమోదు ప్రక్రియ - మే ఆరు నుంచి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) వివిధ వర్గాల కోసం నిర్మించిన ఇళ్లకు లాటరీ తీసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల నియమావళి కారణంగా వాయిదా పడిన ఈ ప్రక్రియ మే 28వ తేదీ వరకు కొనసాగుతుందని మాడా అధికారులు ప్రకటించారు. 2,641 ఇళ్లకు మొదటగా నిర్ణయించిన మే 31నాడు కాకుండా జూన్ 15వ తేదీన లాటరీ తీస్తామన్నారు. ఆన్లైన్లో సోమవారం మధ్యాహ్నం నుంచి యూజర్ అకౌంట్ల కోసం పేర్లు నమోదు చేసుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియ మే 28వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. అంతకుముందు ముంబైలోని కుర్లా, మాన్‌ఖుర్డ్, సైన్, పొవాయి, శాంతాక్రజ్, బోరివలి, దహిసర్ తదితర ప్రాంతాల్లోని 814 భవనాలు, విరార్బోలింజ్లోని 1,716, సింధుదుర్గా జిల్లా వెంగుర్లాలోని 111 భవనాలలోని ఇళ్ల కోసం మే 31న లాటరీ తీయనున్నట్టు ఫిబ్రవరి 28న మాడా ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనలో ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొంది. అయితే ఎన్నికల నియమావళి కారణంగా ఈ ప్రక్రియను వాయిదా వేసింది. రాష్ట్రంలో ఈ నెల 24న ఎన్నికలు పూర్తి కావడంతో ఈసీ కోడ్ సడలించింది. తాజాగా మాడా ఇళ్ల కోసం లాటరీ తేదీని ఖరారు చేసింది. ఈ ప్రకటన ప్రకారం మాడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేసుకుని యూజర్ అకౌంటర్లను రూపొందించుకోవాలి. ఈ యూజర్ అకౌంట్లో తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ మే 28వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు యూజర్ అకౌంట్లను రూపొందించుకున్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను మే ఆరో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభించనున్నారు. ఇది మే 30వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. డిపాజిట్ నగదును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇవ్వాలనుకునే దరఖాస్తుదారులు యాక్సిస్ బ్యాంక్‌లో జూన్ రెండో తేదీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం లాటరీ కోసం స్వీకరించినవారి దరఖాస్తుదారుల పేర్లను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. జూన్ 15వ తేదీ బాంద్రాలోని రంగశారద హాల్లో ఉదయం 10 గంటలకు లాటరీ తీయనున్నారు. లాటరీలో ఇళ్లు లభించిన వారి వివరాలను వెబ్సైట్లో అదే రోజు పొందుపరుస్తారని మాడా అధికారి ఒకరు తెలిపారు. మాడా లాటరీ వివరాలు... యూజర్ అకౌంట్ల కోసం పేర్ల నమోదు ప్రక్రియ: ఏప్రిల్ 28 నుంచి మే 28 సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ: మే 6 నుంచి మే 30 స్వీకరించిన దరఖాస్తు దారుల జాబితా: జూన్ 9 లాటరీ: జూన్ 15