reality projects
-
నివాసానికి ఒకటి.. అద్దెకు మరొకటి..!
ఉండటానికి సొంతిల్లు ఉన్నా స్థిరమైన అద్దె ఆదాయం కోసం మరో ఇల్లు కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. గతంలో బెంగళూరు నగరంలో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ పెరిగింది. హైటెక్‌సిటీ వంటి కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ భవనాల స్థాయిలో గృహాలకు అద్దెలు వస్తుండటంతో రెండో ఇల్లు వైపు మొగ్గుచూపుతున్నారు. నగరంలో వివిధ కారణాలతో కొద్దినెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదించింది. గృహ రుణ వడ్డీరేట్లు పెరగడం, మార్కెట్లో నగదు లభ్యత లేకపోవడం, ప్రవాస భారతీయుల పెట్టుబడులు తగ్గడం, ఎన్నికల సంవత్సరం, మార్కెట్లో సరఫరా పెరగడం వంటి కారణాలతో రియల్ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉంది. ఇలాంటి దశలోనూ అద్దె ఆవాసాలకు మాత్రం డిమాండ్ కొనసాగుతూనే ఉందని ఈ రంగంలోని సంస్థలు చెబుతున్నాయి. ఐటీ కారిడార్‌గా ఉన్న మాదాపూర్‌లో రెండు పడక గదుల ఇంటి అద్దె సగటు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. కమ్యూనిటీ, అక్కడి సౌకర్యాలను బట్టి రూ.2లక్షల వరకు కూడా అద్దెలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య రెంట్లు ఉన్నాయి. స్థలానికి ప్రత్యామ్నాయంగా.. సొంతిల్లు ఉంటే భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా భావించి గతంలో స్థలాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, విల్లాల సంస్కృతి మొదలయ్యాక వీటిలో అద్దెలు బాగా వస్తుండటంతో స్థలానికి ప్రత్యామ్నాయంగా రెండో ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయ పన్ను ప్రయోజనాలు సైతం ఉండటంతో పన్ను భారం తగ్గించుకునేందుకు కొనేవారు ఉన్నారు. నెలనెలా ఆదాయం కోసం కూడా వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో చూస్తే అద్దెల రాబడి తక్కువలో తక్కువ 2.35 శాతం నుంచి గరిష్ఠంగా 4.03 శాతం వరకు ఉంటోంది. ఇల్లు కొనేందుకు పెట్టుబడి పెట్టిన మొత్తం, వార్షికంగా వచ్చిన అద్దెను పరిగణనలోకి తీసుకుని రాబడి లెక్కిస్తున్నారు. అంటే ఉదాహరణకు రూ.10 లక్షలతో ఇల్లు కొంటే వార్షికంగా 4 శాతం రూ.40 వేలు అద్దె వస్తుందని లెక్కకడుతున్నారు. దీనికి అదనంగా ఇంటి విలువ పెరగడం కలిసొచ్చే అంశం. ఇదీ చదవండి: చలిలో విద్యుత్ వాహనాలు.. ఇవి పాటించాల్సిందే.. ఎప్పటి నుంచో ఉన్నదే.. అద్దె రాబడి కోసం వ్యక్తిగత ఇళ్లల్లో ప్రత్యేకంగా పోర్షన్లు నిర్మించడం సిటీలో ఎప్పటినుంచో ఉన్నదే. ఇందుకోసం జీ+2, 3, 4 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఒక అంతస్తులో పూర్తిగా యజమానులు ఉంటూ.. మిగతా అంతస్తుల్లో ఒక పడక, రెండు పడక గదులను అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారు. అద్దెల మీద వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు సిటీలో ఎందరో ఉన్నారు. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్లను అద్దె రాబడి కోసం ఇటీవల ఎక్కువ మంది కొంటున్నారు. -
మహీంద్రా లైఫ్‌స్పేస్, యాక్టిస్ జోడీ
న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ యాక్టిస్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేసింది. రూ.2,200 కోట్ల ముందస్తు పెట్టుబడితో దేశవ్యాప్తంగా ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ కేంద్రాలను ఇరు సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తాయి. ఈ స్పెషల్ పర్పస్ వెహికిల్స్‌లో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్‌కు 26–40 శాతం వాటా, మిగిలినది యాక్టిస్, అనుబంధ కంపెనీలు సొంతం చేసుకుంటాయి. మహీంద్రా వరల్డ్ సిటీస్‌లో 100 ఎకరాల వరకు ఇందుకోసం కేటాయిస్తారు. కొత్త కేంద్రాల స్థాపనతోపాటు ఇప్పటికే ఉన్న ఫెసిలిటీలను కొనుగోలు చేయాలని భాగస్వామ్య సంస్థలు నిర్ణయించాయి. బహుళజాతి, భారతీయ క్లయింట్ల నుండి గ్రేడ్–ఏ గిడ్డంగులు, తయారీ సౌకర్యాల కోసం బలమైన, వేగవంతమైన డిమాండ్‌ను చూస్తున్నామని మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ ఎండీ అరవింద్ సుబ్రమణియన్ ఈ సందర్భంగా తెలిపారు. చెన్నై, జైపూర్‌లో ఇటువంటి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. -
కర్బనరహితంగా మ్యాక్రోటెక్!
న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ మ్యాక్రోటెక్ డెవలపర్స్ రానున్న 5–7ఏళ్లలో 50 కోట్ల డాలర్లు(రూ. 3,950 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. సస్టెయినబిలిటీ చర్యల్లో భాగంగా అన్ని ప్రాజెక్టులపైనా నిధులను వెచ్చించనున్నట్లు లోధా బ్రాండుతో రియల్టీ ఆస్తులను విక్రయించే కంపెనీ తెలియజేసింది. తద్వారా 2035కల్లా కర్బనరహిత కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించింది. నవీ ముంబై దగ్గర్లోని పాలవ సిటీ సమీకృత టౌన్షిప్ ప్రాజెక్టుకు ఆర్ఎంఐ నుంచి సాంకేతిక మద్దతును తీసుకుంటున్నట్లు పేర్కొంది. 4,500 ఎకరాలలలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును‘ లోధా నెట్ జీరో అర్బన్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్’కింద ప్రకటించింది -
ఇళ్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బెంగళూరు, ముంబై, పుణే, హైదరాబాద్ తదితర నగరాల్లో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ (ఇండ్–రా) తెలిపింది. కస్టమర్ల నుంచి డిమాండ్ రావడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ‘ప్రస్తుతం గృహాల అమ్మకాలు దూసుకెళ్లడం, పెరిగిన డిమాండ్ తుది వినియోగదారు ఆధారితమైంది. ఊహాజనితమైనది కాదు. అందువల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 6 శాతం అధికం అయ్యాయి. దీర్ఘకాలిక క్షీణత తర్వాత గత కొన్ని సంవత్సరాలలో ధరలు స్థిరంగా ఉన్నాయి. 2022–23లో గృహాల విక్రయాలు 12 శాతం దూసుకెళ్తాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం అమ్మకాల్లో అందుబాటు ధర గృహాల వాటా 50 శాతం ఉంటుంది’ అని ఇండ్–రా వివరించింది. -
ప్రభావం చూపని ఒమిక్రాన్, వృద్ధి సాధించనున్న హౌసింగ్ ఫైనాన్స్
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ రుణ ఫోర్ట్‌ఫోలియో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 9 నుంచి 11 శాతం ఉంటుందన్నదని ఇక్రా అంచనా. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 మొదటి త్రైమాసికంలో (2020 ఏప్రిల్–జూన్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ) రుణ పంపిణీలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం పడింది. అయితే రెండవ త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) చక్కటి రికవరీ చోటుచేసుకుంది. 2021–22 మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలాన్ని పరిశీలిస్తే, వాటి ఆన్ బుక్ పోర్ట్‌ఫోలియో 9 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ►ఇదే ధోరణి ఆర్థిక సంవత్సరం మొత్తంలో కనబడుతుందని భావిస్తున్నాం. దేశంలో వ్యాక్సినేషన్ విస్తృతి, ఎకానమీ క్రియాశీలత మెరుగ్గా ఉండడం, పరిశ్రమ డిమాండ్ మెరుగుపడ్డం, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యవస్థలో అనుకున్నంత ఆందోళనలు సృష్టించకపోవడం వంటి అంశాలు దీనికి కారణం. ►ఈ విభాగంలో మొండిబకాయిలు సైతం మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికం నుంచి గణనీయంగా మెరుగుపడ్డం ప్రారంభమైంది. వసూళ్ల సామర్థ్యం (సీఈ) బలపడింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మెరుగుపడ్డాయి. ►హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో రుణ పునర్వ్యవస్థీకరణల డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి పునర్వ్యవస్థీకరణ డిమాండ్ మొత్తం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 1.1 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ 30 నాటికి 2.3 శాతానికి పెరిగింది. అయితే 2022 మార్చి 31వ తేదీ నాటికి ఈ శాతం స్వల్పంగా 2 నుంచి 2.1 శాతం శ్రేణికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. రికవరీలు బాగుండడం, డిఫాల్ట్‌లు తగ్గడం వంటి అంశాలు దీనికి కారణం. ► ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లాభదాయకత 2020–21 ఆర్థిక సంవత్సరం తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి భారీ పెరుగుదలా లేకుండా మామూలుగా కొనసాగే అవకాశం ఉంది. నిధుల సమీకరణ వ్యయాలు పెరగడం దీనికి కారణం. అయితే 2022–23లో లాభదాయకత కోవిడ్–19 ముందస్తు స్థాయికి వేరే అవకాశం ఉంది. -
దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్ సేల్స్
సామాన్యుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనే కోరిక రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రముఖ ప్రాపర్టీ సంస్థ అనరాక్ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం గతేడాది మనదేశానికి చెందిన 7 ప్రధాన నగరాల్లో 71 శాతం ఇళ్ల అమ్మకాలు జరగ్గా..మొత్తం 2,36,530 యూనిట్ల ఇళ్ల సేల్స్ జరిగాయని తెలిపింది. 2019లో 2,61,358 యూనిట్లు, 2020లో 1,38,350 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు అనరాక్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. పండగ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది అనరాక్ డేటా ప్రకారం..ఫెస్టివల్ సీజన్, పలు బ్యాంకులు హోమ్లోన్లపై వడ్డీరేట్లు తగ్గిస్తూ భారీ ఆఫర్లు ప్రకటించాయి. అప్పటికే సొంతింటి కోసం దాచుకున్న డబ్బులు, బ్యాంకులు హోమ్లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించడంతో.. ఔత్సాహికులు భారీ ఎత్తున ఇళ్లను కొనుగోలు చేశారు. దీంతో నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 2020 కంటే 2021లో 39శాతం ఇళ్లు భారీ ఎత్తున అమ్ముడయ్యాయి. అనరాక్ వార్షిక డేటా ►అనరాక్ వార్షిక డేటా ప్రకారం..ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 2021లో 72 శాతం పెరిగి 76,400 యూనిట్లకు చేరాయి,అంతకుముందు సంవత్సరంలో 44,320 యూనిట్లు ఉన్నాయి. ►హైదరాబాద్‌లో విక్రయాలు 2020లో 8,560 యూనిట్ల నుంచి దాదాపు 3రెట్లు పెరిగి 25,410 యూనిట్లకు చేరుకున్నాయి. ►ఢిల్లీ-ఎన్సీఆర్లో అమ్మకాలు 2020లో 23,210 యూనిట్ల నుండి 2021లో 73శాతం పెరిగి 40,050 యూనిట్లకు చేరుకున్నాయి. ►పుణేలో ఇళ్ల అమ్మకాలు 2020లో 23,460 యూనిట్ల నుండి 2021లో 53శాతం పెరిగి 35,980 యూనిట్లకు పెరిగాయి. ►బెంగళూరులో 2020లో 24,910 యూనిట్ల నుండి 2021లో 33,080 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి. ►చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 2020లో 6,740 యూనిట్ల నుంచి 2021లో 86శాతం పెరిగి 12,530 యూనిట్లకు చేరుకున్నాయి. ►కోల్‌కతాలో 2020లో 7,150 యూనిట్ల నుంచి 2021లో 13,080 యూనిట్లకు పెరిగాయి. ఈ సందర్భంగా అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ..2022లో ఇళ్ల అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇన్పుట్ కాస్ట్ ప్రెజర్,సప్లై చైన్ సమస్యలు ప్రాపర్టీ ధరలు 5-8 శాతం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: హాట్ కేకుల్లా..! హైదరాబాద్‌లో ఎక్కువగా ఇళ్లు అమ్ముడవుతున్న ప్రాంతాలివే! -
రియల్టీలోకి 10,100 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు హైదరాబాద్ అభివృద్ధికి చోదకశక్తిగా మారింది. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2019 తొలి ఆర్ధ సంవత్సరం వరకూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 10,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2008–14 మధ్యకాలంలో ఇది రూ.1,800 కోట్లుగా ఉందని జోన్స్ లాంగ్ లాసెల్లె (జేఎల్ఎల్) తెలిపింది. ఇందులోనూ 70 శాతం పెట్టుబడులు కార్యాలయాల విభాగమే ఆకర్షించిందని పేర్కొంది. బుధవారమిక్కడ జేఎల్ఎల్ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌లతో పాటూ జేఎల్ఎల్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్, హైదరాబాద్ ఎండీ సందీప్ పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ నాయర్ మాట్లాడుతూ.. బలమైన ఆర్థిక వృద్ధి, మౌలిక రంగం, ప్రపంచ స్థాయి కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహకాలు తదితరాల వల్ల ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల మీద సానుకూల ప్రభావంచూపిస్తుందని తెలిపారు. కో–వర్కింగ్ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐ, ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల విస్తరణ హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్య కారణమని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్ట్‌ల్లో తగ్గుముఖం ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం నాటికి నగరంలో 13.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 50–60శాతం స్పేస్ అప్పటికే ఆక్యుపై అయిందని నివేదిక తెలిపింది. నివాస విభాగంలో కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభాలు తగ్గుముఖం పట్టాయి. పుప్పాలగూడ, గోపనపల్లి, మణికొండ, నార్సింగి, నల్లగండ్ల ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. 40% ప్రాజెక్ట్‌లు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్నాయి. ఈ ఏడాది క్యూ1లో ధరల్లో 6% వృద్ధి నమోదైంది -
రెరాలో నమోదు కాలేదా? రూ.50 వేలు జరిమానా!
తెలంగాణలోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఏజెంట్లూ! మీరు ఇంకా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో తమ పేర్లను, ప్రాజెక్ట్‌లను నమోదు చేయలేదా? అయితే రూ.50 వేలు జరిమానా చెల్లించాల్సిందే. పెనాల్టీ కట్టి వచ్చే వారం రోజుల్లోగా నమోదు చేసుకోకపోతే మొదటి వారం రూ.లక్ష, ఆ తర్వాతి వారం రూ.2 లక్షలు ఫైన్ తప్పదు. అప్పటికీ రిజిస్టర్ కాకపోతే ఏకంగా ప్రాపర్టీ సీజ్! సాక్షి, హైదరాబాద్: కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టం–2016ను అమల్లోకి తీసుకొచ్చిన ఏడాది తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2017లో రెరాను నోటీఫై చేసింది. 2017, జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీఎస్ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్ట్ టీ– రెరాలో నమోదు చేసుకోవాలన్న విషయం తెలిసిందే. నమోదు గడువును 2018 నవంబర్ 30 వరకు విధించింది. రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్ట్ ప్రమోటర్లపై రెరా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు టీ–రెరా అధికారులు సిద్ధమయ్యారు. 1,200 ప్రాజెక్ట్‌ల నమోదు.. గతేడాది జనవరి 1 తర్వాత ఆయా విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లు అనుమతి పొందాయి. కానీ, ఇప్పటివరకు టీ–రెరాలో వెయ్యి మంది ప్రమోటర్లు, వెయ్యి మంది ఏజెంట్లు నమోదయ్యారని.. సుమారు 1,200 ప్రాజెక్ట్‌ల వరకు రిజిస్టరయ్యాయని టీ–రెరా అధికారి ఒకరు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మినహా ఇతర ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ప్రమోటర్లు, ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయని ఇవి సుమారు 200 ప్రాజెక్ట్‌ల వరకుంటాయని చెప్పారు. నేటి నుంచి జరిమానాలు షురూ.. టీ–రెరా రికార్డుల ప్రకారం తెలంగాణలో ఇంకా 2,000–2,500 ప్రాజెక్ట్‌లు నమోదు కావాల్సి ఉందని సమాచారం. నేటి నుంచి ఆయా ప్రాజెక్ట్ ప్రమోటర్లకు రూ.50 వేల జరిమానా విధించనున్నామని టీ–రెరా అధికారి ఒకరు ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. వారం రోజుల్లోగా నమోదు కాకపోతే జరిమానాల మొత్తాలను పెంచుతామని, అయితే అది ఎంతనేది ఈనెల 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అప్పటికీ ముందుకొచ్చి రెరాలో రిజిస్టర్ కాకపోతే ప్రాజెక్ట్ సైట్లను టీ–రెరా బృందం ప్రత్యక్షంగా తనిఖీ చేసి రెవిన్యూ చట్టం కింద ప్రాపర్టీలను సీజ్ చేస్తామని చెప్పారాయన. 2019 మార్చి 31 వరకూ పొడిగించాలి టీ–రెరా ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు, ఏజెంట్ల నమోదు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) కోరింది. ఈ మేరకు పురపాలక నిర్వహణ మరియు పట్టణ అభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రంలో డెవలపర్లకు రెరా చట్టం గురించి పూర్తి స్థాయిలో అవగాహన రాలేదని.. నమోదు ప్రక్రియలో డెవలపర్లకు సహాయం చేసేందుకు కూడా కన్సల్టెంట్లు పెద్దగా లేరని అందుకే నమోదు గడువును పొడిగించాలని టీబీఎఫ్ ప్రెసిడెంట్ సీ ప్రభాకర్ రావు తెలిపారు. త్వరలోనే 20 మంది డెవలపర్లపై చర్యలు టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రాజెక్ట్‌లను అడ్వర్టయిజింగ్ చేసిన 40 మంది డెవలపర్లకు ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. నవంబర్ 20 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. వీరిలో కొంత మంది డెవలపర్లు అడ్వర్టయిజింగ్ చేసిన ప్రాజెక్ట్‌లలో కొన్ని 2015, 2016లో అనుమతి తీసుకున్నవని వివరణ ఇచ్చారని టీ–రెరా అధికారి ఒకరు తెలిపారు. మరొక 20 మంది డెవలపర్లు మాత్రం టీ–రెరాలో నమోదు అర్హత ఉన్న ప్రాజెక్ట్‌లనే ప్రచారం చేశారని త్వరలోనే వీరికి జరిమానాలు విధించనున్నామని చెప్పారు. ఆయా ప్రాజెక్ట్ సైట్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశామని త్వరలోనే టీం సైట్ విజిట్స్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. రెరా నిబంధనల ప్రకారం ప్రాజెక్ట్‌లను రిజిస్టర్ చేయకుండా అడ్వర్టయింజింగ్ చేసినా లేదా విక్రయించినా శిక్షార్హమే. సెక్షన్ 59 ప్రకారం తొలుత ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా ఉంటుంది. అథారిటీకి సరైన వివరణ ఇవ్వకపోయినా లేదా అప్పటికీ రిజిస్టర్ చేయకపోయినా సరే సంబంధిత డెవలపర్‌కు మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 20 శాతం జరిమానా విధిస్తుంది. -
లండన్‌లో గజం రూ. కోటి
లండన్/ముంబై: హైదరాబాద్, ముంబై, పుణేల్లో రియల్టీ ప్రాజెక్టులు చేపడుతున్న లోధా గ్రూప్... లండన్ రియల్టీ మార్కెట్లోనూ అడుగుపెట్టింది. ఇందుకోసం సెంట్రల్ లండన్‌లోని మెక్‌డొనాల్డ్ హౌస్‌ను ఏకంగా రూ.3,120 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. ఇప్పటిదాకా మెక్‌డొనాల్డ్ హౌస్‌లో కెనడా రాయబార కార్యాలయం ఉంది. దీన్ని కెనడా ప్రభుత్వం విక్రయానికి పెట్టడంతో తాము కొనుగోలు చేసినట్లు లోధా గ్రూప్ శుక్రవారం తెలియజేసింది. కాగా లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లో ఉన్న కెనడా హౌస్‌ను పునరుద్ధరించే నిమిత్తం మెక్‌డొనాల్డ్ హౌస్‌ను విక్రయానికి పెట్టినట్లు లండన్‌లోని కెనడా రాయబారి గోర్డన్ క్యాంప్‌బెల్ చెప్పారు. దీనికోసం పోటీపడిన ఇతర అంతర్జాతీయ దిగ్గజాల్ని తోసిరాజని... చదరపు గజానికి దాదాపు కోటి రూపాయలు వెచ్చించి మరీ లోధా గ్రూప్ దీన్ని సొంతం చేసుకోవటం విశేషం. సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ నిర్మాణం... లండన్‌లోని మై ఫెయిర్, బాండ్ స్ట్రీట్, మౌంట్ స్ట్రీట్లకు అతి సమీపంలో ఉన్న మెక్‌డొనాల్డ్ హౌస్‌ను కొనుగోలు చేయడం తమకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నట్లు లోధా గ్రూప్ ఎండీ అభిషేక్ లోధా చెప్పారు. దీనికి కావలసిన నిధులను అంతర్గత వనరుల నుంచే సమీకరించుకుంటామని తెలియజేశారు. తొలి విడతగా 300 కోట్ల రూపాయలు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది మార్చికల్లా చెల్లిస్తామని చెప్పారాయన. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు కిలోమీటర్ లోపు దూరంలో.. 67 సెంట్లలో ఉన్న ఈ ప్రోపర్టీలో 1.6 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను చేపట్టవచ్చని కంపెనీ భావిస్తోంది. అంతర్జాతీయ కస్టమర్ల కోసం ఇక్కడ సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ నిర్మిస్తామని లోధా గ్రూప్ పేర్కొంది. ఐదేళ్లలో ఇక్కడ ఫ్లాట్స్ అమ్మకం ద్వారా 75 కోట్ల పౌండ్ల (రూ.7,500 కోట్లు) ఆదాయం లభిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. లండన్ కోసం ప్రత్యేక సంస్థ ముంబై, లండన్ మార్కెట్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కంపెనీ డిప్యూటీ ఎండీ అభినందన్ లోధా చెప్పారు. లండన్‌లో అపారమైన అవకాశాలున్నాయని, అందుకే ఇక్కడ విస్తరించాలనుకుంటున్నామని చెప్పారు. మెక్‌డొనాల్డ్ హౌస్ ప్రోపర్టీ డెవలప్మెంట్ కోసం, ఇంగ్లాండ్‌లో రియల్టీ బిజినెస్ కోసం... జేపీ మోర్గాన్ మాజీ ఎండీ టైలర్ గుడ్విన్ సీఈఓగా ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. లోధా గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.8,700 కోట్ల అమ్మకాలు సాధించింది. గడిచిన ఏడాది కాలంలో ఈ సంస్థ ముంబైలో 17 ఎకరాలను డీఎల్ఎఫ్ నుంచి రూ.2,727 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబైలోని వాషింగ్టన్ హౌస్ ప్రోపర్టీని కూడా అమెరికా ప్రభుత్వం నుంచి రూ.375 కోట్లకు కొనుగోలు చేసింది.