ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ రుణ ఫోర్ట్‌ఫోలియో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 9 నుంచి 11 శాతం ఉంటుందన్నదని ఇక్రా అంచనా. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
► 2021–22 మొదటి త్రైమాసికంలో (2020 ఏప్రిల్–జూన్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ–హెచ్‌ఎఫ్‌సీ) రుణ పంపిణీలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం పడింది. అయితే రెండవ త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) చక్కటి రికవరీ చోటుచేసుకుంది. 2021–22 మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలాన్ని పరిశీలిస్తే, వాటి ఆన్ బుక్ పోర్ట్‌ఫోలియో 9 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లుగా నమోదయ్యింది.
►ఇదే ధోరణి ఆర్థిక సంవత్సరం మొత్తంలో కనబడుతుందని భావిస్తున్నాం. దేశంలో వ్యాక్సినేషన్ విస్తృతి, ఎకానమీ క్రియాశీలత మెరుగ్గా ఉండడం, పరిశ్రమ డిమాండ్ మెరుగుపడ్డం, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యవస్థలో అనుకున్నంత ఆందోళనలు సృష్టించకపోవడం వంటి అంశాలు దీనికి కారణం.
►ఈ విభాగంలో మొండిబకాయిలు సైతం మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికం నుంచి గణనీయంగా మెరుగుపడ్డం ప్రారంభమైంది. వసూళ్ల సామర్థ్యం (సీఈ) బలపడింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మెరుగుపడ్డాయి.
►హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో రుణ పునర్‌వ్యవస్థీకరణల డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి పునర్‌వ్యవస్థీకరణ డిమాండ్ మొత్తం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్‌మెంట్) 1.1 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ 30 నాటికి 2.3 శాతానికి పెరిగింది. అయితే 2022 మార్చి 31వ తేదీ నాటికి ఈ శాతం స్వల్పంగా 2 నుంచి 2.1 శాతం శ్రేణికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. రికవరీలు బాగుండడం, డిఫాల్ట్‌లు తగ్గడం వంటి అంశాలు దీనికి కారణం.
► ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లాభదాయకత 2020–21 ఆర్థిక సంవత్సరం తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి భారీ పెరుగుదలా లేకుండా మామూలుగా కొనసాగే అవకాశం ఉంది. నిధుల సమీకరణ వ్యయాలు పెరగడం దీనికి కారణం. అయితే 2022–23లో లాభదాయకత కోవిడ్–19 ముందస్తు స్థాయికి వేరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment