ఏలూరు (టూ టౌన్) : జిల్లాలో ఇసుక విక్రయాలకు అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినా.. రవాణాకు మార్గం సుగమం చేయడంలో మాత్రం వెనుకబడ్డారు. జిల్లాలోని 16 రీచ్‌ల నుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేసేం దుకు ఆసక్తిగల వాహన యజమానుల నుంచి రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినప్పటికీ రవాణా ధరలు మాత్రం ఖరారు కాలేదు. వారం రోజుల క్రితం టెండర్లు తెరిచే సమయంలో అధికారుల నిర్ణయాన్ని వాహన యజమానులు వ్యతిరేకించారు. ఆ తరువాత లారీ యజమానుల సమక్షంలో టెండర్లు తెరిచినప్పటికీ రవాణా ధరలను మాత్రం ఖరారు చేయలేదు.
ముందుగా టెండర్లు ఆహ్వానించినప్పుడు నిర్ణయించిన ధరలకు వాహన యజమానులు ఇసుక రవాణా చేస్తున్నా.. వాహనాలు పూర్తిస్థాయిలో లేకపోవటంలో వినియోగదారులకు సకాలంలో అందటం లేదు. ప్రస్తుతం లారీల ద్వారా 10 టన్నుల ఇసుక రవాణా చేసే వాహన యజమానులకు కిలోమీటరుకు రూ.65, 17 టన్నుల వాహనానికి రూ.90 చొప్పున ఇస్తున్నారు. ట్రాక్టర్‌కు మాత్రం కిలోమీటరుకు రూ.28 చొప్పున రవాణా చార్జీలు నిర్ణయించారు. ప్రస్తుతం విజయరాయి, నబీపేట రీచ్‌లలో క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.500 ధర నిర్ణయించారు.
ఆ మొత్తాలకు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి, వాహనాన్ని వినియోగదారులు సమకూర్చుకుంటే, అం దులో ఇసుకను లోడుచేసి అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. మిగతా రీచ్‌లలో క్యూబిక్ మీటరుకు రూ.650 చొప్పున డీడీ తీయాల్సి ఉంది. ఈ రీచ్‌లకూ డీడీలు, వాహనాల్ని తీసుకెళితే ఇసుక లోడు వేసి ఇస్తామని స్వయంగా కలెక్టర్ ప్రకటించినా అమలు కావడం లేదు. అధికారులు స్పందించి రవాణా విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఇసుక సమస్య తీరే పరిస్థితి కనిపించడం లేదు.
రేటివ్వలేదు.. ఇసుక రావట్లేదు
Published Sat, Nov 8 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement