Tendering process
-
టెండర్ల న్యాయపరిశీలన బాధ్యతలు జస్టిస్ శివశంకర్‌రావుకు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెండర్ల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అక్రమాలకు ఏమాత్రం తావు లేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించేందుకు ఇటీవల ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా బుధవారం కీలక నియామకాన్ని చేపట్టింది. టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన బాధ్యతలను తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు అప్పగించింది. అమలాపు రానికి చెందిన ఆయన మూడేళ్ల పాటు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఈ మేరకు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులిచ్చారు. ప్రమాణ స్వీకారం రోజే మాటిచ్చిన ముఖ్యమంత్రి.. గత ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏమాత్రం పారదర్శకత లేకుండా రూ.వందల కోట్ల విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టింది. దీనికి అడ్డుకట్ట వేసి టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. టెండర్లను మొదలు పెట్టడానికి ముందే ఆ ప్రక్రియను పరిశీలించేందుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తీసుకొచ్చింది. రూ.100 కోట్లు దాటిన టెండర్లన్నీ న్యాయ పరిశీలనకే... కొత్త చట్టం రాకతో ఇకపై వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు. న్యాయ పరిశీలన అనంతరం వచ్చే సూచనల ప్రకారం ఆ టెండర్‌పై నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ వనరులను సమర్థంగా, అనుకూలమైన విధానంలో ఉపయోగించడంలో భాగంగా రివర్స్ టెండరింగ్ కూడా నిర్వహిస్తారు. ఏ ఒక్కరికో పనులు కట్టబెట్టకుండా అర్హత కలిగిన వారందరికీ సమాన అవకాశాలు కల్పించడం కూడా ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ చట్టాన్ని ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చింది. ఏసీజేతో చర్చించిన ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ బాధ్యతలను న్యాయ పరిశీలనకు అప్పగించే విషయంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. న్యాయ పరిశీలన బాధ్యతలను చేపట్టేందుకు విశ్రాంత న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాలని ఏసీజేను కోరింది. ఈ నేపథ్యంలో ఆయన సిఫారసు మేరకు ఈ బాధ్యతలను జస్టిస్ శివశంకరరావుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ శివశంకరరావు నేపథ్యం.. జస్టిస్ శివశంకరరావు 1959 మార్చి 29వతేదీన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం సకుర్రు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి గవర్రాజు మాజీ సర్పంచ్. జస్టిస్ శివశంకరరావు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఎల్ చేశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. 1984లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పాలగుమ్మి సూర్యారావు, దువ్వూరి మార్కండేయుల వద్ద జూనియర్‌గా పని చేశారు. 1996లో జ్యుడీషియల్ సర్వీసుల్లోకి ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో పనిచేశారు. 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత తెలంగాణ హైకోర్టుకు ఆప్షన్ ఇచ్చారు. పలు సంచలన తీర్పులిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆయన పదవీ విరమణ చేశారు. దర్మబద్ధంగా బాధ్యతలు నిర్వర్తిసా ‘‘ప్రభుత్వం ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యతలను అప్పగించింది. ధర్మబద్ధంగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తా. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వను. నాకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా త్రికరణశుద్ధితో నిర్వర్తిస్తా. అవినీతి రహిత సమాజం కోసం నావంతు కృషి చేస్తా’’ – జస్టిస్ శివశంకరరావు -
‘రీటెండరింగ్ ద్వారనే ‘పోలవరం’ పనులు’
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును రికార్డు టైంలో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సోమవారం ఆయన కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జల్‌జీవన్ మిషన్ సదస్సులో పాల్గొన్నారు. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెలలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీలో పర్యటిస్తారని... పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రాజెక్టుకు సంబంధించి సెప్టెంబర్‌లో టెండర్లు పిలవబోతున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రూ. 60 వేల కోట్ల అంచనాలతో ఈ పనులను ప్రారంభించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం కోరామని మంత్రి వివరించారు. -
విజయనగరంలో పర్యటించిన మంతి బొత్స
-
సత్య ప్రమాణాల స్వామికే శఠగోపం..
టీడీపీ నాయకులు సత్య ప్రమాణాల స్వామిగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం వినాయకుడికే శఠగోపం పెట్టారు. గత ఐదేళ్లలో కాణిపాకం దేవస్థానం సము దాయంలో దుకాణాల నిర్వహణకు అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్నారు. రుసుం చెల్లించకుండా చేతులెత్తేశారు. టెండరు పాడుకున్న సమయంలో ఇచ్చిన చిరునామాకు వెళ్లిన అధికారులు.. ఆ పేర్లతో ఎవరూ లేరని చెప్పడంతో వెనుదిరుగుతున్నారు. సాక్షి, కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఆలయం వద్ద భక్తుల అవసరం మేరకు దుకాణ సముదాయాలను ఏర్పాటుచేసింది. వీటికి ఏడాది, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాలవ్యవధిలో టెండర్ల ద్వారా కేటాయిస్తారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దేవస్థానంలో దుకాణాలు దక్కించుకొని.. టెండరు పలికిన మొత్తం చెల్లించకుండా దేవస్థాన ఖజానాకు భారీగా గండి కొట్టారు. చివరికి రూ.2 కోట్ల రూపాయల మేర అప్పులుగా మిగిల్చారు. వీటిని వసూలు చేసుకునేందుకు దేవస్థాన అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చేసేదిలేక న్యాయస్థానాలకు ఆశ్రయిస్తున్నారు. దేవస్థానం అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం దాదాపు రూ.2 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉంది. తప్పుడు చిరునామాతో టెండర్లు కాణిపాకం దేవస్థానం దుకాణ సముదాయాల్లో షాపులను టెండర్లు నిర్వహించి ఏడాది పాటు కేటాయిస్తారు. 6 నెలల క్రితం వరకు మొదట్లో డిపాజిట్ కట్టించుకోకుండా కేటాయించేవారు. ప్రతి నెలా అధికారులు దుకాణదారుల వద్దకు వెళితే మొక్కుబడిగా కొంత మొత్తం చెల్లించేవారు. గడువు పూర్తయ్యే సరికి పెద్ద మొత్తంలో బకాయి మిగిలిపోవడంతో అధికారులు ఒత్తిడి చేయకుండా మభ్య పెడుతూ వచ్చారు. గడువు పూర్తయ్యాక ముఖం చాటేస్తున్నారు. వారిచ్చిన చిరునామాకు అధికారులు వసూళ్ల కోసం వెళితే వారు ఇచ్చిన చిరునామా తప్పని తేలుతోంది. బినామీలకు సహకరిస్తూ లక్షలు వెనకేసుకుంటూ.. బినామీ పేర్లతో దుకాణాలు దక్కించుకున్న టీడీపీ నాయకులు వాటిద్వారా లక్షలు గడించారు. వీరికి ఐదేళ్లుగా ఎలాంటి ఒత్తిడి రాకుండా పరిపాలన కార్యాలయంలోని ఓ కీలక అధికారి కొమ్ము కాసేవాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లక్షలు, కోట్లు బినామీ పేర్లతో ఎగవేతలు వేస్తుంటే దేవదాయ శాఖ, ఆశాఖ అధికారులు ఏంచేస్తున్నారో అర్థం కావడం లేదని వారికి సహకరిస్తూ లక్షలు వెనకేసుకున్న అధికారులు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేల్కొన్న అధికారులు ఈ మోసాలను పసిగట్టిన అధికారులు ఆరు నెలల నుంచి టెండర్లు దక్కించుకున్న వారి వద్ద నుంచి ముందుగానే డిపాజిట్ వసూలు చేస్తున్నారు. న్యాయస్థానంలో తేల్చుకుంటాం.. కాణిపాకం దేవస్థానంలో 2014 నుంచి 2019 వరకు టెండరు తాలూకు అప్పులు ఉన్న వారిపై న్యాయస్థానంలో కేసులు వేశాం. ఎక్కువ బాకీ ఉన్న వారి ఆస్తులను జప్తు చేసుకునేందుకు, అప్పులు వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. 2017–19 మధ్య దుకాణ సముదాయాలు తీసుకున్న వారికి నగదు చెల్లింపులు చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చాం. 2014లో కోటి రూపాయలకు పైగా అప్పులు మిగిలాయి. బాధ్యులపై చర్యలు తప్పవు. – పి.పూర్ణచంద్రరావు, కాణిపాకం ఈఓ -
నెలాఖరు లోగా పూర్తి చేయాలి
చేప పిల్లల సేకరణ టెండర్ల ప్రక్రియపై మంత్రి తలసాని ఆదేశం సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చేప పిల్లల సేకరణ టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. విధివిధానాల రూపకల్పనపై మంత్రి శుక్రవారం తన చాంబర్లో మత్స్యశాఖ అధికారులు, ఫెడరేషన్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి ప్రక్రియను తొలగించి జిల్లా స్థాయిలో టెండర్లు పిలిచినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన దరిమిలా గతంలో నిర్వహించిన టెండర్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షార్ట్ నోటీస్ టెండర్ ప్రక్రియ విధివిధానాలపై మంత్రి సమీక్షించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఆరోగ్యవంతమైన చేప పిల్లల సరఫరాకు చేపట్టాల్సిన విధివిధానాలను చర్చించారు. సమావేశంలో మత్స్య శాఖ కమిషనర్ సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘జీ ప్లస్’కు టెండర్లు ఓకే
- అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు - రూ.84.22 కోట్లతో డబుల్ బెడ్రూం ప్లాట్లు - 1384 మందికి ప్రయోజనం - రూ. 20కోట్లతో మౌలిక వసతులు - త్వరలోనే పనులు ప్రారంభం వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం పిలిచిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. స్లమ్ ఏరియాలైన హన్మకొండలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఎస్ఆర్ నగర్‌లోని నివాసాల స్థానంలో జీప్లస్-1, జీప్లస్-3 పద్ధతిన డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పర్యవేక్షణ శాఖ ఎంపిక, టెండర్ల నిర్వహణ, పాలనాపరమైన అనుమతులు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌కు కట్టబెట్టింది. రూ.వంద కోట్లకు పైగా వ్యయం కానున్న జీప్లస్ గృహాల నిర్మాణ ప్రాజెక్టు బాధ్యతను జిల్లా కలెక్టర్ ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్ అండ్ బీ శాఖ పూర్తి స్థాయిలో డీపీఆర్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేటు సాంకేతిక సంస్థ సహాయం తీసుకొని ఈ డీపీఆర్‌కు రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలోని కమిటీ ఈ డీపీఆర్‌కు ఆమోదం వేయగానే ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ఆన్లైన్లో టెండర్లు నిర్వహించారు. రూ.43 కోట్లతో జీప్లస్-3 నిర్మాణం: హన్మకొండ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లోని 7 ఎకరాల స్థలంలో జీప్లస్-3 పద్ధతిలో అ ర్హులుగా గుర్తించిన 592మందికి డబుల్ బెడ్రూం ఇ ళ్లు నిర్మించనున్నారు. ఈ కాలనీల్లో ప్లాట్లు, రోడ్లు, వి ద్యుత్ సౌకర్యం, ఇతరత్రా మౌలిక సదుపాయాలతో పాటు సీవరేజీ ప్లాంటు నిర్మిస్తారు. ఇళ్ల నిర్మాణానికి రూ.34కోట్లు, మౌలిక సదుపాయాలు, ఇతరత్రా వ్య యానికి రూ.9కోట్లు కేటాయించారు. ఈ పనుల కో సం నిర్వహించిన టెండర్లలో నాలుగు ఏజెన్సీలు పో టీ పడ్డాయి. ఈ టెండర్ల ప్రైస్‌బిడ్ ఓపెన్ చేయగా హైదరాబాద్‌కు చెందిన డాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 1.17శాతం మైనస్, బీపీఆర్ కంపెనీ రూ.1శాతం మైనస్‌కు టెండర్లు వేయగా 7.29శాతం తక్కువ వేసిన మంద ఐలయ్య కంపెనీ ఈపనులను దక్కిం చుకున్నట్లు ఆర్అండ్బీ అధికారులు చెప్పారు. రెండు రోజుల్లో అగ్రిమెంటు కాగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. రూ.71.80కోట్లతో జీప్లస్-1 ఇళ్ల నిర్మాణం: వరంగల్‌లోని ఎస్ఆర్ నగర్‌లోని 17 ఎకరాల్లో జీప్లస్-1 పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించనున్నారు. ఇక్కడ అధికారులు జీప్లస్-3పద్ధతుల్లో ఇళ్లు నిర్మించేందుకు యత్నించగా స్థానికుల నుంచి వ్యతి రేకత రావడంతో అర్హులుగా గుర్తించిన 792మందికి జీప్లస్-1పద్ధతిలో ఇళ్లు నిర్మించనున్నారు. ఇందులో నిర్మాణాలను గ్రేడ్లుగా విభజించారు. - గ్రేడ్‌లో 4+4, బి-గ్రేడ్‌లో 2+2, సి- గ్రేడ్‌లో 1+1, డి-గ్రేడ్‌లో 1+1గా జీప్లస్ పద్ధతిలో నిర్మించేందుకు అధికారులు డీపీఆర్ రూపొందించారు. ఇందులో సి, డీ గ్రేడ్ల ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించాల్సి వస్తున్నందున ఎ, బి గ్రేడ్‌లో ఇళ్లు నిర్మించేందుకు జిల్లా కమిటీ నిర్ణయించింది. రూ.71.80కోట్ల వ్యయంతో ఇందులో రూ.50.22కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్లు, రూ.10.40కోట్లతో మౌలిక సదుపాయాలు, రూ.11.18కోట్లు ఇతరత్రా వ్యయానికి కేటాయించారు. ఈ పనుల కోసం నిర్వహించిన టెండర్లలో ఆరుగురు పాల్గొనగా నలుగురు అర్హత పొందారు. బీపీఆర్ కంపెనీ రూ.0.01ప్లస్‌కు, మంద ఐలయ్య కంపెనీ 0.90శాతం ఎక్కువకు టెండర్లు వేయగా హైదరాబాద్‌కు చెందిన డాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 4.14శాతం మైనస్‌తో ఈపనులను దక్కించుకున్నట్లు ఆర్అండ్బీ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ పనుల అగ్రిమెంటు పూర్తి కావడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. రూ.130కోట్ల వ్యయంతో డబుల్బెడ్రూం నిర్మాణం ప్రభుత్వం నగరంలో నిర్మించ తలపెట్టిన డబుల్‌రూం ఇళ్ల నిర్మాణానికి సుమారు రూ.130కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో రూ.110కోట్ల వరకు ఇళ్ల నిర్మాణానికి వ్యయం చేస్తుండగా రూ.20కోట్లు మౌలిక వసతుల కోసం వెచ్చిస్తాం. రోడ్లు, విద్యుత్ సరఫరాలతో పాటు నగరంలో మొదటి సారిగా సీవరేజి ప్లాంట్లు నిర్మిస్తాం. కాలనీల్లో వినియోగించిన నీటిని సీవరేజీ ప్లాంటులో శుద్ధి చేయడం వల్ల వాటిని మొక్కల పెంపకానికి, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ రెండు టెండర్ల ప్రక్రియ పూర్తయి అగ్రిమెంటు పూర్తింది. ప్రభుత్వం సిగ్నల్ ఇవ్వగానే పనులు ప్రారంభిస్తాం. ఈ రెండు పనులు 15నెలల కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. - మోహన్‌నాయక్, ఎస్ఈ, ఆర్అండ్బీ -
తాగునీటి పథకం వేగవంతం
- మొదటి దశ బిడ్లు ఓపెన్ - మరోసారి పరిశీలించి 9 సెగ్మెంట్లలో కాంట్రాక్టు త్వరలో ఖరారు - రెండో దశ టెక్నికల్ బిడ్లు ఓపెన్ చేసిన అధికారులు - మూడో దశకు నేటి నుంచి టెండర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు దశల్లో చేపట్టనున్న తెలంగాణ తాగునీటి పథకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రూ.6,589 కోట్లతో చేపట్టనున్న మూడో దశ టెండర్లకు ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం నేటి నుంచి ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆ పనుల కోసం టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. ఇక మొదటి దశ టెండర్ల ప్రక్రియలో కీలక ఘట ్టం బుధవారంతో ముగిసింది. 9 సెగ్మెంట్లలో చేపట్టే ఈ పనులకు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్లను తెరిచింది. దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీలు ఈ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో టెండర్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లలో అంచనా విలువల కంటే తక్కువ మొత్తానికి టెండర్లు దాఖలు చేసిన కంపెనీల ఫైనాన్షియల్ బిడ్లను ప్రాథమికంగా గుర్తించింది. వీటిపై మరోసారి పరిశీలన జరిపి, చర్చించి టెండర్లను త్వరలోనే ఖరారు చేయనుంది. అలాగే రెండో దశ టెండర్ల టెక్నికల్ బిడ్లను బుధవారం తెరిచింది. ఇందులో వివిధ కంపెనీల సాంకేతిక అర్హతలను పరిశీలించిన తరువాత ప్రాజెక్టు నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న కంపెనీల ఫైనాన్షియల్ బిడ్లను త్వరలోనే తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. -
వాటర్‌గ్రిడ్ టెండర్లకు నోటిఫికేషన్
* తొలి విడతగా 11 ప్యాకేజీలకు.. * రూ. 15,987 కోట్ల విలువైన పనులకు టెండర్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి పథకం (వాటర్‌గ్రిడ్) తొలిదశ పనులకు టెండర్ల నోటిఫికేషన్‌ను గ్రామీణ నీటి సరఫరా అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని 26 ప్యాకేజీలుగా విభజించగా.. తొలివిడతగా 11 ప్యాకేజీలకు టెండర్లను పిలిచారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,568 కోట్లు కాగా.. రూ.15,987 కోట్ల విలువైన పనులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈనెల 27 నుంచి ఆగస్టు 11 వరకు ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ (www. eprocurement.gov.in)లో టెండర్ డాక్యుమెంట్, రశీదు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 11న సాయంత్రం 5.15 గంట లకు టెక్నికల్ బిడ్లను, 14న ఉదయం 11.30కు ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నారు. జిల్లాల వారీగా టెండర్ల ప్రక్రియను ఆయా జిల్లాల్లోని సూపరింటెండెంట్ ఇంజనీర్లు పర్యవేక్షించనున్నారు. -
ఆదర్శంగా వాటర్‌గ్రిడ్
ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు ఈ ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి తొలివిడతలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు మంచినీరు ప్రాజెక్టుపై సమీక్షలో సీఎం కేసీఆర్ హైదరాబాద్: ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా అందించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలి చేలా చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. దీనికి సంబంధించి 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడిం చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పట్ల దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం సచివాలయంలో ఆ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఇతర ఉన్నతాధికారులతో కలసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాజెక్టు పను లు వేగంగానూ, పారదర్శకంగానూ జరగాలని అధికారులకు సూచించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా, కరువు పీడిత మహబూబ్‌నగర్ జిల్లాలకు తొలిదశలో సురక్షితమైన తాగునీరు అందించి, ఆపై ప్రాజెక్టు పురోగతి మేరకు ఇతర జిల్లాలకు మంచి నీటిని సరఫరా చేయాలని చెప్పారు. నిధుల కొరత రానివ్వం: హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్), నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) సంస్థలు వాటర్‌గ్రిడ్‌లో రూ.13వేల కోట్లు పెట్టుబడులు పెట్టేం దుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఈ సంస్థలు మరో రూ.7వేల కోట్లు ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పా రు. మరికొన్ని సంస్థలు, కేంద్రం నుంచి కూడా కొంతమేరకు నిధులు అందవచ్చన్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు సమాకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికారులు కూడా అదే పట్టుదలతో పనిచేయాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 26 ప్యాకేజీల్లో ఇప్పటికే 17 ప్యాకేజీలకు టెండర్లు పిలిచామని, మరో వారంలో మిగిలిన వాటికి టెండర్లు పిలుస్తామన్నారు. సీఎం స్పందిస్తూ.. దేశంలోని అన్ని ప్రముఖ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని, మరో 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత విషయంలో రాజీపడవద్దని సీఎం నిర్దేశించారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపొందించాక నిపుణుల కమిటీ పరిశీలనకు పంపి అవసరమైన సూచనలు తీసుకోవాలని సూచించారు. రైల్వేశాఖ నుంచి బ్లాంకెట్ పర్మిషన్లు! ప్రాజెక్టుకు సంబంధించి వివిధ స్థాయుల్లో 311 చోట్ల రైల్వే లైన్లు అడ్డొస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ వెంటనే దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. పైప్లైన్లు రైల్వేలైన్ల క్రాసింగ్ కు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. రెండు మూడు రోజుల్లో రైల్వేశాఖతో సమావేశమవ్వాలని అధికారులకు సూచించారు. అన్ని క్రాసింగ్లకు ఒకేసారి బ్లాంకెట్ పర్మిషన్లు పొందాలని అధికారులకు చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్థిక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మిశ్రా, వాటర్‌గ్రిడ్ ఎండీ శాలిని మిశ్రా, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
చెరువులకు నేటి నుంచి టెండర్ల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు టెండర్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 చెరువులకు టెండర్లు పిలవనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసిన మరో 1,200 నుంచి 1500 చెరువులకు టెండర్లు పిలవొచ్చని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. అంచనాలను స్క్రూటినీ చేసిన చెరువులకు జిల్లాల వారీగా ఎస్‌ఈలే టెండర్లను ఖరారు చేస్తారన్నారు. సోమవారం నాటి టెండర్లన్నీ రూ.కోటికి మించనివేనన్నారు. -
అదనపు రాబడి వేటలో మాడా
సాక్షి, ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ అభివద్ధి సంస్థ (మాడా) అదనపు రాబడి వేటలో పడింది. ఇందులోభాగంగా సొంత భవనాలపై ప్రకటనలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించనుంది. ఇటీవల జరిగిన మాడా పరిపాలన విభాగం సమావేశంలో ఈ బృహత్తర నిర్ణయానికి అధికారులు ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఈ సంస్థ వీలైనంత త్వరగా ప్రారంభించనుంది. నగరంలో అక్కడక్కడ మాడాకు చెందిన 56 కాలనీలు ఉండగా, అందులో మూడు వేలకుపైగా భవనాలున్నాయి. ఇందులో కొన్ని భవనాలను అందులో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కు (ఓనర్షిప్) కల్పించి నిర్వహణ బాధ్యతలను వారికే అప్పగించింది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక భవనాలు ఆ సంస్థ అధీనంలోనే ఉన్నాయి. ఇందులో కొన్ని భవనాలు ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్నాయి. మరికొన్ని కీలక ప్రాంతాలు, రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద ఉన్నాయి. వీటిపై ప్రకటనలు ఏర్పాటుకు వివిధ వాణిజ్య సంస్థలు ఏనాటి నుంచో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం నగరంలోని అనేక ప్రైవేటు భవనాలపై ప్రకటనల బోర్డులు, హోర్డింగులు విపరీతంగా వెలుస్తున్నాయి. వాటివల్ల ఆ భవన యజమానులకు అదనపు రాబడి వస్తోంది. ఇదే తరహాలో తన సొంత భవనాలపై ప్రకటనలు ఏర్పాటుచేస్తే అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవచ్చని మాడా భావించింది. అయితే ఈ నిర్ణయం నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు ఎంతమేర స్పందిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల మాడా భవనాలపై మొబైల్ టవర్లను ఏర్పాటుచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే మొబైల్ కంపెనీలు మాత్రం ఆ భవనాలపై టవర్ల ఏర్పాటుపై ఆసక్తి కనబర్చలేదు. ఇప్పుడు ప్రకటనలు, హోర్డింగులు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంజూరు ఇచ్చినప్పటికీ వాణిజ్య సంస్థల నుంచి ఎంతమేర స్పందన వస్తుంది...? ఎంత మేర ఆదాయం రానుందనే విషయం త్వరలో స్పష్టం కానుంది. -
నగరంపై ‘నిఘా’ నేత్రం..
సాక్షి, ముంబై: నగరంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు తిరిగి టెండర్లను పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మూడుసార్లు వాయి దా పడిన ఈ టెండర్ల ప్రక్రియను ఈసారి ఎలాగైనా పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్న ట్లు తెలుస్తోంది. 26/11 ఉగ్రవాద చర్య తర్వాత ముంబై నగర భద్రతపై నీలినీడలు అలముకున్నాయి. ఎప్పుడు ఏవైపు నుంచి ఉగ్రమూకలు దాడులు చేస్తాయోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా సుమారు 1,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి ఉగ్రవాద చర్యల నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది జరిగి ఆరేళ్లు గడిచినా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటివరకు మూడుసార్లు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఏజెన్సీల నుంచి తగిన స్పందన లభించలేదు. దీంతో ఇప్పుడు తిరిగి టెండర్లను ఆహ్వానించేందుకు నిర్ణయించారు. అయి తే ఈసారి ఆహ్వానించే టెండర్లకు సంబంధించి నియమ, నిబంధనల్లో కొద్దిపాటి మార్పులను చేసేందుకు సర్కారు నిర్ణయించింది. ఇదివరకు ఆహ్వానించిన టెండర్లలో వాటిని ఏర్పాటుచేసే సంబంధిత కంపెనీకి ముందుగా రూ.20 శాతం నిధులు చెల్లిస్తామని, మిగిలిన 80 శాతం నిధులు పనులు పూర్తయిన తర్వాత విడతల వారీగా ఐదేళ్లలో చెల్లించనున్నట్లు పేర్కొంది. దీంతో టెండర్లు వేసేందుకు ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు. ఇలా మూడుసార్లు టెండర్లను ఆహ్వానించినప్పటికీ అందులో పొందుపర్చిన నిబంధనలవల్ల ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో తేరుకున్న ప్రభుత్వం నియమ, నిబంధనాల్లో స్వల్ప మార్పు లు చేసింది. ఎంతమేర పనులు పూర్తయ్యాయో అందులో 80 శాతం నిధులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా నిధులను విడతల వారీగా అందజేస్తామని స్పష్టం చేసింది. అంతేగాక రెండు కంపెనీలు (జాయింట్ వెంచర్) సంయుక్తంగా టెం డర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు మంజూ రునిచ్చిం ది. వచ్చే శాసనసభ ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులోకి రాకముందే ఈ పనులకు సంబంధించిన వర్క్ ఆర్డర్ తీస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జే.ఎస్.సహారియా స్పష్టం చేశారు. వచ్చే నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఈ-టెండర్లను ఆహ్వానించనుందని సహారి యా చెప్పారు. అందుకు అవసరమైన వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించనుందన్నారు. అయితే వాటి నియంత్రణ మాత్రం పోలీసు శాఖ వద్ద ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
‘టెండర్’.. వండర్!
- ముగిసిన మద్యం దుకాణాలకు దరఖాస్తు దాఖలు ప్రక్రియ - పోటెత్తిన దరఖాస్తులు - 194 షాపులకు 1922..ప్రభుత్వానికి రూ.4.80కోట్ల ఆదాయం - 23న లాటరీ ద్వారా షాపుల ఎంపిక మహబూబ్‌నగర్ క్రైం: 2014-15కోసం మద్యం దుకాణాలను కేటాయించేందుకు గతవారం రోజుల క్రితం జిల్లా గెజిట్ జారీఅయింది. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలోని 194 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శనివారం నాటితో ముగిసింది. జిల్లావ్యాప్తంగా టెండర్లు వేసేందుకు వ్యాపారులు ఎక్కువసంఖ్యలో తరలొచ్చారు. ప్రక్రియ మొదలైననాటి నుంచి పలువురు టెండర్లను దాఖలు చేయడంలోనే తలమునకలయ్యారు. చివరిరోజు ఎటువంటి ఆటంకం జరగకుండా జాగ్రత్త వహించి దరఖాస్తు ఫారాలను అందించారు. డివిజన్ల వారీగా.. మహబూబ్‌నగర్ పట్టణంలో 68 దుకాణాలకు 106, జడ్చర్ల 19, కొడంగల్ 187, షాద్‌నగర్ లో 256 దరఖాస్తులు వచ్చాయి. గద్వాల డివిజన్లోని 68 దుకాణాలకు గద్వాలలో 172, నారాయణపేట్‌లో 119, వనపర్తిలో 38, కొత్తకోటలో 84, అలంపూర్‌లో 173, ఆత్మకూర్ 93లో దరఖాస్తులు వచ్చాయి. నాగర్‌కర్నూల్ డివిజన్లోని 58 షాపులకు తెల్కపల్లిలో 40, ఆమనగల్లులో 48, నాగర్‌కర్నూల్‌లో 131, కల్వకుర్తిలో 90, కొల్లాపూర్‌లో 128 దుకాణాలకు వ్యాపారస్తులు టెండర్లు వేశారు. అచ్చంపేటలో 125దరఖాస్తు వచ్చాయి. మొత్తంగా రాత్రి 10గంటల వరకు 1922 దరఖాస్తులు వచ్చాయి. అయితే గత 2012-13 సంవత్సరానికి జిల్లావ్యాప్తంగా 184 షాపులకు 1288 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది మాత్రం మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులు ఉత్సాహం చూపారు. మూడు స్లాబ్‌ల విధానంలో.. జిల్లాలో మూడు స్లాబ్‌ల విధానంలో లెసైన్స్ ఫీజులను నిర్ధారించారు. పదివేల జనాభా ఉన్నచోట రూ.32.50 లక్షలు, 10వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతంలో రూ.34 లక్షలు, 50వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్నచోట రూ.42 లక్షల ఫీజును నిర్ణయించారు. దరఖాస్తుదారుడు 25వేల నాన్ రిఫండబుల్ చలాన్, లెసైన్స్ఫీజుపైన 1/3శాతం ధరావత్తు(ఈఎండీ), డీడీ తీయాలి. అదేవిధంగా ఏ1, ఏ2, ఏ3, ఏ4 ఫారాలను నింపాలి. పూర్తి చేసిన దరఖాస్తులను చలాన్, డీడీ, రెండు కలర్ పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలను ఫారాలకు జత పరిచి టెండర్లను దాఖలుచేశారు. 194 షాపులకు టెండర్లుదాఖలు గతంలో జిల్లాలో 194 షాపులకు టెండర్లు వేసిన వాటిలో 185 మద్యం షాపులకు మాత్రమే వ్యాపారులు టెండర్లు వేశారు. మిగతా 9 షాపులకు ఆయా ప్రాంతాల్లో లాభాసాటిగా లేదని ఇతర కారణాలతో అక్కడ టెండర్ల వేసేందుకు వెనకడుగు వేశారు. ఈ వార్షిక సంవత్సరానికి అధికారులు కచ్చితంగా 194 షాపులకు మద్యం వ్యాపారులను టెండర్లు వేసేలా కృషిచేశారు. రెండేళ్లక్రితం వైన్‌షాపుల కేటాయింపుల్లో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, ఎంఆర్పీ రేట్లకే అమ్మకాలు, లెసైన్స్ఫీజుకు ఏడు రెట్ల మొత్తానికి కన్నా ఎక్కవ విలువైన మద్యాన్ని అమ్మితే 13.06శాతం ప్రివిలేజ్ఫీజు వంటి నిబంధనలు, మార్జిన్లోకోత తదితర అంశలన్నీ ఈసారి కూడా ఉన్నాయి. దీంతో మద్యం దుకాణాదారులు వేరే వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యాపారంలో దశాబ్దాలుగా ఉన్న వారు మాత్రమే ఈ సారి కూడా దుకాణాలను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. 23న లాటరీ పద్ధతిన ఎంపిక దాఖలు ప్రక్రియ ముగియడంతో ఈనెల 23న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో 194 మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్లను కలెక్టర్ సమక్షంలో లక్కీడ్రా ద్వారా ఎంపికచే యనున్నారు. -
ఈ-గవర్నెన్స్‌పై టీఎంసీ దృష్టి
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఠాణే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) సేవలను ఈ-గవర్నెన్స్ ద్వారా అందించనుంది. ఇందుకోసం ఇప్పటికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే ఈ-గవర్నెన్స్ ద్వారా అద్భుతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే ప్రజలకు ఈజీగా సేవలు అందించాలని నిర్ణయించిన టీఎంసీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు కోసం కనీసం రెండేళ్ల సమయం తీసుకోవచ్చని కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. కార్పొరేషన్లో అకౌంట్, ఎమర్జెన్సీ వ్యవస్థ, నీటి, ఆస్తి విభాగం, చెత్త విభాగం, హాకర్స్ వ్యవస్థాపన, ఆరోగ్య, జనన-మరణ, అగ్నిమాపక ఇలా అనేక విభాగాలను ఈ-గవర్నన్స్‌తో అనుసంధానం చేస్తామన్నాయి. ఫిర్యాదు కోసం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్......!! టీఎంసీ తరపున స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజలు నేరుగా తమ ఫిర్యాదులు చేయవచ్చు. ఫోటోను అప్లోడ్ చేసుకోవచ్చు. తమ పరిసరాల్లో గుంతలు, డ్రైనేజీ లైన్లు, ఎక్కడైనా అక్రమంగా కట్టడాలు జరిగితే వాటి ఫొటోలను తీసి అప్లికేషన్లో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. సకాలంలో ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుంది. ఈ అప్లికేషన్ వల్ల ప్రజలు కార్పొరేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. రెండు నెలల్లో దీనిని ప్రారంభిస్తామని కార్పొరేషన్ అధికారులు తెలిపారు.