BSNL services
-
పరిమితంగా బీఎస్ఎన్ఎల్ సేవలు
మేడారం: జాతరలో భక్తులకు ఉచితంగా ఇంటర్నెట్ డాటా సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేసిన బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు పరిమితంగా అందుబాటులోకి వచ్చాయి. జాతర జరిగే ప్రాంతాల్లో 20 హాట్‌స్పాట్ పరికరాలు ఏర్పాటు చేసి ఒకరికి 500 ఎంబీ డాటా ఉచితంగా లక్షలాది మందికి అందిస్తామని బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రకటించారు. కానీ ఐటీడీఏ, అమ్మవారి గద్దెలు, జంపన్నవాగు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో తప్పా, రెడ్డిగూడెం, శివరాంసాగర్, కొత్తూరు, బస్టాండ్, నార్లాపూర్, కాల్వపల్లి తదితర ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడ్డారు. రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఉచిత డాటా సౌకర్యం అధికారులకు మాత్రమే ఉపయోగపడ్డాయి తప్పా భక్తులు వినియోగించుకోలేకపోయారు. ఇతర ప్రైవేట్ సంస్థలకు సైతం డాటా ప్రొవైడ్ చేయడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. డాటా లేకున్నా కాల్స్ కూడా చేసుకోలేని పరిస్థితులు ఉండటంతో వినియోగదారులు ఆవేదన చెందారు. కాల్స్ కూడా అంతంతే... మేడారం జాతరలో పెద్ద సంఖ్యలో టవర్లు ఏర్పాటు చేసి భక్తులకు సిగ్నల్ అందిస్తామని ఊదర కొట్టిన సెల్ కంపెనీలు వాస్తవంలో ఎలాంటి సదుపాయాలు అందించడంలో ఘోరంగా విఫలమయ్యా యి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సుమారు 16 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు రోజూ ఒకేసారి 3.5లక్షల మంది మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేయగా, అందుబాటులోకి తేలేకపోయింది. దీంతో భక్తులు సెల్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడ్డారు. -
పటిష్టమైన నెట్వర్కే మా బలం..
బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం పి.వి. మురళీధర్ - త్వరలో 21.6 ఎంబీపీఎస్ స్పీడ్‌తో మొబైల్ నెట్ - మా వినియోగదార్లకు కాల్ డ్రాప్ సమస్యే లేదు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సర్వీసుల వేగాన్ని పెంచుతోంది. పారదర్శకతకు తోడు ప్రైవేటు టెల్కోల కంటే తక్కువ ధరకే మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తూ... కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు పెద్ద ఎత్తున 3జీ టవర్లను, వైఫై హాట్‌స్పాట్స్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. తదుపరి తరం నెట్‌వర్క్‌తో వినూత్న సేవలందించటంపై దృష్టిపెట్టామని, తమకున్న బ్రాండ్ ఇమేజ్‌తో రానున్న రోజుల్లో టెలికం రంగంలో సంచలనాలకు తెర తీస్తామని బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వి.మురళీధర్ చెప్పారు. సర్కిల్లో చేపట్టిన విస్తరణ, సంస్థ నూతన సేవల గురించి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యాంశాలివీ... కాల్ డ్రాప్ సమస్య తీవ్రమవుతోంది. మీ వినియోగదారుల క్కూడా...? అలాంటిదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో సహా) సర్కిల్లో ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్కు 2జీ టవర్లు 7,518, 3జీ టవర్లు 3,113 ఉన్నాయి. 2014-15లో మొత్తం 3,600 టవర్లను ఏర్పాటు చేశాం. రెండు రాష్ట్రాల్లో కలిపి 1,126 మండలాలను, 20 వేలకుపైగా గ్రామాలను కవర్ చేశాం. 450 పట్టణాల్లో 3జీ సేవలు అందుబాటులోకి తెచ్చాం. 2015-16లో రూ.200 కోట్లతో 1450 దాకా కొత్త 3జీ టవర్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా కొత్తగా 700 పట్టణాలకు 3జీ సర్వీసులను విస్తరిస్తాం. ఈ స్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరించటంతో మా వినియోగదారులకు కాల్ డ్రాప్ సమస్యే లేదు. అది మేం గట్టిగా చెప్పగలం. ఇతర కంపెనీల మాదిరి మీరూ డేటాపై దృష్టి పెడుతున్నారా? మాకు ఈ సర్కిల్లో 95 లక్షల మంది మొబైల్ చందాదారులున్నారు. నెలకు కొత్తగా 1.2 లక్షల కస్టమర్లు జతవుతున్నారు. దాదాపు అంతా డేటా వాడుతున్నవారే. అందుకే వేగవంతమైన నెట్‌పై ఫోకస్ చేశాం. మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు త్వరలో మరింత స్పీడ్‌ను అందుకుంటారు. ప్రస్తుతం 14.4 ఎంబీపీఎస్ వేగం ఇస్తున్నాం. డిసెంబర్‌కల్లా దీనిని 21.6 ఎంబీపీఎస్‌కు చేరుస్తాం. 4జీ సేవల్లోకి ప్రవేశిస్తున్నారా? మా కొత్త టెక్నాలజీతో 4జీని కూడా అందించే వీలుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీని వాడాం. 4జీ సేవలు ఎప్పుడు ప్రారంభించేదీ కేంద్ర కార్యాలయం నిర్ణయిస్తుంది. బ్రాడ్ బ్యాండ్ సంస్థలు తక్కువ ఖర్చుకే నెట్ అందిస్తున్నాయి. మరి మీరు? హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో 700 దాకా వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేశాం. రెండు నెలల్లో మరో 450 వస్తాయి. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 4,000 హాట్‌స్పాట్స్ వస్తాయి. కస్టమర్లు నెట్ వ్యయాన్ని 70-80% ఆదా చేసుకునేందుకు ఇవి దోహదం చేస్తాయి. హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించేందుకు ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్టీటీహెచ్) సేవల్ని హైదరాబాద్‌సహా 10 ప్రాంతాల్లో ప్రారంభించాం. 6,000 పైగా కస్టమర్లున్నారు. కొత్త సేవలేమైనా ప్రారంభిస్తున్నారా? ఎక్స్ఛేంజీలను తదుపరి తరం నెట్వర్క్ టెక్నాలజీతో ఆధునీకరిస్తున్నాం. దీంతో ల్యాండ్‌లైన్ వినియోగదారులు మరిన్ని సేవలు పొందే వీలుంది. దేశంలో ఎక్కడున్నా క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌గా (సీయూజీ) ఏర్పడి... అపరిమితంగా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. సభ్యుల సంఖ్యనుబట్టి నెలకు కొంత అదనంగా చెల్లించాలి. గతంలో ఒక ఎక్స్ఛేంజ్ పరిధిలో మాత్రమే సీయూజీకి అవకాశం ఉండేది. అలాగే మొబైల్‌కు వచ్చిన కాల్‌ను ల్యాండ్‌లైన్‌కు బదిలీ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ సేవలు 5 నెలల్లో ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. మీ సర్కిల్ ఆదాయం సంగతో...? 2014-15లో ఇక్కడ రూ.2,321 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది 10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. గత జూలైతో పోలిస్తే ఈ జూలైలో జీఎస్‌ఎంలో 5 శాతం, బ్రాడ్‌బ్యాండ్‌లో 4 శాతం వృద్ధి నమోదైంది. 2018 కల్లా బీఎస్ఎన్ఎల్ను లాభాల్లోకి తేవాలన్న సంస్థ ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. ధరలు, ప్యాక్‌ల విషయంలో అంతా పారదర్శకం. ఇదే మాకు కలిసి వచ్చే అంశం. సిబ్బందిని ఎప్పటికప్పుడు సుశిక్షితులను చేస్తున్నాం. 45,000లకుపైగా టచ్ పాయింట్లున్నాయి. ఈ ఏడాది 10 శాతం పెంచుతాం. -
ఆగిన సేవలు
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మె మూతబడ్డ కార్యాలయాలు ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ సేవలు ఆగాయి. ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు మంగళవారం శ్రీకారం చుట్టారు. దీంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలు, ఎక్స్చేంజ్, సేవా కేంద్రాలు మూత బడ్డాయి. విధుల్ని బహిష్కరించిన ఉద్యోగ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా పోరాటం సాగిస్తున్నారు. సాక్షి, చెన్నై: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ను ఎంటీఎన్ఎల్తో అనుసంధానం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన బయలు దేరింది. ఇప్పటికే తమ డిమాండ్ల సాధన కోసం తరచూ గళమెత్తుతున్నారు. తాజాగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు పుండు మీద కారం చల్లినట్టు అవుతుండడంతో ఇక గత్యంతరం లేక పోరుబాటకు సిద్ధమయ్యారు. కేంద్రం నడ్డి విరిచే రీతిలో తొలి విడతగా రెండు రోజుల సమ్మె బాటకు పిలుపు నిచ్చారు. ఆ మేరకు బీఎస్ఎన్ఎల్ను అభివృద్ధి పరచాలని, ఎంటీఎన్ఎల్తో అనుసంధానం చేయవద్దని, బీఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్న అమెరికా సంస్థతో కుదుర్చుకున్న డిలాయిట్ కమిటీ సిఫారసులను బహిరంగ పరచాలని, కొత్త పింఛన్ విధానం రద్దు చేయాలని, తమకు చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలు మంజూరు వంటి డిమాండ్ల సాధనకు మంగళవారం సమ్మె బాట పట్టారు. మంగళ, బుధవారాల్లో సమ్మెకు పిలుపు నివ్వడంతో ఉదయాన్నే కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. సిబ్బంది తమ తమ కార్యాలయాల వద్దకు చేరుకుని కాసేపు నిరసన తెలియజేశారు. ఉన్నతాధికారుల కార్యాలయాలు, ప్రధాన, డివిజన్ కార్యాలయాలు, ఎక్స్చేంజ్లు, సేవా కేంద్రాలు అన్నీ మూత బడ్డాయి. దీంతో వినియోగ దారులకు అందించాల్సిన సేవలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. బిల్లింగ్, మొబైల్ ఫిర్యాదులు తదితర సేవలు సైతం రద్దు కావడంతో వినియోగ దారులకు తంటాలు తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా విధుల్ని బహిష్కరించిన సిబ్బంది ధర్నాలు, ఆందోళనలతో తమ నిరసన వ్యక్తం చేశారు. అన్ని కార్యాలయాల ఎదుట నిరసనలు సాగాయి. అదే సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఆయా కార్యాలయాల వద్ద గట్టి భద్రతా చర్యలను పోలీసు యంత్రాంగం తీసుకుంది. చెన్నైలో బీఎస్ఎన్ఎల్కు చెందిన 250 కార్యాలయాలు, ఎక్స్చేంజ్లు, సేవా కేంద్రాలు మూత బడ్డాయి. అన్నానగర్, అన్నా సాలై, ప్యారీస్, నుంగంబాక్కం, వెప్పేరి, తదితర ప్రాంతాల్లోని కార్యాలయాల వద్ద ఉద్యోగులు ఆందోళలనకు దిగారు. ఈ విషయంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘంనాయకుడు గోవిందరాజు మట్లాడుతూ, తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి దిశగా రెండు రోజుల సమ్మెకు పిలుపు నిచ్చామన్నారు. కేంద్రం నుంచి స్పందన రాని పక్షంలో తదుపరి కార్యచరణ ఉంటుందని, బీఎస్ఎన్ఎల్ను రక్షించుకుంటామన్నారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ఆప్: సెల్ నుంచే బిల్లు చెల్లించొచ్చు
బీఎస్ఎన్ఎల్ కొత్త అప్లికేషన్ సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ బిల్లును సెల్ నుంచే చెల్లించేందుకు ఉపయోగపడే కొత్త అప్లికేషన్(ఆప్)ను బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చింది. ‘మై బీఎస్ఎన్ఎల్ ఆప్’ అనే ఈ అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే మొబైల్ బిల్లు మొత్తం ఎంతుందో తెలుసుకుని ఫోన్ ద్వారానే చెల్లించొచ్చు. అలాగే బ్యాలెన్స్ రీచార్జీ కూడా చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను www.myapp.bsnl. co.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.