పటిష్టమైన నెట్‌వర్కే మా బలం.. | BSNL services increasing the speed | Sakshi
Sakshi News home page

పటిష్టమైన నెట్‌వర్కే మా బలం..

Published Wed, Aug 26 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

పటిష్టమైన నెట్‌వర్కే మా బలం..

పటిష్టమైన నెట్‌వర్కే మా బలం..

బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ సీజీఎం పి.వి. మురళీధర్
- త్వరలో 21.6 ఎంబీపీఎస్ స్పీడ్‌తో మొబైల్ నెట్
- మా వినియోగదార్లకు కాల్ డ్రాప్ సమస్యే లేదు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీసుల వేగాన్ని పెంచుతోంది. పారదర్శకతకు తోడు ప్రైవేటు టెల్కోల కంటే తక్కువ ధరకే మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లను ఆఫర్ చేస్తూ... కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు పెద్ద ఎత్తున 3జీ టవర్లను, వైఫై హాట్‌స్పాట్స్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. తదుపరి తరం నెట్‌వర్క్‌తో వినూత్న సేవలందించటంపై దృష్టిపెట్టామని, తమకున్న బ్రాండ్ ఇమేజ్‌తో రానున్న రోజుల్లో టెలికం రంగంలో సంచలనాలకు తెర తీస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ ఆంధ్రప్రదేశ్ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పి.వి.మురళీధర్ చెప్పారు. సర్కిల్‌లో చేపట్టిన విస్తరణ, సంస్థ నూతన సేవల గురించి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యాంశాలివీ...
 
కాల్ డ్రాప్ సమస్య తీవ్రమవుతోంది. మీ వినియోగదారుల క్కూడా...?
అలాంటిదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో సహా) సర్కిల్‌లో ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2జీ టవర్లు 7,518, 3జీ టవర్లు 3,113 ఉన్నాయి. 2014-15లో మొత్తం 3,600 టవర్లను ఏర్పాటు చేశాం. రెండు రాష్ట్రాల్లో కలిపి 1,126 మండలాలను, 20 వేలకుపైగా గ్రామాలను కవర్ చేశాం. 450 పట్టణాల్లో 3జీ సేవలు అందుబాటులోకి తెచ్చాం. 2015-16లో రూ.200 కోట్లతో 1450 దాకా కొత్త 3జీ టవర్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా కొత్తగా 700 పట్టణాలకు 3జీ సర్వీసులను విస్తరిస్తాం. ఈ స్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరించటంతో మా వినియోగదారులకు కాల్ డ్రాప్ సమస్యే లేదు. అది మేం గట్టిగా చెప్పగలం.
 
ఇతర కంపెనీల మాదిరి మీరూ డేటాపై దృష్టి పెడుతున్నారా?
మాకు ఈ సర్కిల్‌లో 95 లక్షల మంది మొబైల్ చందాదారులున్నారు. నెలకు కొత్తగా 1.2 లక్షల కస్టమర్లు జతవుతున్నారు. దాదాపు అంతా డేటా వాడుతున్నవారే. అందుకే వేగవంతమైన నెట్‌పై ఫోకస్ చేశాం. మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు త్వరలో మరింత స్పీడ్‌ను అందుకుంటారు. ప్రస్తుతం 14.4 ఎంబీపీఎస్ వేగం ఇస్తున్నాం. డిసెంబర్‌కల్లా దీనిని 21.6 ఎంబీపీఎస్‌కు చేరుస్తాం.
 
4జీ సేవల్లోకి ప్రవేశిస్తున్నారా?
మా కొత్త టెక్నాలజీతో 4జీని కూడా అందించే వీలుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీని వాడాం. 4జీ సేవలు ఎప్పుడు ప్రారంభించేదీ కేంద్ర కార్యాలయం నిర్ణయిస్తుంది.
 
బ్రాడ్ బ్యాండ్ సంస్థలు తక్కువ ఖర్చుకే నెట్ అందిస్తున్నాయి. మరి మీరు?
హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో 700 దాకా వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేశాం. రెండు నెలల్లో మరో 450 వస్తాయి. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 4,000 హాట్‌స్పాట్స్ వస్తాయి. కస్టమర్లు నెట్ వ్యయాన్ని 70-80% ఆదా చేసుకునేందుకు ఇవి దోహదం చేస్తాయి. హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించేందుకు ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్‌టీటీహెచ్) సేవల్ని హైదరాబాద్‌సహా 10 ప్రాంతాల్లో ప్రారంభించాం. 6,000 పైగా కస్టమర్లున్నారు.
 
కొత్త సేవలేమైనా ప్రారంభిస్తున్నారా?
ఎక్స్ఛేంజీలను తదుపరి తరం నెట్‌వర్క్ టెక్నాలజీతో ఆధునీకరిస్తున్నాం. దీంతో ల్యాండ్‌లైన్ వినియోగదారులు మరిన్ని సేవలు పొందే వీలుంది. దేశంలో ఎక్కడున్నా క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌గా (సీయూజీ) ఏర్పడి... అపరిమితంగా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. సభ్యుల సంఖ్యనుబట్టి నెలకు కొంత అదనంగా చెల్లించాలి. గతంలో ఒక ఎక్స్ఛేంజ్ పరిధిలో మాత్రమే సీయూజీకి అవకాశం ఉండేది. అలాగే మొబైల్‌కు వచ్చిన కాల్‌ను ల్యాండ్‌లైన్‌కు బదిలీ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ సేవలు 5 నెలల్లో ఇక్కడ అందుబాటులోకి వస్తాయి.
 
మీ సర్కిల్ ఆదాయం సంగతో...?
2014-15లో ఇక్కడ రూ.2,321 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది 10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. గత జూలైతో పోలిస్తే ఈ జూలైలో జీఎస్‌ఎంలో 5 శాతం, బ్రాడ్‌బ్యాండ్‌లో 4 శాతం వృద్ధి నమోదైంది. 2018 కల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ను లాభాల్లోకి తేవాలన్న సంస్థ ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. ధరలు, ప్యాక్‌ల విషయంలో అంతా పారదర్శకం. ఇదే మాకు కలిసి వచ్చే అంశం. సిబ్బందిని ఎప్పటికప్పుడు సుశిక్షితులను చేస్తున్నాం. 45,000లకుపైగా టచ్ పాయింట్లున్నాయి. ఈ ఏడాది 10 శాతం పెంచుతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement