wrong parking
-
Hyderabad: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద రోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్ ఆక్రమణలు, రోడ్డు పక్కనే అక్రమ పార్కింగ్లు, పుట్‌పాత్‌పైనే చిరు వ్యాపారాలు జోరుగా సాగేవి.. ఇక్కడికి అంబులెన్స్ రావాలంటే నరకయాతన అయ్యేది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గత రెండు నెలలుగా ఈ అక్రమ పార్కింగ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తుండటంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొంత మేర వాహనాలు తేలికగా రాకపోకలు సాగించే విధంగా ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పదేపదే చెప్పినా పెడచెవిన పెడుతూ రోడ్లపక్కనే బండ్లు పెట్టుకొని హోటళ్లు నడిపిస్తున్న వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమే కాకుండా సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రోడ్లపక్కన అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద నో పార్కింగ్ జోన్లో వాహనాలను లిఫ్ట్ చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు ►దీంతో అపోలో పరిసరాల్లో వాహనం పెడితే పోలీసులు లిఫ్ట్ చేస్తారని చిరు వ్యాపారాలు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తారని భావించిన వీరంతా గత నాలుగు వారాల నుంచి వీటి జోలికి పోవడం లేదు. ►ఫలితంగా ఈ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయి వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలవుతోంది. ►గతంలో రోజుకు రెండు మూడుసార్లు ట్రాఫిక్ పుష్‌కాట్ వాహనాలను తిప్పిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు గంటలో నాలుగైదు సార్లు తిప్పుతుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ►ఇది కేవలం అపోలో ఆస్పత్రికే పరిమితం చేయకుండా స్టార్ ఆస్పత్రి, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, స్టార్ బక్స్, తాజ్‌మహల్ హోటల్, రియాట్ పబ్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, బంజారాహిల్స్ రోడ్ నం.1, బంజారాహిల్స్ రోడ్ నం.12, ఫిలింనగర్‌లకు విస్తరించారు. ►బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు, ఫుట్‌పాత్‌లకు అడ్డంకులు సృష్టిస్తున్న 30 మంది చిరు వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ►మరో వైపు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు ఇష్టానుసారంగా గతంలో వాహనాలు నిలిపేవారు. ► ఇప్పటికే ఈ ఆస్పత్రికి రెడ్‌నోటీసులు జారీ చేశారు. ఆస్పత్రికి వైపు మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని, రెండోవైపు వాహనాలు పార్కింగ్ చేస్తే వీల్ క్లాంప్లు వేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సైతం గత ఐదు వారాల నుంచి అక్రమ పార్కింగ్‌లపై కొరడా ఝులిపిస్తున్నారు. ►రోడ్డుకు రెండువైపులా చిరు వ్యాపారులు రోడ్డును, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ఇబ్బందులు కల్గిస్తుండటంతో జరిమానాలు విధిస్తున్నారు. ఫలితంగా ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాటు అక్రమ పార్కింగ్‌లకు 80 శాతం వరకు తెరపడింది. ►నిత్యం ఇక్కడి పోలీసులు ట్రాఫిక్ పుష్‌కాట్ వాహనంతో వాహనాలు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న వ్యాపార కేంద్రాలకు ఒక్కదానికి కూడా పార్కింగ్ సౌకర్యం లేదు. ►ఈ రోడ్డులో హోటళ్లు, ఆభరణాల షోరూంలు, బొటిక్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీరందరికీ ఇప్పటికే పలుమార్లు అవగాహన కలిగించి లైన్ దాటితే జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ► వివాహ భోజనంబు, అంతేరా, స్పైసీ అవెన్యూ, వ్యాక్స్ బేకరీ, బ్రీవ్ 40, సెవన్త్ హెవన్, కేఫ్ కాఫీడే తదితర వ్యాపార సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ►జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రోడ్డు, ఫుట్‌పాత్ అడ్డంకులు న్యూసెన్స్‌కు పాల్పడుతున్న 25 మంది వ్యాపారులపై ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. భారీగా జరిమానాలు విధించారు. పంజగుట్టలో.. ►పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు అక్రమ పార్కింగ్లు అధికంగా ఉండే సోమాజిగూడ యశోదా ఆస్పత్రి రోడ్డుపై దృష్టి సారించారు. ►ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకు సుమారు 25 వాహనాలను స్టేషన్‌కు తరలిస్తున్నారు. ►అక్రమ పార్కింగ్లు చేస్తున్న బైక్‌లను తరలిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డులో చిరువ్యాపారులను మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో సహజంగానే రోడ్డు మరింత ఇరుకుగా మారుతోంది. ►ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో పాటు, పంజగుట్ట ప్రధాన రహదారిలోని మెరీడియన్, రెడ్‌రోజ్ హోటల్, రాజ్‌భవన్ రోడ్డులో నిత్యం వాహనాలను సీజ్ చేస్తున్నారు. -
ఫోటో కొట్టండి రివార్డు పట్టండి.. రాంగ్ పార్కింగ్‌పై త్వరలో కొత్త చట్టం
న్యూఢిల్లీ : పెరుగుతున్న వాహనాలతో ప్రస్తుతం పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ సమస్య నేపథ్యంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నది. ఈ క్రమంలో రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి త్వరలో కేంద్రం చట్టం తేనున్నది. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను పంపిన వ్యక్తికి సైతం రివార్డ్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. రాంగ్ పార్కింగ్‌కు రూ.1000 జరిమానా విధిస్తే.. ఫొటో పంపిన వ్యక్తికి రూ.500 రివార్డగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాలకు అడ్డకట్ట వేసేలా చట్టాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాంగ్ పార్కింగ్ కారణంగా తరచూ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతున్నాయన్నారు. రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి మొబైల్లో ఫొటో తీసి పంపితే.. సదరు వాహనదారుడికి రూ.1000 జరిమానా విధిస్తామని, ఫొటోను పంపిన వ్యక్తికి రూ.500 రివార్డ్ ఇస్తామన్నారు. దీంతో పార్కింగ్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రజలు వాహనాలకు సంబంధించి పార్కింగ్ స్థలం కల్పించుకోకపోవడం, రోడ్లను ఆక్రమించడంపై కేంద్రమంత్రి విచారం వ్యక్తం చేశారు. -
రూ.397 కోట్లు సమర్పణ.. బాధ్యులు ఎవరు?
సాక్షి, హైదరాబాద్ : ఎవరింట్లో అయినా దొంగలు పడి తులం బంగారం ఎత్తుకుపోతే నానా హైరానా పడిపోతాం. అదే రహదారిపై వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ చలాన్ పడుతుందని తెలిసీ ఉల్లంఘనలకు పాల్పడతాం. ట్రాఫిక్ ఉల్లంఘనులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో అప్పుడప్పుడు ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాదు... అనునిత్యం నగరవాసి జేబుకు చిల్లుపడుతూనే ఉంది. వాహనచోదకుల అవగాహనా రాహిత్యం... మౌలిక వసతుల లేమి.. ఎడ్యుకేషన్ కోణంలో అధికారుల వైఫల్యం.. .కారణం ఏదైతేనేమి మూడు కమిషనరేట్లకు చెందిన వాహనచోదకులు గత ఏడాది అక్షరాలా రూ.397,89,42,640 జరిమానాల రూపంలో ఖజానాకు సమర్పించుకున్నారు. ఇదే కాలంలో చోరీలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలు వంటి వివిధ రకాలైన నేరాల్లో ప్రజలు కోల్పోయింది రూ.57,38,20,973 కావడం గమనార్హం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో సరాసరిన రోజుకు 186 కేసులు నమోదు అవుతుండగా.... ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య మాత్రం 31,956గా ఉంది. ఈ పరిస్థితులకు బాధ్యులు ఎవరు? నిబంధనలు పట్టని వాహనచోదకులా..? మౌలిక వసతుల కల్పనలో ఘోరంగా విఫలమౌతున్న జీహెచ్‌ఎసీనా? ట్రాఫిక్ ఎడ్యుకేషన్‌లో విఫలమౌతున్న పోలీసులా? అనేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మిలియన్ డాలర్ల ప్రశ్నే. చదవండి: ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు నగరంలో రోడ్డు నిబంధనల పాటించకుండా ట్రాఫిక్ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసే వారిలో పదే పదే ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారే ఎక్కువగా ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రాఫిక్ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య... వాహనాల సంఖ్య కంటే కాస్త ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. ఇందులో ప్రతి ఒక్క వాహనచోదకుడూ ఉల్లంఘనలకు పాల్పడటం అనేది జరుగదు. కనిష్టంగా తీసుకున్నా పది లక్షల మంది వాహనచోదకులు నిబంధనలు పాటిస్తూనో, సొంత వాహనాలు లేని కారణంగానో ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలకు పూర్తి దూరంగా ఉన్నారని లెక్కేయచ్చు. అయితే ట్రాఫిక్ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య మాత్రం ఏటా సరాసరిన 30 లక్షలకు పైగా ఉంది. అనేక మంది వాహనచోదకులు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతూ రిపీటెడ్ వైలేటర్స్‌గా ఉండటమే దీనికి కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. అవగాహనే కీలక ప్రాధాన్యం ‘ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి జరిమానాలు విధిస్తున్నాం. వారీలో రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికీ పెద్దపీట వేస్తున్నాం. క్రమం తప్పకుండా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థి దశ నుంచే మార్పులు తీసుకురావడానికి కళాశాలలు, పాఠశాలలకూ వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కొందరు సెలబ్రెటీలను భద్రతాంశాలపై ప్రచారం కోసం తీసుకురావడంతో పాటు మీడియా ద్వారానూ ప్రచారం చేస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సోషల్‌మీడియా ద్వారా నెట్‌జనులకు దగ్గరవుతున్నాం. ఎన్ఫోర్స్మెంట్ కంటే ఎడ్యుకేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం.’ – నగర ట్రాఫిక్ అధికారులు ఎవరికి వారే మారాలి ‘నగరంలో ఈ పరిస్థితుల నెలకొనడానికి ఏ ఒక్కరో కారణం కాదు. ప్రభుత్వ యంత్రాగాల అలసత్వం, వాహనచోదకుల నిర్లక్ష్యం వెరసి నగరవాసి జేబుకు మాత్రం చిల్లుపడుతోంది. కేవలం చలాన్ల రూపంలోనే కాకుండా విలువైన పనిగంటలు, ఇంధనం రూపంలోనూ నష్టపోతున్నారు. అన్ని ఉల్లంఘనల్లోనూ అత్యంత కీలకమైంది పార్కింగ్. ఏ ప్రదేశంలోనూ కూడా నిబంధనల ప్రకారం పార్కింగ్ ఉండట్లేదు. అయినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. నిబంధనలను ఇబ్బందిగా ఫీల్ అవుతున్న నగరవాసి, మౌలిక వసతుల కల్పనను ఓ భారంగా భావిస్తున్నా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ ఎడ్యుకేషన్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వని ట్రాఫిక్ కాప్స్ సమూలంగా మారితేనే పరిస్థితుల్లో మార్పు వచ్చేది’. – రోమల్, జగదీష్ మార్కెట్ ట్రాఫిక్ కేసులు ఇలా... కమిషనరేట్ చలాన్లు విధించిన జరిమానా హైదరాబాద్ 54,74,479 రూ.173,84,01,535 సైబరాబాద్ 47,71,328 రూ.178,39,40,605 రాచకొండ 14,18,355 రూ.45,66,00,500 మొత్తం 1,16,64,162 రూ.397,89,42,640 (నవంబర్ వరకు) నేరాల కేసులు ఇలా... కమిషనరేట్ కేసులు దుండుగల పాలైంది హైదరాబాద్ 22,641 రూ.26,15,21,679 సైబరాబాద్ 24,868 రూ.15,31,78,771 రాచకొండ 20,641 రూ.15,91,20,523 మొత్తం 68,150 రూ.57,38,20,973 (డిసెంబర్ 20 వరకు) -
దారి తప్పిన ‘సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా’ కారు!
