కదలని చక్రం | Lorry Strike Intensifies On First Day Nellore | Sakshi
Sakshi News home page

కదలని చక్రం

Published Sat, Jul 21 2018 10:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:23 PM

Lorry Strike Intensifies On First Day Nellore - Sakshi

నెల్లూరు(టౌన్‌): రవాణా రంగంలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన లారీల బంద్‌తో లారీలు పార్కింగ్‌లకే పరిమితమయ్యాయి. తొలిరోజు శుక్రవారం 70 శాతం లారీలు తిరగలేదు. శనివారం నుంచి ఆందోళనను ఉధృతం చేయనున్నట్టు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. శుక్రవారం 30శాతం లారీలు లోడుతో జాతీయ రహదారిపై రాకపోకలు సాగాయి. అయితే ఈ లారీలు రెండు మూడు రోజులు ముందుగా లోడింగ్‌ చేసుకోవడంతో సంబంధిత ప్రాంతాలకు చేరుకునేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. అలాంటి లారీలకు కొంత వెసులుబాటు కల్పించారు. శనివారం స్థానిక ఎస్వీజీఎస్‌ కళాశాల జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించాలని జిల్లా లారీ అసోసియేషన్‌ నాయకులు నిర్ణయించారు. ఆదివారానికి పూర్తిగా లారీలు నిలచిపోతాయని అసోసియేషన్‌ నేతలు చెబుతున్నారు. తొలిరోజు పాలు, గుడ్లు లాంటి వస్తువులను ఆర్టీసీ బస్సుల్లో ఆయా ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. డీజిల్‌కు మరో రెండు రోజులు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. 
యార్డుకే పరిమితం
కోవూరు: లారీల బంద్‌ పిలుపుమేరకు శుక్రవారం ఉదయం నుంచి పడుగుపాడు లారీ యార్డులో లారీలు నిలిచిపోయాయి. ఆలిండియా ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ పిలుపు మేరకు లారీ ఓనర్స్‌ అసోసియేషన్, ఇతర యూనియన్లు ఈ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ప్రజలు అర్థం చేసుకొని బంద్‌కు సహకరించాలని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు చిన్నారెడ్డి, పి.ఎల్‌.నారాయణ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తమ సమస్యలపై ఇది వరకే చర్చించామని, వారు సమస్యల్ని పరిష్కరించడంలో చొరవ చూపలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement