సొంతిళ్లు అనేది సామాన్యుడి కళ. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏ పని చేస్తున్నా ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతారు. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల అవసరాలు హెచ్చవుతున్నాయి. అందుకు అనువుగా రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి నిర్మాణాన్ని పెంచుతున్నాయి. మారుతున్న జీవనప్రమాణాల వల్ల అధికశాతం జనాభా ఇప్పటికే ఇళ్లు ఉన్నా అన్ని సౌకర్యాలు కలిగిన మరో ఇంటికి మారాలని చూస్తున్నారు. దాంతో ఇళ్ల నిర్మాణానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. 2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని క్రెడాయ్-లియాసెస్ ఫోరాస్ నివేదిక అంచనా వేసింది. మంగళవారం వారణాసిలో జరిగిన న్యూ ఇండియా సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు.
ఈ నివేదిక ప్రకారం..2018 నాటికే జనాభా అవసరాలకు తగిన ఇళ్ల నిర్మాణం జరగలేదు. అప్పటికే 2.9 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల గృహాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. స్థిరాస్తి రంగంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి అధికంగా ఉండనుంది. 2023లో ఇళ్లకు అధిక గిరాకీ ఏర్పడిందని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా రెరా వద్ద 19,050కి పైగా ప్రాజెక్టులు నమోదయ్యాయని, ఇందులో 45 శాతానికి పైగా నివాస ప్రాజెక్టులున్నాయని వెల్లడించింది.
ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లకు గిరాకీ, సరఫరా వృద్ధి చెందుతోందన్నారు. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పెద్ద గృహాలకు డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: 2030 నాటికి రూ.8 లక్షలకోట్ల ఎగుమతులు..?
క్రెడాయ్ ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. గత ఏడాది స్థిరాస్తి రంగానికి సానుకూలంగా ఉందని చెప్పారు. 2024లోనూ ఈ రంగంలో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లియాసెస్ ఫోరాస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరే క్రమంలో స్థిరాస్తి రంగం పాత్ర ఎంతో కీలకమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment