మళ్లీ సమ్మె బాట
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం సాగిస్తున్న పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు చేసి పట్టుకెళ్లడం, ఆందోళనలు బయలుదేరడంతో పాలకులు స్పందించడం, విడుదల కావడం పరిపాటిగా మారింది. అయితే, తమ సమస్యకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తుందోనన్న ఎదురు చూపుల్లో జాలర్లు ఉన్నారు. పాలకులు కేవలం హామీలు ఇవ్వడం, ఆ తర్వాత విస్మరించడం పరిపాటిగా మారడంతో ఇక వారి నడ్డి విరిచి తమ సమస్యల్ని పరిష్కరించుకోవడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. తమ మీద దాడులకు శాశ్వత పరిష్కారం, శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవల స్వాధీనం లక్ష్యంగా నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ఇది వరకు తాము ఎన్నో సమ్మెలు చేపట్టినా, తాజాగా చేపట్టిన సమ్మె మాత్రం తమలో రగులుతున్న ఆక్రోశానికి ప్రతీరూపంగా జాలర్ల సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మెతో తమ బలాన్ని కేంద్ర, రాష్ట్రంలోని పాలకులకు చూపించే రీతిలో జాలర్లు నిరసనలకు సిద్ధమయ్యారు.
నిరవధిక సమ్మె : తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, కారైక్కాల్ జాలర్లు గురువారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. తమ సమ్మెకు మద్దతు ప్రకటించే రీతిలో ఇతర జిల్లాల్లోని జాలర్లు సైతం ఏకం కావాలని ఆ నాలుగు జిల్లాల జాలర్ల సంఘాలు పిలుపునిచ్చారుు. ఉదయం నుంచి జాలర్లు చేపల వేటను బహిష్కరించడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితం అయ్యారుు. నాగపట్నం జిల్లా వేధారణ్యం, పూంబుహార్ హార్బర్ల నుంచి ఏ ఒక్క పడవ సముద్రంలోకి వెళ్ల లేదు. ఈ జిల్లాలోని 25 వేల మంది జార్లు సమ్మె బాట పట్టారు. పుదుకోట్టై, జగదాపట్నం, కొట్టై పట్నంలలో ఐదు వేల పడవలు వేటకు వెళ్లలేదు. కారైక్కాల్, తిరువారూర్ జిల్లాలోను జాలర్లు సమ్మెకు దిగడంతో వేట ఆగింది. ఈ నాలుగు జిల్లాల్లో 50 వేల మంది జాలర్లు చేపల వేటకు దూరం కావడంతో ఆ ప్రభావం ఇతర రంగాల మీద పడింది. ఐస్ గడ్డల ఉత్పత్తిని ఈ జిల్లాల్లో నిలుపుదల చేయాల్సిన పరిస్థితి.
అలాగే, డీజిల్ విక్రయాలు తగ్గాయి. చేపల్ని కొనుగోలు చేసే టోకు, చిరు వర్తకులకు ఆదాయం తగ్గింది. ఈ సమ్మెను మరింత ఉధృతం చేసే విధంగా ఈ జిల్లాల జాలర్ల సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకునే రీతిలో భారీ ఎత్తున నిరసనలకు వ్యూహ రచన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని జాలర్ల సంఘాలు ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డాయి. తమకు సముద్రంలో భద్రత కల్పించాలని, వేటకు ఆటంకాలు ఎదురు కాకూడదని, శ్రీలంక జాలర్ల సంఘాలతో చర్చలకు చర్యలు తీసుకోవాలని, శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవల్ని, అక్కడి జైళ్లలో ఉన్న జాలర్లు అందర్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడక్కడ జాలర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
27 మంది విడుదల : శనివారం అర్ధరాత్రి కచ్చదీవుల సమీపంలో పుదుకోట్టై, రామేశ్వరానికి చెందిన 27 మంది జాలర్లను శ్రీలంక సేనలు బంధించారు. వీరందర్నీ తమ దేశానికి తీసుకెళ్లారు. అయితే, ఇన్నాళ్లు కోర్టుల్లో హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టే లంక సేనలు తాజాగా రూటు మార్చారుయి. పట్టుకెళ్లిన వారందర్నీ తీవ్రంగా మందలించి వదిలి పెట్టారు. అయితే, తమిళనాడు జాలర్ల సంఘాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుండడం, సమ్మె బాటలో నాలుగు జిల్లాల జాలర్లు పయనిస్తుండడాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని ఒత్తిడి తెచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే పట్టుకెళ్లిన వాళ్లను కేవలం మందలించి వదలి పెట్టినట్టు సమాచారం.