మూడేళ్లలో మిగులు విద్యుత్
విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మారెడ్డి
డీడీ కట్టిన వెంటనే రైతులకు కొత్త కనెక్షన్ ఇస్తామని హామీ
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విద్యుత్ శాఖ నూతన మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) చెల్లించిన వెంటనే రైతులకు కొత్త విద్యుత్తు కనెక్షన్లు అందించేందుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా చెప్పారు. రైతులు అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా ఈ విధానం అమలు చేస్తామన్నారు. కొత్త కనెక్షన్లకోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులు ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోలేదని... ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి చెప్పారు. వీలైనంత తొందరగా ఈ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులు పూర్తి కాకపోవటంతో... తెలంగాణలోని రైతులు బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందని.. దీన్ని అధిగమించటంతో పాటు మూడేళ్ల వ్యవధిలో అదనపు విద్యుత్ లభ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కేంద్రాలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కరెంటు కొరతను అధిగమిస్తామని అన్నారు. ప్రస్తుతమున్న తరుణంలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖను అప్పగించటంతో తనపై బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. మహబూబ్‌నగర్ నుంచి మంత్రిగా తనకు అవకాశం కల్పించినందుకు ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, టీఎస్ జెన్‌కో, టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ, జెన్‌కో, ట్రాన్స్‌కో డెరైక్టర్లు, వివిధ విభాగాల అధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు.