బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సమ్మె
మూతబడ్డ కార్యాలయాలు
ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన
రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు ఆగాయి. ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు మంగళవారం శ్రీకారం చుట్టారు. దీంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలు, ఎక్స్చేంజ్, సేవా కేంద్రాలు మూత బడ్డాయి. విధుల్ని బహిష్కరించిన ఉద్యోగ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోరాటం సాగిస్తున్నారు.
సాక్షి, చెన్నై: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ను ఎంటీఎన్‌ఎల్‌తో అనుసంధానం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన బయలు దేరింది. ఇప్పటికే తమ డిమాండ్ల సాధన కోసం తరచూ గళమెత్తుతున్నారు. తాజాగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు పుండు మీద కారం చల్లినట్టు అవుతుండడంతో ఇక గత్యంతరం లేక పోరుబాటకు సిద్ధమయ్యారు. కేంద్రం నడ్డి విరిచే రీతిలో తొలి విడతగా రెండు రోజుల సమ్మె బాటకు పిలుపు నిచ్చారు. ఆ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ను అభివృద్ధి పరచాలని, ఎంటీఎన్‌ఎల్‌తో అనుసంధానం చేయవద్దని, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్న అమెరికా సంస్థతో కుదుర్చుకున్న డిలాయిట్ కమిటీ సిఫారసులను బహిరంగ పరచాలని, కొత్త పింఛన్ విధానం రద్దు చేయాలని, తమకు చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలు మంజూరు వంటి డిమాండ్ల సాధనకు మంగళవారం సమ్మె బాట పట్టారు.
మంగళ, బుధవారాల్లో సమ్మెకు పిలుపు నివ్వడంతో ఉదయాన్నే కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. సిబ్బంది తమ తమ కార్యాలయాల వద్దకు చేరుకుని కాసేపు నిరసన తెలియజేశారు. ఉన్నతాధికారుల కార్యాలయాలు, ప్రధాన, డివిజన్ కార్యాలయాలు, ఎక్స్చేంజ్‌లు, సేవా కేంద్రాలు అన్నీ మూత బడ్డాయి. దీంతో వినియోగ దారులకు అందించాల్సిన సేవలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. బిల్లింగ్, మొబైల్ ఫిర్యాదులు తదితర సేవలు సైతం రద్దు కావడంతో వినియోగ దారులకు తంటాలు తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా విధుల్ని బహిష్కరించిన సిబ్బంది ధర్నాలు, ఆందోళనలతో తమ నిరసన వ్యక్తం చేశారు. అన్ని కార్యాలయాల ఎదుట నిరసనలు సాగాయి.
అదే సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఆయా కార్యాలయాల వద్ద గట్టి భద్రతా చర్యలను పోలీసు యంత్రాంగం తీసుకుంది. చెన్నైలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 250 కార్యాలయాలు, ఎక్స్చేంజ్‌లు, సేవా కేంద్రాలు మూత బడ్డాయి. అన్నానగర్, అన్నా సాలై, ప్యారీస్, నుంగంబాక్కం, వెప్పేరి, తదితర ప్రాంతాల్లోని కార్యాలయాల వద్ద ఉద్యోగులు ఆందోళలనకు దిగారు. ఈ విషయంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘంనాయకుడు గోవిందరాజు మట్లాడుతూ, తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి దిశగా రెండు రోజుల సమ్మెకు పిలుపు నిచ్చామన్నారు. కేంద్రం నుంచి స్పందన రాని పక్షంలో తదుపరి కార్యచరణ ఉంటుందని, బీఎస్‌ఎన్‌ఎల్‌ను రక్షించుకుంటామన్నారు.
ఆగిన సేవలు
Published Wed, Apr 22 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM
Advertisement