తెలంగాణలోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఏజెంట్లూ! మీరు ఇంకా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో తమ పేర్లను, ప్రాజెక్ట్‌లను నమోదు చేయలేదా? అయితే రూ.50 వేలు జరిమానా చెల్లించాల్సిందే. పెనాల్టీ కట్టి వచ్చే వారం రోజుల్లోగా నమోదు చేసుకోకపోతే మొదటి వారం రూ.లక్ష, ఆ తర్వాతి వారం రూ.2 లక్షలు ఫైన్ తప్పదు. అప్పటికీ రిజిస్టర్ కాకపోతే ఏకంగా ప్రాపర్టీ సీజ్!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టం–2016ను అమల్లోకి తీసుకొచ్చిన ఏడాది తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2017లో రెరాను నోటీఫై చేసింది. 2017, జనవరి 1 తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీఎస్‌ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్ట్ టీ– రెరాలో నమోదు చేసుకోవాలన్న విషయం తెలిసిందే. నమోదు గడువును 2018 నవంబర్ 30 వరకు విధించింది. రిజిస్టర్ చేసుకోని ప్రాజెక్ట్ ప్రమోటర్లపై రెరా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు టీ–రెరా అధికారులు సిద్ధమయ్యారు.
1,200 ప్రాజెక్ట్‌ల నమోదు..
గతేడాది జనవరి 1 తర్వాత ఆయా విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లు అనుమతి పొందాయి. కానీ, ఇప్పటివరకు టీ–రెరాలో వెయ్యి మంది ప్రమోటర్లు, వెయ్యి మంది ఏజెంట్లు నమోదయ్యారని.. సుమారు 1,200 ప్రాజెక్ట్‌ల వరకు రిజిస్టరయ్యాయని టీ–రెరా అధికారి ఒకరు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో మినహా ఇతర ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో ప్రమోటర్లు, ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయని ఇవి సుమారు 200 ప్రాజెక్ట్‌ల వరకుంటాయని చెప్పారు.
నేటి నుంచి జరిమానాలు షురూ..
టీ–రెరా రికార్డుల ప్రకారం తెలంగాణలో ఇంకా 2,000–2,500 ప్రాజెక్ట్‌లు నమోదు కావాల్సి ఉందని సమాచారం. నేటి నుంచి ఆయా ప్రాజెక్ట్ ప్రమోటర్లకు రూ.50 వేల జరిమానా విధించనున్నామని టీ–రెరా అధికారి ఒకరు ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. వారం రోజుల్లోగా నమోదు కాకపోతే జరిమానాల మొత్తాలను పెంచుతామని, అయితే అది ఎంతనేది ఈనెల 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అప్పటికీ ముందుకొచ్చి రెరాలో రిజిస్టర్ కాకపోతే ప్రాజెక్ట్ సైట్‌లను టీ–రెరా బృందం ప్రత్యక్షంగా తనిఖీ చేసి రెవిన్యూ చట్టం కింద ప్రాపర్టీలను సీజ్ చేస్తామని చెప్పారాయన.
2019 మార్చి 31 వరకూ పొడిగించాలి
టీ–రెరా ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు, ఏజెంట్ల నమోదు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) కోరింది. ఈ మేరకు పురపాలక నిర్వహణ మరియు పట్టణ అభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రంలో డెవలపర్లకు రెరా చట్టం గురించి పూర్తి స్థాయిలో అవగాహన రాలేదని.. నమోదు ప్రక్రియలో డెవలపర్లకు సహాయం చేసేందుకు కూడా కన్సల్టెంట్లు పెద్దగా లేరని అందుకే నమోదు గడువును పొడిగించాలని టీబీఎఫ్ ప్రెసిడెంట్ సీ ప్రభాకర్ రావు తెలిపారు.
త్వరలోనే 20 మంది డెవలపర్లపై చర్యలు
టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రాజెక్ట్‌లను అడ్వర్టయిజింగ్ చేసిన 40 మంది డెవలపర్లకు ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. నవంబర్ 20 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. వీరిలో కొంత మంది డెవలపర్లు అడ్వర్టయిజింగ్ చేసిన ప్రాజెక్ట్‌లలో కొన్ని 2015, 2016లో అనుమతి తీసుకున్నవని వివరణ ఇచ్చారని టీ–రెరా అధికారి ఒకరు తెలిపారు. మరొక 20 మంది డెవలపర్లు మాత్రం టీ–రెరాలో నమోదు అర్హత ఉన్న ప్రాజెక్ట్‌లనే ప్రచారం చేశారని త్వరలోనే వీరికి జరిమానాలు విధించనున్నామని చెప్పారు. ఆయా ప్రాజెక్ట్ సైట్‌లను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశామని త్వరలోనే టీం సైట్ విజిట్స్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. రెరా నిబంధనల ప్రకారం ప్రాజెక్ట్‌లను రిజిస్టర్ చేయకుండా అడ్వర్టయింజింగ్ చేసినా లేదా విక్రయించినా శిక్షార్హమే. సెక్షన్ 59 ప్రకారం తొలుత ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానా ఉంటుంది. అథారిటీకి సరైన వివరణ ఇవ్వకపోయినా లేదా అప్పటికీ రిజిస్టర్ చేయకపోయినా సరే సంబంధిత డెవలపర్‌కు మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 20 శాతం జరిమానా విధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment