demand draft
-
మనీలాండరింగ్ కేసు: టీఎంసీ ఆస్తులు ఈడీ అటాచ్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రూ.10.29 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ సోమవారం పేర్కొంది. ఆల్కెమిస్ట్ గ్రూప్, ఇతరులు చేసిన మనీలాండరింగ్ నేరంపై విచారణ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ. 10.29 కోట్లను ఈడీ టెండర్ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) రూపంలో అటాచ్ చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు ఉపయోగించిన విమాన/హెలికాప్టర్ సేవలకు పలు విమానయాన కంపెనీలకు ఆల్కెమిస్ట్ గ్రూప్ దాదాపు రూ.10.29 కోట్లు చెల్లించినట్లు ఈడీ పేర్కొంది. ఇక.. అప్పటి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు అయిన.. సీఎం మమతా బెనర్జీ, పార్టీ ఎమ్మెల్యే, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్, నటుడు మూన్‌మూన్ సేన్, ఎంపీ నుస్రత్ జహాన్ కోసం టీఎంసీ విమాన సేవలు ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. ప్రజల డబ్బులో కొంత సొమ్మును టీఎంసీ ప్రచారంలో విమానయాన కంపెనీలకు చెల్లించేందుకు సదరు ఆల్కెమిస్ట్ గ్రూప్‌ను ఉపయోగించుకున్నట్లు ఈడీ విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఆల్కెమిస్ట్ గ్రూప్.. టీఎంసీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేడీ సింగ్‌ది కావటం గమనార్హం. -
డీడీపై కొనుగోలుదారు పేరు
న్యూఢిల్లీ: డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)లపై కొనుగోలు చేస్తున్న వారి పేరు కూడా ఉండాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 15 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. దీంతో పే ఆర్డర్, బ్యాంకర్స్ చెక్, డీడీలపై కొనుగోలు చేసే వారి పేరు కూడా ఇకపై కనిపించనుంది. కేవైసీ నిబంధనల్లో ఆర్బీఐ ఈ మేరకు అవసరమైన మార్పులు కూడా చేసింది. డీడీలను మనీ ల్యాండరింగ్‌కు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో డీడీలు, బ్యాంకర్స్ చెక్, పే ఆర్డర్‌పై కొనుగోలుదారు పేరును కూడా పేర్కొనాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక, ఆర్బీఐ నిబంధనల మేరకు డీడీ, ఎన్ఈఎఫ్టీ/ఐఎంపీఎస్ లేదా ఏదేనీ ఇతర మాధ్యమం ద్వారా చేసే చెల్లింపులు రూ.50,000 అంతకంటే ఎక్కువ ఉంటే... నగదు ద్వారా కాకుండా చెక్, బ్యాంకు కస్టమర్ల ఖాతాల నుంచి డెబిట్ ద్వారానే అనుమతించాల్సి ఉంటుంది. -
చిన్న సంస్థలకు ఈపీఎఫ్‌వో ఊరట...
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధికి తమ వంతుగా కట్టాల్సిన మొత్తాన్ని జమ చేసే విధానం విషయంలో చిన్న సంస్థలకు ఈపీఎఫ్‌వో కొంత వెసులుబాటు కల్పించింది. ఇంతకు ముందు లాగానే సుమారు రూ. 1లక్ష కన్నా తక్కువగా జమ చేయాల్సిన మొత్తాన్ని చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల ద్వారా చెల్లించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మాత్రం ఆయా కంపెనీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జమ చేయాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌వో పేర్కొంది. -
మూడేళ్లలో మిగులు విద్యుత్
విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మారెడ్డి డీడీ కట్టిన వెంటనే రైతులకు కొత్త కనెక్షన్ ఇస్తామని హామీ సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విద్యుత్ శాఖ నూతన మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) చెల్లించిన వెంటనే రైతులకు కొత్త విద్యుత్తు కనెక్షన్లు అందించేందుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా చెప్పారు. రైతులు అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా ఈ విధానం అమలు చేస్తామన్నారు. కొత్త కనెక్షన్లకోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులు ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోలేదని... ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి చెప్పారు. వీలైనంత తొందరగా ఈ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులు పూర్తి కాకపోవటంతో... తెలంగాణలోని రైతులు బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందని.. దీన్ని అధిగమించటంతో పాటు మూడేళ్ల వ్యవధిలో అదనపు విద్యుత్ లభ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కేంద్రాలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కరెంటు కొరతను అధిగమిస్తామని అన్నారు. ప్రస్తుతమున్న తరుణంలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖను అప్పగించటంతో తనపై బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. మహబూబ్‌నగర్ నుంచి మంత్రిగా తనకు అవకాశం కల్పించినందుకు ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ, జెన్కో, ట్రాన్స్‌కో డెరైక్టర్లు, వివిధ విభాగాల అధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు. -
రేటివ్వలేదు.. ఇసుక రావట్లేదు
ఏలూరు (టూ టౌన్) : జిల్లాలో ఇసుక విక్రయాలకు అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినా.. రవాణాకు మార్గం సుగమం చేయడంలో మాత్రం వెనుకబడ్డారు. జిల్లాలోని 16 రీచ్‌ల నుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేసేం దుకు ఆసక్తిగల వాహన యజమానుల నుంచి రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినప్పటికీ రవాణా ధరలు మాత్రం ఖరారు కాలేదు. వారం రోజుల క్రితం టెండర్లు తెరిచే సమయంలో అధికారుల నిర్ణయాన్ని వాహన యజమానులు వ్యతిరేకించారు. ఆ తరువాత లారీ యజమానుల సమక్షంలో టెండర్లు తెరిచినప్పటికీ రవాణా ధరలను మాత్రం ఖరారు చేయలేదు. ముందుగా టెండర్లు ఆహ్వానించినప్పుడు నిర్ణయించిన ధరలకు వాహన యజమానులు ఇసుక రవాణా చేస్తున్నా.. వాహనాలు పూర్తిస్థాయిలో లేకపోవటంలో వినియోగదారులకు సకాలంలో అందటం లేదు. ప్రస్తుతం లారీల ద్వారా 10 టన్నుల ఇసుక రవాణా చేసే వాహన యజమానులకు కిలోమీటరుకు రూ.65, 17 టన్నుల వాహనానికి రూ.90 చొప్పున ఇస్తున్నారు. ట్రాక్టర్‌కు మాత్రం కిలోమీటరుకు రూ.28 చొప్పున రవాణా చార్జీలు నిర్ణయించారు. ప్రస్తుతం విజయరాయి, నబీపేట రీచ్‌లలో క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.500 ధర నిర్ణయించారు. ఆ మొత్తాలకు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి, వాహనాన్ని వినియోగదారులు సమకూర్చుకుంటే, అం దులో ఇసుకను లోడుచేసి అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. మిగతా రీచ్‌లలో క్యూబిక్ మీటరుకు రూ.650 చొప్పున డీడీ తీయాల్సి ఉంది. ఈ రీచ్‌లకూ డీడీలు, వాహనాల్ని తీసుకెళితే ఇసుక లోడు వేసి ఇస్తామని స్వయంగా కలెక్టర్ ప్రకటించినా అమలు కావడం లేదు. అధికారులు స్పందించి రవాణా విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఇసుక సమస్య తీరే పరిస్థితి కనిపించడం లేదు. -
జూన్ 15న మాడా లాటరీ
- రేపటి నుంచి యూజర్ అకౌంట్లకోసం పేర్ల నమోదు ప్రక్రియ - మే ఆరు నుంచి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) వివిధ వర్గాల కోసం నిర్మించిన ఇళ్లకు లాటరీ తీసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల నియమావళి కారణంగా వాయిదా పడిన ఈ ప్రక్రియ మే 28వ తేదీ వరకు కొనసాగుతుందని మాడా అధికారులు ప్రకటించారు. 2,641 ఇళ్లకు మొదటగా నిర్ణయించిన మే 31నాడు కాకుండా జూన్ 15వ తేదీన లాటరీ తీస్తామన్నారు. ఆన్లైన్లో సోమవారం మధ్యాహ్నం నుంచి యూజర్ అకౌంట్ల కోసం పేర్లు నమోదు చేసుకుంటామని తెలిపారు. ఈ ప్రక్రియ మే 28వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. అంతకుముందు ముంబైలోని కుర్లా, మాన్‌ఖుర్డ్, సైన్, పొవాయి, శాంతాక్రజ్, బోరివలి, దహిసర్ తదితర ప్రాంతాల్లోని 814 భవనాలు, విరార్బోలింజ్లోని 1,716, సింధుదుర్గా జిల్లా వెంగుర్లాలోని 111 భవనాలలోని ఇళ్ల కోసం మే 31న లాటరీ తీయనున్నట్టు ఫిబ్రవరి 28న మాడా ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనలో ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొంది. అయితే ఎన్నికల నియమావళి కారణంగా ఈ ప్రక్రియను వాయిదా వేసింది. రాష్ట్రంలో ఈ నెల 24న ఎన్నికలు పూర్తి కావడంతో ఈసీ కోడ్ సడలించింది. తాజాగా మాడా ఇళ్ల కోసం లాటరీ తేదీని ఖరారు చేసింది. ఈ ప్రకటన ప్రకారం మాడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేసుకుని యూజర్ అకౌంటర్లను రూపొందించుకోవాలి. ఈ యూజర్ అకౌంట్లో తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ మే 28వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు యూజర్ అకౌంట్లను రూపొందించుకున్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను మే ఆరో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభించనున్నారు. ఇది మే 30వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. డిపాజిట్ నగదును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇవ్వాలనుకునే దరఖాస్తుదారులు యాక్సిస్ బ్యాంక్‌లో జూన్ రెండో తేదీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం లాటరీ కోసం స్వీకరించినవారి దరఖాస్తుదారుల పేర్లను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. జూన్ 15వ తేదీ బాంద్రాలోని రంగశారద హాల్లో ఉదయం 10 గంటలకు లాటరీ తీయనున్నారు. లాటరీలో ఇళ్లు లభించిన వారి వివరాలను వెబ్సైట్లో అదే రోజు పొందుపరుస్తారని మాడా అధికారి ఒకరు తెలిపారు. మాడా లాటరీ వివరాలు... యూజర్ అకౌంట్ల కోసం పేర్ల నమోదు ప్రక్రియ: ఏప్రిల్ 28 నుంచి మే 28 సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ: మే 6 నుంచి మే 30 స్వీకరించిన దరఖాస్తు దారుల జాబితా: జూన్ 9 లాటరీ: జూన్ 15