ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబై ధారావి గురించి చాలా మంది వినే ఉంటారు. 640 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధారవి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అదానీ గ్రూప్ దక్కించుకుంది.
గౌతమ్ అదానీ ద్వారా నియమించిన ఒక కంపెనీ రీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫిబ్రవరి నుంచి ముంబైలోని ధారవి స్లమ్‌లోని 10 లక్షల మంది నివాసితుల డేటా, బయోమెట్రిక్‌లను సేకరించడం ప్రారంభిస్తుంది. పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉచిత గృహాలను పొందేందుకు ధారావి నివాసితుల అర్హతను నిర్ణయించడంలో ఈ సర్వే కీలకం.
వీరే అర్హులు
ధారావిలో చివరి సారిగా 15 సంవత్సరాల క్రితం ఓ సర్వే నిర్వహించారు. ధారావిలో 2000 సంవత్సరానికి ముందు నుంచి నివసిస్తున్నవారు మాత్రమే ఉచిత గృహానికి అర్హులు. ఈ సర్వే ఆధారంగా దాదాపు 7 లక్షల మంది పునరాస ప్రయోజనానికి అర్హత కోల్పోయి రోడ్డున పడతారని ఇక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అదానీ నేతృత్వంలోని సంస్థ ధారవి నివాసితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లి పక్కాగా సర్వేను నిర్వహించనుంది.
సర్వే బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ డేటా సేకరిస్తాయని ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్న ధారావి రీడెవలప్‌మెంట్ అథారిటీ అధిపతి ఎస్‌వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు రావాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ప్రయోజనం పొందకూడదని ఆయన పేర్కొన్నారు.
9 నెలల్లో సర్వే పూర్తి
ధారావిలో నివాసితుల సర్వే రెండు దశల్లో జరగనుంది. మొదటగా మూడు నుంచి నాలుగు వారాల్లో కొన్ని వందల మంది నివాసితులతో సర్వే పైలట్ దశ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూర్తి సర్వే తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉచిత గృహాలు లేదా పునరావాసం కోసం నివాసితుల తుది అర్హతను ధారావి రీడెవలప్‌మెంట్ అథారిటీ నిర్ణయిస్తుంది. సర్వేతోపాటు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణకు త్వరలో అదనపు సిబ్బందిని నియమిస్తామని శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment