ఉండటానికి సొంతిల్లు ఉన్నా స్థిరమైన అద్దె ఆదాయం కోసం మరో ఇల్లు కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. గతంలో బెంగళూరు నగరంలో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ పెరిగింది. హైటెక్‌సిటీ వంటి కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ భవనాల స్థాయిలో గృహాలకు అద్దెలు వస్తుండటంతో రెండో ఇల్లు వైపు మొగ్గుచూపుతున్నారు.
నగరంలో వివిధ కారణాలతో కొద్దినెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదించింది. గృహ రుణ వడ్డీరేట్లు పెరగడం, మార్కెట్లో నగదు లభ్యత లేకపోవడం, ప్రవాస భారతీయుల పెట్టుబడులు తగ్గడం, ఎన్నికల సంవత్సరం, మార్కెట్లో సరఫరా పెరగడం వంటి కారణాలతో రియల్‌ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉంది. ఇలాంటి దశలోనూ అద్దె ఆవాసాలకు మాత్రం డిమాండ్ కొనసాగుతూనే ఉందని ఈ రంగంలోని సంస్థలు చెబుతున్నాయి.
ఐటీ కారిడార్‌గా ఉన్న మాదాపూర్‌లో రెండు పడక గదుల ఇంటి అద్దె సగటు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. కమ్యూనిటీ, అక్కడి సౌకర్యాలను బట్టి రూ.2లక్షల వరకు కూడా అద్దెలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య రెంట్లు ఉన్నాయి.
స్థలానికి ప్రత్యామ్నాయంగా..
సొంతిల్లు ఉంటే భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా భావించి గతంలో స్థలాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, విల్లాల సంస్కృతి మొదలయ్యాక వీటిలో అద్దెలు బాగా వస్తుండటంతో స్థలానికి ప్రత్యామ్నాయంగా రెండో ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయ పన్ను ప్రయోజనాలు సైతం ఉండటంతో పన్ను భారం తగ్గించుకునేందుకు కొనేవారు ఉన్నారు. నెలనెలా ఆదాయం కోసం కూడా వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు.
దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో చూస్తే అద్దెల రాబడి తక్కువలో తక్కువ 2.35 శాతం నుంచి గరిష్ఠంగా 4.03 శాతం వరకు ఉంటోంది. ఇల్లు కొనేందుకు పెట్టుబడి పెట్టిన మొత్తం, వార్షికంగా వచ్చిన అద్దెను పరిగణనలోకి తీసుకుని రాబడి లెక్కిస్తున్నారు. అంటే ఉదాహరణకు రూ.10 లక్షలతో ఇల్లు కొంటే వార్షికంగా 4 శాతం రూ.40 వేలు అద్దె వస్తుందని లెక్కకడుతున్నారు. దీనికి అదనంగా ఇంటి విలువ పెరగడం కలిసొచ్చే అంశం.
ఇదీ చదవండి: చలిలో విద్యుత్ వాహనాలు.. ఇవి పాటించాల్సిందే..
ఎప్పటి నుంచో ఉన్నదే..
అద్దె రాబడి కోసం వ్యక్తిగత ఇళ్లల్లో ప్రత్యేకంగా పోర్షన్లు నిర్మించడం సిటీలో ఎప్పటినుంచో ఉన్నదే. ఇందుకోసం జీ+2, 3, 4 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఒక అంతస్తులో పూర్తిగా యజమానులు ఉంటూ.. మిగతా అంతస్తుల్లో ఒక పడక, రెండు పడక గదులను అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారు. అద్దెల మీద వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు సిటీలో ఎందరో ఉన్నారు. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్లను అద్దె రాబడి కోసం ఇటీవల ఎక్కువ మంది కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment