సాక్షి, ముంబై: లాటరీలో ఇల్లు వచ్చినా ఇంతవరకు వాటిని స్వాధీనం చేసుకోని కార్మికుల కోసం గాలింపు చర్యలు ఇక నిలిపివేయాలని మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (మాడా) నిర్ణయం తీసుకుంది. పలుమార్లు పోస్టు ద్వారా ఉత్తరాలు పంపించినప్పటికీ వారి నుంచి స్పందన రావడం లేదు. ఇంతకూ వారున్నారా...? లేరా..? తప్పుడు చిరునామా ఇచ్చారా...? అనేది కూడా అంతుచిక్కడం లేదు. దీంతో వారికోసం వేచి ఉండటం మానేసి వెయిటింగ్ లిస్టులో ఉన్న కార్మికులకు ఆ ఇళ్లు అందజేయాలని మాడా పరిపాలన విభాగం యోచిస్తోంది. మిల్లు కార్మికుల కోసం మాడా మొదటి విడతలో నిర్మించిన 6,925 ఇళ్లకు 2012 జూన్‌లో లాటరీ వేసింది.
ఆ సమయంలో మిల్లు కార్మికుల నుంచి 1.48 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత మాడా అధికారులు పరిశీలన పనులు పూర్తిచేసి అర్హులైన 58 వేల దరఖాస్తులకు లాటరీ వేశారు. ఇందులో ఇల్లు వచ్చిన కార్మికులకు ఇళ్ల తాళాలు అందజేసే ప్రక్రియ ప్రారంభించింది. కాని లాటరీలో ఇల్లు వచ్చిన 625 మంది కార్మికులు మాడాతో సంప్రదింపులు జరపలేదు. దీంతో దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ 260 ఇళ్లు అలాగే పడి ఉన్నాయి. దీంతో వాటిని వెయిటింగ్‌లో ఉన్నవారికి అందజేయాలని మాడా అధికారులు నిర్ణయించారు.
‘స్పందన’ లేని ఇళ్లు ఇతరులకు కేటాయింపు
Published Mon, Dec 8 2014 10:21 PM | Last Updated on Mon, Oct 8 2018 5:59 PM
Advertisement