మానవుల జీవనప్రమాణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టు నివసించేందుకు ఇళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్నేళ్ల నుంచి రెండు పడక గదుల ఇల్లు ఉంటే చాలు అనుకునేవారు. దాంతో నిర్మాణ సంస్థలూ వాటినే పెద్ద మొత్తంలో నిర్మించేవి. ఇప్పుడు మాత్రం ధర అధికమైనా సరే మూడు పడక గదుల ఇల్లు, విశాలమైన వరండా లాంటివి ఉండే ఇళ్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు తీరుపై 2023 జులై-డిసెంబరు మధ్య ఫిక్కీ-అనరాక్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇళ్ల కొనుగోలుదారుల్లో సగానికి పైగా 3 బీహెచ్‌కే (మూడు పడక గదులు, హాలు, వంటగది) ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు 38% మంది మొగ్గు చూపించారు. ఏడాది క్రితం 3బీహెచ్‌కే ఇల్లు/ఫ్లాట్ కొనుగోలుకు 42% మందే ఆసక్తి చూపించడం గమనార్హం. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటే ముంబయిలో మాత్రం 44% మంది కొనుగోలుదారులు ఇప్పటికీ 2బీహెచ్‌కే వైపే చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 1బీహెచ్‌కే ఇళ్లపై ఆసక్తి తగ్గినా, ముంబయి, పుణెలో వీటికి గిరాకీ ఉందని తెలిసింది.
పెరిగిన సగటు విస్తీర్ణం
పెద్ద ఇళ్లకు గిరాకీ పెరుగుతుండటంతో, వాటి నిర్మాణాలూ అధికంగానే ఉంటున్నాయని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సగటు ఫ్లాటు విస్తీర్ణం 11% పెరిగిందన్నారు. 2022లో సగటు ఫ్లాటు విస్తీర్ణం 1,175 చదరపు అడుగులు ఉండగా, 2023లో 1,300 అడుగులకు చేరుకుందన్నారు.
ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్..
భారీగా అమ్మకాలు..
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2022తో పోలిస్తే గత ఏడాది ఇళ్ల విక్రయాల్లో 31% వృద్ధి కనిపించింది. మొత్తం 4.77 లక్షల ఇళ్లు 2023లో అమ్ముడయ్యాయి. కొత్తగా 4.46 లక్షల ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణాన్ని డెవలపర్లు ప్రారంభించారు. ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా రూ.45-90 లక్షల ఇల్లు/ఫ్లాట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరికొందరు రూ.90లక్షల నుంచి రూ.1.5 కోట్ల విలువైన ఇళ్లను కొనాలనే ఆసక్తితో ఉన్నారని సర్వే వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment