మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పక్కన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు
అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి.. నిర్వాసితులకు మేలు చేస్తామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌లో మంపు నిర్వాసితులు చేపట్టిన దీక్ష శిబిరానికి వారు చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు.
సాక్షి, జడ్చర్ల : అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి.. నిర్వాసితులకు మేలు చేస్తామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్ ప్రజలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం అక్కడి శిబిరానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో నిర్వాసిత కుటుంబాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో సేకరించిన భూములకు అతి తక్కువ ధరలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పనిగట్టుకుని రెచ్చ గొడుతున్నాయని, ఆ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. పునరావాసం, ముంపునకు గురవుతున్న ఇళ్లకు సంబంధించిన ప్యాకేజీ తదితర సమస్యలను చర్చించేందుకు ఓ కమిటీగా ఏర్పడి అసెంబ్లీ వద్దకు రావాలన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ తదితర కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను అందజేసి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామన్నారు.
పోలేపల్లి పరిధిలోని భూములకు రూ.12.5 లక్షలు ఇస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో నిజం లేదని, నిబంధనల మేరకే పరిహారం అందుతుందన్నారు. నిర్వాసితులకు బండమీదిపల్లి, శంకరాయపల్లి పరిధిలో ఒక్కో కుటుంబానికి 300 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. 18ఏళ్లు నిండిన యువకులకు పునరావాసంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. రిజర్వాయర్‌లో చేపలను పట్టుకుని అమ్ముకుని ఉపాధి పొందేందుకు అనుమతి ఇస్తామన్నారు. వారి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఆర్డీఓ శ్రీనివాస్, జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment