ముంబై : న్యూఇయర్ వేడుకల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీ మొత్తంలో నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా ముంబైలో ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లలో వాహనదారుల నుంచి రూ.89లక్షల ఫైన్‌ల రూపంలో వసూలు చేశారు.
ముంబై పోలీసుల సమాచారం మేరకు..న్యూఇయర్‌లో మొత్తం 17,800 ఇ-చలాన్‌లను జారీ చేశారు. అందులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 2,893 కేసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తులపై 1,923 కేసులు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన 1,731 కేసులు, ప్రజా రవాణాకు అర్హతలేని వాహనాల్ని డ్రైవ్ చేసినందుకు 1,976 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు నగరంలో మితిమీరిన వేగానికి 842 చలాన్, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై 432 చలాన్లు వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
న్యూఇయర్ సందర్భంగా మద్యం తాగి డ్రైవ్ చేసిన వారికి 153 చలాన్‌లు, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడినందుకు 109 చలాన్‌లు, ట్రిపుల్ రైడింగ్ 123 చలాన్‌లను, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసినందుకు 40 చలాన్‌లు విధించారు. అలా మొత్తంగా విధించిన చలాన్లతో రూ.89,19,750 వసూలు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు.
మీడియా కథనాల ప్రకారం 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎనిమిది మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2184 మంది ఇన్‌స్పెక్టర్‌లు, 12,000 మందికి పైగా కానిస్టేబుళ్లు ముంబై వీధుల్లో విధులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment