తమిళనాడు నుంచి కేరళ రాష్ట్రానికి సరుకు రవాణా చేసే లారీ యజమానులు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. ఈ కారణంగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో వేలాది లారీలు, కంటైనర్లు నిలిచిపోయాయి. *500 కోట్ల మేర లావాదేవీలు స్తంభించిపోయాయి.వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రం నుంచి కేరళలకు రోజుకు మూడు వేలకు పైగా సరుకు రవాణా చేసే లారీలు, వ్యాన్‌లు వంటి వాహనాలు వెళుతుంటాయి. వీటిల్లో కోళ్లు, కోడిగుడ్లు, మాంసం, కాయగూరలు తదితర నిత్యావసర వస్తువులు కేరళకు చేరవేస్తుంటారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో వాళయ్యూర్ చెక్‌పోస్టు ఉంది. ఇక్కడ వాహనాల తనిఖీ కోసం సుమారు 12 గంటలు నిలిపివేస్తుంటారు. ఈ జాప్యం వల్ల లారీల్లోని సరుకును సదరు మార్కెట్ లేదా వ్యాపారికి చేరవేయడంలో విపరీత జాప్యం ఏర్పడుతోంది. అంతేగాక కొన్నిసార్లు సరుకు చెడిపోయి తమిళనాడు వ్యాపారులు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వాహనాల తనిఖీ వల్ల జరుగుతున్న నష్టాన్ని రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలు, వ్యాపార, లారీ యజమానుల సంఘాల వారు అనేక సార్లు కేరళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా మార్పు రాకపోవడంతో ఆందోళనలు నిర్వహించారు.
ఈ సమస్య తీవ్రతను రెండు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ సంస్థ వారు ఏప్రిల్ 1 వ తేదీ నుంచి వాహనాలను నిలిపివేస్తున్నట్లు గతంలో సమ్మె నోటీసు ఇచ్చా రు. సమ్మె నోటీసుకు ప్రభుత్వాలు స్పందించక పోవడంతో మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు కేరళకు వాహనాలు నడపకుండా నిలిపివేశారు. అలాగే అక్కడి వాహనాలను తమిళనాడులోకి అనుమతించలేదు. ఈ కారణంగా సరిహద్దుల్లో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ముగం మాట్లాడుతూ, వాళైయూర్ చెక్‌పోస్టులో మూడే కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ పరిమితంగా ఉన్న సిబ్బంది వేలాది వాహనాలను తనిఖీ చేయాల్సివస్తోందని చెప్పారు. ఈ కారణంగానే ఒక్కో వాహనం ప్రతి రోజూ 10 గంటల నుంచి 12 గంటలకు చెక్‌పోస్టు వద్ద వేచి ఉండక తప్పడం లేదని అన్నారు.
రాష్ట్రం నుంచి రోజుకు కోటి కోడిగుడ్లు, 95లక్షల కోళ్లు కేరళకు చేరవేస్తున్నామని, చెక్‌పోస్టు జాప్యం వల్ల అవి చెడిపోవడమో, చనిపోవడమో జరిగి దారుణంగా నష్టపోతున్నామని చెప్పారు. సమ్మె కారణంగా రోజుకు *100 కోట్ల నష్టం సంభవిస్తున్నట్లు తెలిపారు. చెక్‌పోస్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు సమ్మెను విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వాహనాల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయాన్ని ఎదుర్కొన్న వ్యాపారులు రైల్వే గూడ్సుల ద్వారా కేరళకు సరఫరా చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ కారణంతో రైల్వే వ్యాగన్ల కోసం స్టేషన్ల వద్ద సరుకు పెట్టెలు ఇబ్బడిముబ్బడిగా చేరిపోయాయి.
సమ్మె షురూ
Published Thu, Apr 2 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM
Advertisement
Advertisement