సాక్షి, ముంబై: ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడగా పేరు గాంచిన ‘ధారావి’ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మొత్తం ఐదు సెక్టార్లు ఉన్నాయి. నాలుగు సెక్టార్లను ప్రైవేటు బిల్డర్లు అభివృద్ధి చేయగా మిగతా ఒక సెక్టార్ పనులు స్వయంగా మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మాడా) చేపట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. ధారావి ప్రాంతాన్ని అత్యధిక శాతం ప్రైవేటు బిల్డర్లు చేపట్టనుండడంతో దీని లబ్ధి ఇక్కడి నివాసులకు లభించనుంది. ఈ ప్రాంతంలో ఉన్న చిన్న, పెద్ద గుడిసె వాసులందరికి కూడా ఒకేరకంగా, ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లు లభిస్తాయి. అదే విధంగా దీని లబ్ధి వీరితోసహా బిల్డర్లు, స్థల యజమానులు, ప్రభుత్వం కూడా పొందనున్నాయి.
బిల్డర్ల ద్వారా వసూలయ్యే ప్రీమియం డబ్బులు ప్రభుత్వ ఖజానాలోకి చేరనున్నాయి. ఇలా దాదాపు రూ.10 వేల కోట్లు ప్రభుత్వ తిజోరిలో జమ కానున్నాయని అంచనవేశారు. ముంబై నగరాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీన్ని ధారావి ప్రాంతం అభివృద్ధితోనే ప్రారంభించాలని నిర్ణయించింది. అందుకు 2004-05లోనే ప్రభుత్వం ధారావి పునరాభివృద్థి ప్రాజెక్టు ప్రకటించింది. కాని దీనిపై అనేక వివాదాలు, రాజకీయాలు మొదలయ్యాయి. అనేక పర్యాయాలు అధ్యయనం జరిగింది. ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అనేకసార్లు టెండర్లను ఆహ్వానించి రద్దు కూడా చేశారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుతం ధారావి ప్రాంతం మొత్తం 240 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ వెలసిన 65-70 వేల గుడిసెల స్థానంలో సరాసరి 300 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టిస్తారు.
ఇళ్లతోపాటు ఇక్కడ చిన్నచిన్న పరిశ్రమలు, గార్మెంట్, వస్త్ర, జరి, నగల తయారీ తదితర పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికి సరాసరి 225 చదరపు అడుగుల గాలాలు దొరుకుతాయి. గోదాములున్నవారికి నియమ, నిబంధనల ప్రకారం నిర్మించి అందజేస్తారు. ఐదో సెక్టార్‌లో మాడా చేపట్టే అభివృద్ధి పనులను మార్గదర్శకంగా తీసుకుని మిగతా నాలుగు సెక్టార్ల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. దీనికి ప్రజల నుంచి మాకు సమ్మతమేనని హామీ తీసుకున్నారు. ఈ సెక్టార్ పనులు పూర్తికాగానే ఒకటి నుంచి నాలుగో సెక్టార్ వరకు ప్రైవేటు బిల్డర్ల ద్వారా జరగనున్నాయి. ఇక్కడ అత్యధిక స్థలం ప్రైవేటు యజమానులదే . ఈ ప్రాజెక్టులో స్థల యజమానులకు కూడా అత్యధికంగా లాభం పొందనున్నారు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌కు ఈ ప్రాజెక్టు అనుకుని ఉంది. దీంతో పనులు పూర్తయితే ఇక్కడి ఇళ్లకు బంగారం కంటే ఎక్కువ ధర పలకనుంది.
ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
ముంబై: వివిధ కారణాల వల్ల అనేక ప్రాజెక్టులు ఆలస్యం అవుతుండటంపై ఆందోళన చెందుతున్న రాష్ట్ర సర్కార్ అవి కాలానుగుణంగా పూర్తయ్యేలా వివాదాల పరిష్కార విభాగాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. ప్రారంభ దశలోనే కొన్ని ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నుంచి సమస్యలు రావడంతో మళ్లీ మొదటి నుంచి టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తోంది. దీంతో ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమవుతున్నాయని నగరంలో సోమవారం జరిగిన మహా ఇన్‌ఫ్రా సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు త్వరితగతిన పనులు పూర్తయ్యేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వివిధ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
మహారాష్ట్ర స్టేట్ రోడ్డు అభివృద్ధి సంస్థ తొలిసారిగా బిడ్ నిర్వహించిన 2004 నుంచి 22 కిలోమీటర్ల రూ.9,630 కోట్ల ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ (ఎంటీహెచ్‌ఎల్) ప్రాజెక్ట్‌కు ఐదుసార్లు టెండర్‌లు నిర్వహించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా రవాణా, విద్యుత్ రంగాల్లోనే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని సీఎం అన్నారు. కాగా, కార్పొరేషన్ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఎంటీహెచ్‌ఎల్ ప్రాజెక్ట్ అమలును ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)కి కట్టబెట్టారు. అయితే ఆగస్టు ఐదున నిర్వహించిన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు ఏ ఒక్కరూ బిడ్ దాఖలు చేయలేదు. దీనికితోడు వివిధ సమస్యల వల్ల వర్లి-హజీ అలీ సిలింక్, మెట్రో లైన్ టూ, త్రీ, నవీముంబై ఎయిర్‌పోర్టు పనులు కూడా ముందుకు కదలడం లేదు. రూ.5,100 కోట్ల వ్యయమయ్యే వర్లి, హజీ సీలింక్ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్న ఎంఎస్‌ఆర్‌డీసీ ప్రస్తుతమున్న బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) పద్ధతిని ఎత్తేయనుంది.
సొంతంగానే ‘సీ లింక్’ ప్రాజెక్టు!
సాక్షి, ముంబై: ప్రతిపాదిత ‘శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు’కు ఇటీవల చేపట్టిన టెండర్ల ప్రక్రియకు వివిధ కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ప్రత్యామ్నాయ వేటలో పడింది. అందుకు జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రినివల్ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) ద్వారా నిధులు సేకరించి, మిగిలిన నిధులను తానే సమకూర్చుకుని ప్రాజెక్టును చేపట్టాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు సాగాలంటే జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ మిషన్ ద్వారా దాదాపు రూ.ఐదు వేల కోట్ల నిధులు లభించనున్నాయి. మిగతా రూ.ఐదు వేల కోట్లు ఎమ్మెమ్మార్డీయే స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సీ లింకు మీదుగా రాకపోకలు సాగించే వాహనాలపై టోల్ భారం కొంత మేర తగ్గనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఆహ్వనించిన టెండర్ల ప్రక్రియకు గడువు ఈ నెల ఐదో తేదీన ముగిసింది. అయితే గతంలో ఆసక్తి కనబర్చిన బడా కంపెనీల్లో ఒక్క సంస్థ కూడా ఇప్పుడు టెండరు వేయలేదనే సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూ.పి.ఎస్.మదన్ స్పష్టం చేశారు. దాదాపు రూ.9,630 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు మొత్తం 22 కి.మీ. పొడవు ఉంటుంది. ఇందులో 16.5 కి.మీ. మార్గం సముద్రంపై ఉండగా మిగతాది చిర్లే ప్రాంతం వరకు నేలపై ఉంది.
ప్రారంభంలో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఐఆర్బీ ఇన్‌ఫ్రా, హూండాయ్, సింట్రా-సోమా, గెమన్ ఇన్‌ఫ్రా- ఓహెచ్‌ఎల్, జీఎంఆర్-ఎల్ అండ్ టీ-స్యామ్‌సన్, ది టాటా రియాల్టీ-ఆటో స్ట్రెడ్ ఇండియన్ ఇన్‌ఫ్రా-విన్సి ఇలా ఆరు సంస్థలు ఆసక్తి కనబరిచాయి. కాని ఇందులో ఏ ఒక్క కంపెనీ కూడా టెండరు వేయలేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల ఈ కంపెనీలు టెండర్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినప్పటికీ ఫలితం లభించలేదు. తాజాగా గత సోమవారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా నిధులు రాబట్టుకోవాలని ఎమ్మెమ్మార్టీయే యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.9,630 కోట్ల నిధుల్లో 50 శాతం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా లభిస్తే మిగత నిధులు ఎమ్మెమ్మార్డీయే సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాదు. నగర రహదారులపై విపరీతంగా పడుతున్న వాహనాల భారాన్ని తగ్గించేందుకు శివ్డీ-నవశేవా సీ లింకు ప్రాజెక్టు తెరమీదకు వచ్చింది. అంతేకాక భవిష్యత్తులో నవీముంబైలో చేపట్టనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఎంతో దోహదపడనుంది. అయితే విమానాశ్రయ నిర్మాణం కార్యరూపం దాల్చకపోతే ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య తగ్గిపోయి టోల్ డబ్బులు రావనే ఉద్దేశంతోనే వివిధ సంస్థలు టెండర్లకు దూరంగా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం సాయంతో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలనే సంకల్పంతో ఎమ్మెమ్మార్డీయే ముందడుగు వేస్తోంది.
‘ధారావి’కి మహర్దశ
Published Mon, Aug 12 2013 11:32 PM | Last Updated on Mon, Oct 8 2018 5:59 PM
Advertisement