మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యాలు అధికమవుతున్నాయి. దానికితోడు ఇటీవల కేంద్ర బడ్జెట్ 2025-26లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుడి చేతిలో మరింత ఆదాయం ఉంచేందుకు ఆదాయ పన్ను శ్లాబులను సవరించడం, రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వినియోగదారులకు సంతోషం కలిగించే అంశమే అయినా ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న కొనుగోళ్లు..
గత దశాబ్దంలో చాలా కుటుంబాల డిస్పోజబుల్ ఆదాయం(ఖర్చులుపోను మిగిలే మొత్తం) గణనీయంగా పెరిగింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి, నిరంతరం విస్తరిస్తున్న వస్తువులు, సేవలతో వినియోగదారులు తమ జీవితాలను మెరుగుపరిచుకునేలా కొనుగోళ్లు చేస్తున్నారు. మునుపటి కంటే ఈ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రుణ సౌకర్యాలు, ఆన్‌లైన్ మార్కెట్ వాటా హెచ్చవుతుంది. సామాన్యుడి ఖర్చులు కూడా అదే రీతిలో పెరుగుతున్నాయి.
ఖర్చు పెంచేలా..
కొనుగోలుదారుల ఖర్చు చేసే శక్తిని పెంచడంలో ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, తనఖా అవకాశాలు వినియోగదారులకు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడానికి తోడ్పడుతున్నాయి. ఒకింత వారి భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి మార్గాలను అందిస్తున్నాయి. తిరిగి చెల్లించే మార్గాల సంగతి అటుంచితే సులభంగా డబ్బు సమకూరడంతో ఆఫర్లపై ఆకర్షణ, వ్యయం పెరగడానికి, రిటైల్ రంగం అభివృద్ధికి దారితీసింది.
పొదుపు చేసేలా..
ఆర్థిక సంస్థలు, వ్యక్తులు అప్పు ఇస్తున్నారు కదా అని పూర్తిగా వీటికి బానిసైతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సులభమైన రుణ సౌలభ్యం వల్ల శక్తికి మించి ఖర్చు చేయాలనే ప్రలోభాలు కలిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పెరుగుతున్న ఆదాయాలు, కేంద్ర ప్రకటిస్తున్న పన్నుల మినహాయింపుతో సమకూరుతున్న డబ్బును వృథా ఖర్చులకు కాకుండా, పెట్టుబడికి, పొదుపునకు ఉపయోగించాలని సూచిస్తున్నారు. వినియోగదారులు డబ్బు విషయంలో తర్కంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధాన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment