నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో రెండు పడక గదుల ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కోటి రూపాయలు ఉండాల్సిందే. ప్రస్తుతం నగరంలో సగటు చదరపు అడుగు ధర సుమారు రూ.5 వేలు పలుకుతోంది. ఇది బేస్ ధర మాత్రమే. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకల గదికి రూ.70 లక్షల వరకు అవుతుంది. కారు పార్కింగ్, క్లబ్ హౌస్ సభ్యత్వం, గ్యాస్, ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వంటి మౌలిక వసతుల కోసం మరో పది లక్షల వరకు తీసుకుంటున్నారు. 5 శాతం జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు కలిపి మరో 10 లక్షల వరకు అవుతున్నాయి. ఇంటీరియర్ కోసం మరో రూ.పది లక్షల వరకు ఖర్చవుతోంది. రూ.కోటి పెడితే రెండు పడకల ఫ్లాట్ మాత్రమే వస్తోంది.
మరింత విశాలంగా మూడు పడకల గది కావాలన్నా.. పై అంతస్తుల్లో ఉండాలంటే ఫ్లోర్ రైజ్ ఛార్జీలు, తూర్పు, ఉత్తరం వైపు ఫ్లాట్ కావాలన్నా... చెరువు వైపు, గార్డెన్ వైపు ఉన్న బాల్కనీ కావాలన్నా అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. వీటితో పాటూ మూడు పడకల ఫ్లాట్ కావాలంటే కోటిన్నర అవుతోంది. ఇదంతా ఐటీ కారిడార్ బయటనే. ఐటీ కారిడార్‌లో అయితే రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగానే జనవరిలో కోటి అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. వెయ్యి నుంచి రెండువేల లోపు విస్తీర్ణం కలిగిన వాటి రిజిస్ట్రేషన్లు 71 శాతం జరిగాయి.
కొందరు బిల్డర్లు సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల లోపల ఉండే రెండు పడకల గదుల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. అఫర్డబుల్ హౌసింగ్ కింద వీటిని పరిగణిస్తారు. జీఎస్‌టీ 1 శాతమే ఉంటుంది. ఈ తరహా ఇళ్లు రూ.50 లక్షల ధరల్లో వస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ విస్తీర్ణంలో కట్టడం లేదు. 2023 జనవరిలో వీటి రిజిస్ట్రేషన్లు 17 శాతం జరగ్గా.. ఈ ఏడాది జనవరిలో 14 శాతానికి పడిపోయాయి.
ఇదీ చదవండి: అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment