సత్య ప్రమాణాల స్వామికే శఠగోపం.. | TDP Leaders Took The Shops In The Kanipakam Vinayaka Temple Under The Names Of Benami | Sakshi
Sakshi News home page

సత్య ప్రమాణాల స్వామికే శఠగోపం..

Published Wed, Jul 24 2019 10:08 AM | Last Updated on Wed, Jul 24 2019 10:31 AM

TDP Leaders Took The Shops In The Kanipakam Vinayaka Temple Under The Names Of Benami  - Sakshi

వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం

టీడీపీ నాయకులు సత్య ప్రమాణాల స్వామిగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం వినాయకుడికే శఠగోపం పెట్టారు. గత ఐదేళ్లలో కాణిపాకం దేవస్థానం సము దాయంలో దుకాణాల నిర్వహణకు అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్నారు. రుసుం చెల్లించకుండా చేతులెత్తేశారు. టెండరు పాడుకున్న సమయంలో ఇచ్చిన చిరునామాకు వెళ్లిన అధికారులు.. ఆ పేర్లతో ఎవరూ లేరని చెప్పడంతో వెనుదిరుగుతున్నారు.

సాక్షి, కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఆలయం వద్ద భక్తుల అవసరం మేరకు దుకాణ సముదాయాలను ఏర్పాటుచేసింది. వీటికి ఏడాది, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాలవ్యవధిలో టెండర్ల ద్వారా కేటాయిస్తారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దేవస్థానంలో దుకాణాలు దక్కించుకొని.. టెండరు పలికిన మొత్తం చెల్లించకుండా దేవస్థాన ఖజానాకు భారీగా గండి కొట్టారు. చివరికి రూ.2 కోట్ల రూపాయల మేర అప్పులుగా మిగిల్చారు. వీటిని వసూలు చేసుకునేందుకు దేవస్థాన అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చేసేదిలేక న్యాయస్థానాలకు ఆశ్రయిస్తున్నారు. దేవస్థానం అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం దాదాపు రూ.2 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉంది.

తప్పుడు చిరునామాతో టెండర్లు
కాణిపాకం దేవస్థానం దుకాణ సముదాయాల్లో షాపులను టెండర్లు నిర్వహించి ఏడాది పాటు కేటాయిస్తారు. 6 నెలల క్రితం వరకు మొదట్లో డిపాజిట్‌ కట్టించుకోకుండా కేటాయించేవారు. ప్రతి నెలా అధికారులు దుకాణదారుల వద్దకు వెళితే మొక్కుబడిగా కొంత మొత్తం చెల్లించేవారు. గడువు పూర్తయ్యే సరికి పెద్ద మొత్తంలో బకాయి మిగిలిపోవడంతో అధికారులు ఒత్తిడి చేయకుండా మభ్య పెడుతూ వచ్చారు. గడువు పూర్తయ్యాక ముఖం చాటేస్తున్నారు. వారిచ్చిన చిరునామాకు అధికారులు వసూళ్ల కోసం వెళితే వారు ఇచ్చిన చిరునామా తప్పని తేలుతోంది.

బినామీలకు సహకరిస్తూ లక్షలు వెనకేసుకుంటూ..
బినామీ పేర్లతో దుకాణాలు దక్కించుకున్న టీడీపీ నాయకులు వాటిద్వారా లక్షలు గడించారు. వీరికి ఐదేళ్లుగా ఎలాంటి ఒత్తిడి రాకుండా పరిపాలన కార్యాలయంలోని ఓ కీలక అధికారి కొమ్ము కాసేవాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లక్షలు, కోట్లు బినామీ పేర్లతో ఎగవేతలు వేస్తుంటే దేవదాయ శాఖ, ఆశాఖ అధికారులు ఏంచేస్తున్నారో అర్థం కావడం లేదని వారికి సహకరిస్తూ లక్షలు వెనకేసుకున్న అధికారులు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మేల్కొన్న అధికారులు
ఈ మోసాలను పసిగట్టిన అధికారులు ఆరు నెలల నుంచి టెండర్లు దక్కించుకున్న వారి వద్ద నుంచి ముందుగానే డిపాజిట్‌ వసూలు చేస్తున్నారు.

న్యాయస్థానంలో తేల్చుకుంటాం..
కాణిపాకం దేవస్థానంలో 2014 నుంచి 2019 వరకు టెండరు తాలూకు అప్పులు ఉన్న వారిపై న్యాయస్థానంలో కేసులు వేశాం. ఎక్కువ బాకీ ఉన్న వారి ఆస్తులను జప్తు చేసుకునేందుకు, అప్పులు వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. 2017–19 మధ్య దుకాణ సముదాయాలు తీసుకున్న వారికి నగదు చెల్లింపులు చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చాం. 2014లో కోటి రూపాయలకు పైగా అప్పులు మిగిలాయి. బాధ్యులపై చర్యలు తప్పవు.    
    – పి.పూర్ణచంద్రరావు, కాణిపాకం ఈఓ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement