Hyderabad: ఎఫ్‌ఐఆర్‌లు.. జరిమానాలు..రెడ్‌ నోటీసులు | Traffic Police Fines FIR On Wrong Parking Hyderabad Banjara Hills | Sakshi
Sakshi News home page

Hyderabad: ఎఫ్‌ఐఆర్‌లు.. జరిమానాలు..రెడ్‌ నోటీసులు

Published Tue, Jan 17 2023 10:37 AM | Last Updated on Tue, Jan 17 2023 3:33 PM

Traffic Police Fines FIR On Wrong Parking Hyderabad Banjara Hills - Sakshi

ఫిలింనగర్‌లో వాహనదారులకు జరిమానాలు విధిస్తున్న జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు

సాక్షి, బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి వద్ద రోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్‌ ఆక్రమణలు, రోడ్డు పక్కనే అక్రమ పార్కింగ్‌లు, పుట్‌పాత్‌పైనే చిరు వ్యాపారాలు జోరుగా సాగేవి.. ఇక్కడికి అంబులెన్స్‌ రావాలంటే నరకయాతన అయ్యేది. బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు గత రెండు నెలలుగా ఈ అక్రమ పార్కింగ్‌లు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తుండటంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొంత మేర వాహనాలు తేలికగా రాకపోకలు సాగించే విధంగా ట్రాఫిక్‌ అడ్డంకులు తొలగిపోయాయి. 

గతంలో   పదేపదే చెప్పినా పెడచెవిన పెడుతూ రోడ్లపక్కనే బండ్లు పెట్టుకొని హోటళ్లు నడిపిస్తున్న వ్యాపారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడమే కాకుండా సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రోడ్లపక్కన అక్రమ పార్కింగ్‌ చేసిన వాహనాలను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు.  


అపోలో ఆస్పత్రి వద్ద నో పార్కింగ్‌ జోన్‌లో వాహనాలను లిఫ్ట్‌ చేస్తున్న బంజారాహిల్స్‌ పోలీసులు

►దీంతో అపోలో పరిసరాల్లో వాహనం పెడితే పోలీసులు లిఫ్ట్‌ చేస్తారని చిరు వ్యాపారాలు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తారని భావించిన వీరంతా గత నాలుగు వారాల నుంచి వీటి జోలికి పోవడం లేదు. 

►ఫలితంగా ఈ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్‌ అడ్డంకులు తొలగిపోయి వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలవుతోంది. 
►గతంలో రోజుకు రెండు మూడుసార్లు ట్రాఫిక్‌ పుష్‌కాట్‌ వాహనాలను తిప్పిన ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పుడు గంటలో నాలుగైదు సార్లు తిప్పుతుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.  

►ఇది కేవలం అపోలో ఆస్పత్రికే పరిమితం చేయకుండా స్టార్‌ ఆస్పత్రి, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి, స్టార్‌ బక్స్, తాజ్‌మహల్‌ హోటల్, రియాట్‌ పబ్, ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి,  బంజారాహిల్స్‌ రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12, ఫిలింనగర్‌లకు విస్తరించారు.  
►బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డుకు, ఫుట్‌పాత్‌లకు అడ్డంకులు సృష్టిస్తున్న 30 మంది చిరు వ్యాపారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.  
►మరో వైపు బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వైపు ఇష్టానుసారంగా గతంలో వాహనాలు నిలిపేవారు.  
► ఇప్పటికే ఈ ఆస్పత్రికి రెడ్‌నోటీసులు జారీ చేశా­రు. ఆస్పత్రికి వైపు మాత్రమే పార్కింగ్‌ చేసుకో­వాలని,  రెండోవైపు వాహనాలు పార్కింగ్‌ చేస్తే వీ­ల్‌ క్లాంప్‌లు వేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

జూబ్లీహిల్స్‌ పరిధిలో..
జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు సైతం గత ఐదు వారాల నుంచి అక్రమ పార్కింగ్‌లపై కొరడా ఝులిపిస్తున్నారు.  
►రోడ్డుకు రెండువైపులా చిరు వ్యాపారులు రోడ్డును, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఇబ్బందులు కల్గిస్తుండటంతో  జరిమానాలు విధిస్తున్నారు. ఫలితంగా ఫుట్‌పాత్‌ ఆక్రమణలతో పాటు అక్రమ పార్కింగ్‌లకు 80 శాతం వరకు తెరపడింది. 
►నిత్యం ఇక్కడి పోలీసులు ట్రాఫిక్‌ పుష్‌కాట్‌ వాహనంతో వాహనాలు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో ఉన్న వ్యాపార కేంద్రాలకు ఒక్కదానికి కూడా పార్కింగ్‌ సౌకర్యం లేదు. 
►ఈ రోడ్డులో హోటళ్లు, ఆభరణాల షోరూంలు, బొటిక్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీరందరికీ ఇప్పటికే పలుమార్లు అవగాహన కలిగించి లైన్‌ దాటితే జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.  
► వివాహ భోజనంబు, అంతేరా, స్పైసీ అవెన్యూ, వ్యాక్స్‌ బేకరీ, బ్రీవ్‌ 40, సెవన్త్‌ హెవన్, కేఫ్‌ కాఫీడే తదితర వ్యాపార సంస్థలకు ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.  
►జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో రోడ్డు, ఫుట్‌పాత్‌ అడ్డంకులు న్యూసెన్స్‌కు పాల్పడుతున్న 25 మంది వ్యాపారులపై ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యాయి. భారీగా జరిమానాలు విధించారు.  

పంజగుట్టలో..
►పంజగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు అక్రమ పార్కింగ్‌లు అధికంగా ఉండే సోమాజిగూడ యశోదా ఆస్పత్రి రోడ్డుపై దృష్టి సారించారు.  
►ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకు సుమారు 25 వాహనాలను స్టేషన్‌కు తరలిస్తున్నారు.  
►అక్రమ పార్కింగ్‌లు చేస్తున్న బైక్‌లను తరలిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు ఈ రోడ్డులో చిరువ్యాపారులను మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో సహజంగానే రోడ్డు మరింత ఇరుకుగా మారుతోంది.
►ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీతో పాటు, పంజగుట్ట ప్రధాన రహదారిలోని మెరీడియన్, రెడ్‌రోజ్‌ హోటల్, రాజ్‌భవన్‌ రోడ్డులో నిత్యం వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement