Larry Owners
-
లారీల సమ్మె ఉధృతం
ప్రొద్దుటూరు క్రైం (వైస్పార్ కడప) : ఐదు రోజులుగా కొనసాగుతున్న లారీల సమ్మె మరింత ఉధృతమైంది. తమ డిమాండ్లపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో సమ్మెను ఉధృతం చేయాలని లారీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, గడువు ముగిసిన టోల్ ప్లాజాలను నిలిపి వేయాలని, టోల్ విధానంలో పారదర్శకత పాటించాలని, థర్డ్‌పార్టీ ప్రీమియం పెంపును నిలుపుదల చేసి మళ్లీ సమీక్షించాలని, నేషనల్ పర్మిట్ కలిగిన గూడ్స్ వాహనాలకు ఇద్దరు డ్రైవర్ల నిబంధనను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈ నెల 20 నుంచి దేశవ్యాప్తంగా లారీల యజమానులు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభంలో నిత్యావసర సరుకుల రవాణా లారీలకు మినహాయించారు. ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. దీంతో నిత్యాసర సరుకులను రవాణా చేసే లారీలను కూడా నిలిపేయాలని అసోసియేషన్ ప్రతినిధులు, లారీల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య పట్టణంగా పేరు పొందిన ప్రొద్దుటూరుకు అన్ని రకాల వస్తువులు, నిత్యావసర సరుకులు రోజూ వందలాది లారీల్లో దిగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఉన్న మండీ మర్చంట్‌కు రాయలసీమలోనే మంచి పేరుంది. రాయలసీమ జిల్లాలకే గాక తెలంగాణా జిల్లాలకు ప్రొద్దుటూరు నుంచి నిత్యావసర సరుకులు సరఫరా చేస్తుంటారు. ప్రొద్దుటూరులో ఉన్న వస్త్రభారతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దుస్తులు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతాయి. లారీల సమ్మెతో మండీ మర్చంట్, వస్త్ర వ్యాపారంతోపాటు నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 5 రోజుల్లో రూ.10 కోట్ల మేర నష్టం ప్రొద్దుటూరులోని లారీ అసోసియేషన్‌లో సుమారు 500కు పైగా లారీలు ఉన్నాయి. దాదాపు 3 వేల కుటుంబాలు లారీలపై ఆధారపడి జీవిస్తున్నాయి. రోజూ 300లకు పైగా లారీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న బంద్ కారణంగా లారీలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మె కారణంగా జిల్లా మొత్తం సుమారు రూ. 10 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. రోజూ లారీకి వెళ్తేనే పూట గడుస్తుందని, ఐదు రోజులుగా పని లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు, ఇతర కార్మికులు అంటున్నారు. కాగా లారీల సమ్మెను దృష్టిలో ఉంచుకొని ప్రొద్దుటూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డ్రైవర్లకు, క్లీనర్లు, ఇతర కార్మికులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. పనులు లేకపోవడంతో కార్మికులు అసోసియేషన్ కార్యాలయాలు, బ్రోకర్ ఆఫీసుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆల్ఇండియా నిరవధిక బంద్ కొనసాగుతున్నా రాత్రి వేళల్లో కొన్ని రాష్ట్రాల నుంచి ప్రొద్దుటూరుకు, ప్రొద్దుటూరు మీదుగా ఇతర ప్రాంతాలకు లారీలు వెళ్తున్నాయి. వీటిని ఆపేందుకు స్థానిక అసోసియేషన్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. బంద్ ఉపసంహరించే వరకు లారీలను నడిపేది లేదని అసోసియేషన్ కార్యదర్శి సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసరాల బంద్‌తో ఆందోళన మంగళవారం నుంచి నిత్యావసర సరుకుల రవాణాను కూడా నిలిపేయడంతో ప్రజలతోపాటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్ చేపట్టడంతో నిత్యావసర సరుకులపై లారీల బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాకు గుజరాత్, బీజాపూర్, కాశ్మీర్, కలకత్తా, ఢిల్లీ, తదితర రాష్ట్రాల నుంచి కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు దిగుమతి అవుతాయి. లారీల సమ్మెతో వీటి దిగుమతి ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తు రవాణా లారీలు రాత్రి వేళల్లో నడుస్తాయి. ఇకపై రాత్రి సమయాల్లో నడిచే లారీలను ఎక్కడికక్కడే ఆపేస్తామని లారీ యజమానులు తెలిపారు. బలవంతంగా ఆపితే చర్యలు లారీలను బలవంతంగా ఎక్కడైనా ఆపితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు మీదుగా వెళ్తున్న రెండు లారీలను స్థానికంగా ఉన్న లారీ యజమానులు కొందరు ఆపారు. విషయం తెలియడంతో రూరల్ సీఐ ఓబులేసు అసోసియేషన్ ప్రతినిధులను, లారీ యజమానులను పిలిపించారు. స్వచ్ఛందంగా లారీల బంద్ నిర్వహిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని, బలవంతంగా ఒక్క లారీని కూడా ఆపరాదన్నారు. లారీలను ఆపిన కారణంగా వాటి యజమానులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ అన్నారు. సమ్మె అందరి కోసం చేస్తున్నామని, అందరూ అర్థం చేసుకొని సహరించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఒక వేళ దారిలో ఎవరైనా లారీలను ఆపితే తమకు సంబంధం లేదని వారు అన్నారు. -
నాలుగో రోజుకు లారీల సమ్మె
నెల్లూరు(టౌన్): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానుల అసోసియేషన్ చేపట్టిన బంద్ నాలుగో రోజుకు చేరుకుంది. జిల్లాలో 10 వేలకు పైగా లారీలు నిలచిపోయాయి. ఇప్పటివరకు జిల్లాలో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడం ద్వారా రూ.22 కోట్ల మేర నష్టం వాటిల్లింది. నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట ప్రాంతాల్లో లారీల యజమానులు బంద్ నిర్వహిస్తున్నారు. పై రాష్ట్రాల నుంచి జాతీయ రహదారిపై లోడుతో వస్తున్న వాహనాలను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం ఆ లారీలను అక్కడ నుంచి పంపించి వేశారు. జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి నారాయణ బంద్‌ను ఉధృతం చేస్తామని తెలిపారు. యజమానుల సమస్యలను పరిష్కరించే వరకు బంద్‌ను విరమించేది లేదని చెబుతున్నారు. -
లారీల సమ్మె ఉధృతం
ఖిలా వరంగల్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యనమానులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఆలిండియా, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా, వరంగల్ లోకల్, ఓరుగల్లు లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నిత్యావసరాల సరుకుల తప్పా సిమెంట్, ఐరన్, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా నిలిచిపోయింది. జిల్లాలో 3వేల లారీలు నిలిచిపోగా ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 4 వేల లారీలు సరుకులతోనే రహదారులపై నిలిచిపోయాయి. తరచూ పన్నులను పెంచుతున్న కారణంగా వాహనాలను నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల రాస్తారోకోలు.. వరంగల్ లోకల్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల భూపాల్ ఆధ్వర్యంలో ఆదివారం పలు చోట్ల «రాస్తారోకోలు, ధర్నాలు, భిక్షాటన కార్యక్రమాలు చేపట్టారు. నర్సంపేట, ములుగురోడ్డు, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ప్రధాన రహదారుల్లో జిల్లా మీదుగా వెళ్తున్న వివి«ధ రాష్ట్రాల లారీలను అడ్డుకుని ఖాళీ స్థలాలకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు లారీల పార్కింగ్ స్థలానికి చేరుకుని నిలిచిపోయిన లారీలను పంపించి వేముల భూపాల్‌తోపాటు మధుసూదన్‌రావును అరెస్టు చేసి, సొంతపూచి కత్తుపై విడుదల చేశారు. కాగా ఆందోళనలను తీవ్ర తరం చేస్తామని రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ జె. మధుసూదన్‌రావు తెలిపారు. వరంగల్ లోకల్ లారీ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు వేముల భూపాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ స్పందించి అసోసియేషన్ బాధ్యులను చర్చలకు ఆహ్వానించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ని త్యావసర సరుకులను సైతం అడ్డుకుంటామన్నారు. సమస్యలుపరిష్కరించే వరకు కొనసాగిస్తా మని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్లు మోహన్, శ్రీహరి, సతీష్, రాజు, ముంతా జ్, ఉస్సేన్, రాజీరెడ్డి పాల్గొన్నారు. -
లారీ యజమానుల ధర్నా
భూపాలపల్లి వరంగల్: దేశ వ్యాప్త లారీల బంద్‌లో భాగంగా భూపాలపల్లి లారీ ఓనర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం లారీల యజమానులు ధర్నా నిర్వహించారు. రెండు రోజులపాటు లారీల ను నడిపించిన స్థానిక యజమానులు మూడో రోజు సమ్మెలో పాల్గొన్నారు. కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు వెళ్లుతున్న ఇసుక లారీలను ప్రధా న రహదారిపై అడ్డుకొని ధర్నా చేపట్టారు. అసోసియేషన్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షకు భుత్వ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణరెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజీల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో వాహనదారులపై అధిక భా రం పడుతోందన్నారు. లారీ యజమానుల సమ్మెతో సరుకుల రవాణా నిలిచి పోయిందని వారు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్యక్షుడు కంకణాల రవీం దర్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగి స్తామని స్ప ష్టం చేశారు. బాలచంద్నాయక్, రమేష్, రాజేష్, హరిష్‌రెడ్డి, నర్సింగరావు, రవి, తిరుపతి, సేనప తి, వేణు, అయిలయ్య, రాజయ్య పాల్గొన్నారు. -
రవాణా బంద్!
పాలమూరు: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లారీలను ఎక్కడిక్కడే నిలిపివేశారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచే లారీ సమ్మె ప్రారంభం కావడంతో రోడ్లపై లారీ లు కన్పించలేదు. ప్రధానంగా జాతీయ రహదారిపై లారీలు తిరగకపోవడం వల్ల బోసిపోయి కని పించింది. నిత్యం వందల సంఖ్యలో లారీల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఒ క్కసారిగా లారీలు రాకపోకలు నిలిపివేయడం వ ల్ల రోడ్డు పూర్తిగా ఖాళీగా కన్పించింది. దీంతో పా టు నిత్యం రద్దీగా ఉండే తాండూర్ రోడ్డుకూడా లారీల రాకపోకలు లేక ఖాళీగా కన్పించింది. అలా గే, అంతరాష్ట్ర రహదారి అయిన రాయిచూర్ వైపు కూడా బోసిపోయింది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 5,500 లారీలు నిలిచిపోయినట్లు అంచనా. జిల్లా కేంద్రంలో ర్యాలీ లారీల సమ్మెలో భాగంగా మొదటి రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనం ఎదుట దీక్ష నిర్వహించారు. దీంతోపాటు జిల్లా కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లారీ ఓనర్స్ అ సోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, కార్యదర్శి బాబు జానీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిత్యావసరాలకు సంబంధించిన లారీలను అనుమతి ఇస్తామని అప్పటికి తమ డిమాండ్లపై స్పష్టత రాకపోతే అన్ని వాహనాలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివయ్య, రషీద్‌ఖాన్, అన్వర్ పాషా, రాఘవేందర్, దస్తగిరి, సలీం, మణెం పాల్గొన్నారు. లారీల అడ్డగింత హన్వాడ మండల పరిధిలోని చిన్నదర్పల్లి గ్రామసమీపంలో ప్రభుత్వ సహకారంతో పని చేస్తున్న సీడబ్ల్యూసీ గోదాం దగ్గర లారీలు నడుపుతున్నట్లు సమాచారంతో అసోసియేషన్ సభ్యులు వెళ్లి అడ్డుకున్నారు. గూడ్స్ రైలు ద్వారా వచ్చిన బియ్యంను గోదాంకు తరలించడంతో పాటు వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. -
లారీల బంద్ ప్రశాంతం
ఒంగోలు: లారీల బంద్ తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు లారీ యజమానులు తమ లారీలను యూనియన్ కార్యాలయం ఆవరణలోనే పార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వేమూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లారీ యూనియన్ కార్యాలయం ఆవరణలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లారీకి ఐటీ స్టాండర్డ్‌ను తగ్గించాలని, డీజిల్ రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిం చాలని, నేషనల్ పర్మిట్ లారీలకు డబుల్ డ్రైవర్ల వ్యవహారాన్ని విరమించాలంటూ పలు డిమాండ్లను నినదించారు. సుదూరం నుంచి బయలు దేరిన లారీలు గమ్యానికి చేరుకునేంత వరకు ఆపడం లేదని, కొత్తగా ఎవరు లోడ్లు ఎత్తుకోవడం లేదన్నారు. తొలి రోజు ట్యాంకర్ యాజమాన్యాలు సంఘీభావం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. బంద్ ప్రభావం రెండో రోజు నుంచి కనిపిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ మొండిపట్టు వీడాలని కోరారు. సింగరాయకొండలో కొద్దిసేపు లారీ ఓనర్లు లారీలను ఆపేందుకు యత్నించగా పోలీసులు ఆ ప్రక్రియను భగ్నం చేశారు. రవాణాశాఖ అధికారులు మాత్రం తొలిరోజు 92 శాతం లారీలు తిరిగాయని, జన జీవనంపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. -
కదలని చక్రం
నెల్లూరు(టౌన్): రవాణా రంగంలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన లారీల బంద్‌తో లారీలు పార్కింగ్‌లకే పరిమితమయ్యాయి. తొలిరోజు శుక్రవారం 70 శాతం లారీలు తిరగలేదు. శనివారం నుంచి ఆందోళనను ఉధృతం చేయనున్నట్టు లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం 30శాతం లారీలు లోడుతో జాతీయ రహదారిపై రాకపోకలు సాగాయి. అయితే ఈ లారీలు రెండు మూడు రోజులు ముందుగా లోడింగ్ చేసుకోవడంతో సంబంధిత ప్రాంతాలకు చేరుకునేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. అలాంటి లారీలకు కొంత వెసులుబాటు కల్పించారు. శనివారం స్థానిక ఎస్వీజీఎస్ కళాశాల జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించాలని జిల్లా లారీ అసోసియేషన్ నాయకులు నిర్ణయించారు. ఆదివారానికి పూర్తిగా లారీలు నిలచిపోతాయని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. తొలిరోజు పాలు, గుడ్లు లాంటి వస్తువులను ఆర్టీసీ బస్సుల్లో ఆయా ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. డీజిల్‌కు మరో రెండు రోజులు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. యార్డుకే పరిమితం కోవూరు: లారీల బంద్ పిలుపుమేరకు శుక్రవారం ఉదయం నుంచి పడుగుపాడు లారీ యార్డులో లారీలు నిలిచిపోయాయి. ఆలిండియా ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు లారీ ఓనర్స్ అసోసియేషన్, ఇతర యూనియన్లు ఈ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ప్రజలు అర్థం చేసుకొని బంద్‌కు సహకరించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్నారెడ్డి, పి.ఎల్.నారాయణ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తమ సమస్యలపై ఇది వరకే చర్చించామని, వారు సమస్యల్ని పరిష్కరించడంలో చొరవ చూపలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామన్నారు. -
సాగర్ సబ్ కాంట్రాక్టర్ చేతివాటం
ప్రతిష్టాత్మకమైన రామతీర్థ సాగర్ పనుల్లో సబ్ కాంట్రాక్టర్ చేతివాటం లారీ యజమానులను రోడ్డెక్కించింది. నెలల తరబడి చెల్లించాల్సిన రూ.లక్షలు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన లారీ యజమానులు గురువారం సహనం కోల్పోయారు. పనులు జరిగిన చోటే లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే నిరసన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో పనులు నిలిచిపోయాయి. పూసపాటిరేగ(నెల్లిమర్ల): మండలంలోని కుమిలి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న రామతీర్థసాగర్ రిజర్వాయరు పనుల్లో భాగస్వాములైన లారీ యజమానులకు సబ్ కాంట్రాక్టర్ టోకరా వేయడంతో పనులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 45 రోజులుగా బిల్లులు చెల్లించకపోవడంతో పనులు జరిగిన చోటే ఆకలి మంటలతో గడుపుతున్నామని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెల 24 నుంచి నుండి టిప్పర్లతో నిర్మాణ పనులు చేయడానికి పైడిమాంబ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు చెందిన సబ్ కాంట్రాక్టర్ విజయవాడకు చెందిన లక్ష్మీనరిసింహస్వామి లారీ అసోసియేషన్ వద్ద పనులు చేయడానికి ఒప్పందం కుదిరింది. లారీ ఒక్కింటికి నెల రోజులకు రూ.1.70 లక్షలు చొప్పున ఇవ్వడానికి సబ్‌కాంట్రాక్టర్ అంగీకరించాడు. 50 రోజులవుతున్నా సుమారు రూ.18 లక్షలు బకాయిలు లారీ యజమానులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికి సబ్ కాంట్రాక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లారీ యజమానులకు బురిడీ కొట్టించాడు. పైడిమాంబ ఇన్ఫ్రాకు చెందిన వెంకటాచలం గూర్చి వాకాబు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో లారీ యజమానులు ప్రదాన కాంట్రాక్టర్ ఎస్సీఎల్ కన్‌స్ట్రక్షన్‌ను కలిసి జరిగిన విషయం చెప్పడంతో మాకు సంబందం లేదని చేతులెత్తేశారు. దీంతో రిజర్వాయర్ పనులు జరిగిన చోట లారీలను నిలిపివేసి ఆకలి మంటలుతో గడుపుతున్నారు. రెండు రోజులులో లారీ అద్దెలు చెల్లించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని లారీ యజమానులు హెచ్చరించారు. అధికార పార్టీ అండతో బినామీ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే లారీ యజమానులకు బిల్లులు చెల్లించే ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తామని లారీ యజమానులు హెచ్చరించారు. -
23 అర్ధరాత్రి నుంచి లారీల నిరవధిక బంద్
హైదరాబాద్: లారీ యజమానుల సమస్యల పరిష్కారానికిగాను ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి లారీల నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చామని, దీనిని విజయవంతం చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఆదివారం హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు నూకల భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి జి.దుర్గాప్రసాద్ మాట్లాడారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 23 జిల్లాలకు చెల్లించిన ట్యాక్స్‌నే ఇప్పుడు కూడా చెల్లిస్తున్నా అది తెలంగాణ 10 జిల్లాలకే వర్తిస్తోందన్నారు. ఏపీకి వెళ్లాలంటే సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. లారీల ఎగుమతులు, దిగుమతుల పన్నులు కిరాయిదారులే భరించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. -
సమ్మె షురూ
తమిళనాడు నుంచి కేరళ రాష్ట్రానికి సరుకు రవాణా చేసే లారీ యజమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. ఈ కారణంగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో వేలాది లారీలు, కంటైనర్లు నిలిచిపోయాయి. *500 కోట్ల మేర లావాదేవీలు స్తంభించిపోయాయి.వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రం నుంచి కేరళలకు రోజుకు మూడు వేలకు పైగా సరుకు రవాణా చేసే లారీలు, వ్యాన్లు వంటి వాహనాలు వెళుతుంటాయి. వీటిల్లో కోళ్లు, కోడిగుడ్లు, మాంసం, కాయగూరలు తదితర నిత్యావసర వస్తువులు కేరళకు చేరవేస్తుంటారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో వాళయ్యూర్ చెక్‌పోస్టు ఉంది. ఇక్కడ వాహనాల తనిఖీ కోసం సుమారు 12 గంటలు నిలిపివేస్తుంటారు. ఈ జాప్యం వల్ల లారీల్లోని సరుకును సదరు మార్కెట్ లేదా వ్యాపారికి చేరవేయడంలో విపరీత జాప్యం ఏర్పడుతోంది. అంతేగాక కొన్నిసార్లు సరుకు చెడిపోయి తమిళనాడు వ్యాపారులు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వాహనాల తనిఖీ వల్ల జరుగుతున్న నష్టాన్ని రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలు, వ్యాపార, లారీ యజమానుల సంఘాల వారు అనేక సార్లు కేరళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా మార్పు రాకపోవడంతో ఆందోళనలు నిర్వహించారు. ఈ సమస్య తీవ్రతను రెండు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ సంస్థ వారు ఏప్రిల్ 1 వ తేదీ నుంచి వాహనాలను నిలిపివేస్తున్నట్లు గతంలో సమ్మె నోటీసు ఇచ్చా రు. సమ్మె నోటీసుకు ప్రభుత్వాలు స్పందించక పోవడంతో మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు కేరళకు వాహనాలు నడపకుండా నిలిపివేశారు. అలాగే అక్కడి వాహనాలను తమిళనాడులోకి అనుమతించలేదు. ఈ కారణంగా సరిహద్దుల్లో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ముగం మాట్లాడుతూ, వాళైయూర్ చెక్‌పోస్టులో మూడే కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ పరిమితంగా ఉన్న సిబ్బంది వేలాది వాహనాలను తనిఖీ చేయాల్సివస్తోందని చెప్పారు. ఈ కారణంగానే ఒక్కో వాహనం ప్రతి రోజూ 10 గంటల నుంచి 12 గంటలకు చెక్‌పోస్టు వద్ద వేచి ఉండక తప్పడం లేదని అన్నారు. రాష్ట్రం నుంచి రోజుకు కోటి కోడిగుడ్లు, 95లక్షల కోళ్లు కేరళకు చేరవేస్తున్నామని, చెక్‌పోస్టు జాప్యం వల్ల అవి చెడిపోవడమో, చనిపోవడమో జరిగి దారుణంగా నష్టపోతున్నామని చెప్పారు. సమ్మె కారణంగా రోజుకు *100 కోట్ల నష్టం సంభవిస్తున్నట్లు తెలిపారు. చెక్‌పోస్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు సమ్మెను విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వాహనాల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయాన్ని ఎదుర్కొన్న వ్యాపారులు రైల్వే గూడ్సుల ద్వారా కేరళకు సరఫరా చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ కారణంతో రైల్వే వ్యాగన్ల కోసం స్టేషన్ల వద్ద సరుకు పెట్టెలు ఇబ్బడిముబ్బడిగా చేరిపోయాయి. -
ఇసుక లారీ ఓనర్ల సమ్మె విరమణ
అధికారులతో ఫలించిన చర్చలు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్న జేసీ త్వరలో మరో ఐదు రీచ్‌లు విజయవాడ : ఇసుక కిరాయిలకు మీ-సేవలతో లింకు పెట్టడాన్ని నిరసిస్తూ గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న కృష్ణా, గుంటూరు జిల్లాల లారీ యజమానులు శుక్రవారం సాయంత్రం విరమించారు. ఈ నెల 29 వరకు లారీ కిరాయిలు స్వయంగా వసూలు చేసుకోవచ్చని జిల్లా అధికారులు సూచించడంతో సమ్మె విరమించినట్లు వారు చెప్పారు. మీ-సేవలతో సంబంధం లేకుండా లారీ కిరాయిలు తామే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ఆందోళన చేపట్టామని ఈ సందర్భంగా వారు తెలిపారు. జిల్లా యంత్రాంగం మరో దఫా చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పిందని లారీ యజమానులు వివరించారు. ఇసుక కొరత లేకుండా చర్యలు : జేసీ ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి అన్నారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఇసుక రవాణా, లారీ యజమానుల సమ్మెపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఐదు రీచ్‌ల ద్వారా 14.16 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ను గుర్తించినట్లు చెప్పారు. త్వరలో మరో ఐదు రీచ్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుక అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటు వినియోగదారులు, అటు లారీ యజమానులు నష్టపోకుండా వాస్తవ ధరలకు ఇసుక అమ్మకాలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,300 మంది వినియోగదారులు ఇసుక కోసం మీ-సేవల్లో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. లారీ డ్రైవర్లు ఆధార్ నంబర్లు నమోదు చేయించుకోవాలనే నిబంధనను సడలించినట్లు జేసీ తెలిపారు. లారీ యజమానుల సమ్మె గురించి ప్రస్తావిస్తూ మొదట వచ్చిన వారికి మొదట ఇసుక సరఫరాా చేసే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఈ నెల 29 వరకు వినియోగదారునికి స్వయంగా లారీ కిరాయి మాట్లాడుకుని మీ-సేవలో ఇచ్చిన రసీదుల ప్రకారం ఇసుకను తీసుకువెళ్లే సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు. తిరిగి 29న జిల్లా యంత్రాంగం సమావేశమై లారీ యజమానులు కోరుతున్న విధంగా 10 కి లోమీటర్లకు కిరాయి రూ.1,500 విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు. లారీ యజమానులు సమ్మెను విరమించి మూడు రోజులుగా నిలిచిపోయిన ఇసుకను వెంటనే వినియోగదారులకు సరఫరా చేయాలని కోరారు. విజయవాడ సిటీ పోలీసు కమీషనర్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక మాఫియా లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించడం నేరమన్నారు. ఇసుక తరలించే విధానంలో రిజిస్ట్రేషన్ నంబరు, ఏ ప్రదేశానికి తీసుకువెళుతున్నారో స్పష్టంగా వేబిల్లులో తెలియజేయాలని చెప్పారు. నేటి నుంచి రెండు షిఫ్టులు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు మాట్లాడుతూ శనివారం నుంచి జిల్లాలోని ఇసుక రీచ్‌లు రెండు షిఫ్టులలో పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డీటీసీ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి జి.నాగరాజు, ఏసీపీలు మల్లేశ్వరరాజు, రాఘవరావు, ఆర్టీవో సుబ్బారావు, మైనింగ్ ఏడీ రామచంద్రరావు, ఇసుక లారీ యజమానుల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
రేటివ్వలేదు.. ఇసుక రావట్లేదు
ఏలూరు (టూ టౌన్) : జిల్లాలో ఇసుక విక్రయాలకు అధికారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసినా.. రవాణాకు మార్గం సుగమం చేయడంలో మాత్రం వెనుకబడ్డారు. జిల్లాలోని 16 రీచ్‌ల నుంచి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేసేం దుకు ఆసక్తిగల వాహన యజమానుల నుంచి రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినప్పటికీ రవాణా ధరలు మాత్రం ఖరారు కాలేదు. వారం రోజుల క్రితం టెండర్లు తెరిచే సమయంలో అధికారుల నిర్ణయాన్ని వాహన యజమానులు వ్యతిరేకించారు. ఆ తరువాత లారీ యజమానుల సమక్షంలో టెండర్లు తెరిచినప్పటికీ రవాణా ధరలను మాత్రం ఖరారు చేయలేదు. ముందుగా టెండర్లు ఆహ్వానించినప్పుడు నిర్ణయించిన ధరలకు వాహన యజమానులు ఇసుక రవాణా చేస్తున్నా.. వాహనాలు పూర్తిస్థాయిలో లేకపోవటంలో వినియోగదారులకు సకాలంలో అందటం లేదు. ప్రస్తుతం లారీల ద్వారా 10 టన్నుల ఇసుక రవాణా చేసే వాహన యజమానులకు కిలోమీటరుకు రూ.65, 17 టన్నుల వాహనానికి రూ.90 చొప్పున ఇస్తున్నారు. ట్రాక్టర్‌కు మాత్రం కిలోమీటరుకు రూ.28 చొప్పున రవాణా చార్జీలు నిర్ణయించారు. ప్రస్తుతం విజయరాయి, నబీపేట రీచ్‌లలో క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.500 ధర నిర్ణయించారు. ఆ మొత్తాలకు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి, వాహనాన్ని వినియోగదారులు సమకూర్చుకుంటే, అం దులో ఇసుకను లోడుచేసి అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. మిగతా రీచ్‌లలో క్యూబిక్ మీటరుకు రూ.650 చొప్పున డీడీ తీయాల్సి ఉంది. ఈ రీచ్‌లకూ డీడీలు, వాహనాల్ని తీసుకెళితే ఇసుక లోడు వేసి ఇస్తామని స్వయంగా కలెక్టర్ ప్రకటించినా అమలు కావడం లేదు. అధికారులు స్పందించి రవాణా విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఇసుక సమస్య తీరే పరిస్థితి కనిపించడం లేదు.