సాక్షి, న్యూఢిల్లీ: డ్రైవరు అవసరం లేకుండా తనంతట తాను నడుపుకుంటూ వెళ్లే ‘టెస్లా’ కంపెనీ కార్లు ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల మార్కెట్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ కంపెనీకి చెంది మూడో మాడల్ కార్లో మంగళవారం నాడు ఓ సాంకేతిక లోపం కనిపించింది. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆ కారును కారు యజమాని ఓ యాప్ ద్వారా తన వద్దకు రమ్మని ఆదేశం ఇచ్చారు. పార్కింగ్ స్థలం నుంచి క్షేమంగా రోడ్డు మీదకు వచ్చిన ఆ కారు ఎలా వెళ్లాలో తెలియక కాస్త కంగారు పడింది. రాంగ్ రూటులో డౌన్లోకి వెళ్లి తికమక పడింది. కాసేపు ఆగిపోయింది, మళ్లీ స్టార్టు చేసుకొని పక్కకు వెళ్లింది. బ్రిటిష్ కొలంబియాలోని రిచ్మండ్ రోడ్డులో కనిపించిన ఈ సీన్‌ను పాదాచారులెవరో గుర్తించి వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. దీని మీద వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించిన కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ఇప్పటీ వరకు కార్ల యజమానులు యాప్ ద్వారా ఇచ్చిన దాదాపు ఐదున్నర లక్షల ఆదేశాలను తమ కార్లు కచ్చతంగా పాటించాయని, ఈ ఒక్క కారు విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ డ్రైవర్ అవసరం లేని కార్లు తమను నిర్దిష్ట ప్రాంతాల్లో దించి, అవంతట అవే పార్కింగ్ స్థలాలకు వెళ్లి పార్కు చేసుకోవడం, తాము సందేశం ఇవ్వగానే పార్కింగ్ స్థలం నుంచి తమ వద్దకు రావడం ఎంతో బాగుండడమే కాకుండా ఎంతో థ్రిల్లింగాగా కూడా ఉందని పలువురు వీటిని కొన్న ఎక్కువ మంది కార్ల యజమానులు ఇంతకుముందే మీడియాతో చెప్పారు. యజమానులను చికాకు పర్చడమే కాకుండా, పాదాచారులను భయపెడుతున్నాయని కొంత మంది యజమానులు ఆరోపించారు. -
రాంగ్ పార్కింగ్‌కు రూ. 23 వేల జరిమానా
ముంబై: రాంగ్ పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధించేలా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), ముంబై ట్రాఫిక్ పోలీసులు కలిసి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. నో పార్కింగ్ జోన్లలో వాహనాలను పార్క్ చేస్తే రూ. 5 వేల నుంచి 23 వేల వరకూ జరిమానా విధించనున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ద్విచక్ర వాహనాలకు రూ. 5 వేల నుంచి రూ. 8,300 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ. 10 వేల నుంచి రూ. 23,500 వరకు జరిమానా విధిస్తారు. అలాగే మధ్య స్థాయి వాహనదారులకు రూ. 11 వేల నుంచి 17,600 వరకు, లైట్ మోటార్ వాహనాలకు రూ. 10 వేల నుంచి రూ. 15,100 వరకు, మూడు చక్రాల వాహనాలకు రూ. 8 వేల నుంచి రూ. 12,200 వరకు పెనాల్టీ పడనుంది. వాహనదారులు ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్క్ చేస్తున్నారని, దాని వల్లే ట్రాఫిక్ జామ్ అవుతోందని బీఎంసీ అధికారులు తెలిపారు. తాజా నిబంధనలతో ట్రాఫిక్ జామ్ తగ్గుతుందన్నారు. జరిమానా వెంటనే చెల్లించకపోతే, రోజురోజుకూ అది పెరుగుతుందన్నారు. ట్రాఫిక్ పోలీసులకు తోడుగా విశ్రాంత సిబ్బందిని, ప్రైవేటు సిబ్బందిని కూడా తీసుకున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. పార్కింగ్ వసతి ఉన్న ప్రాంతాల్లో మొదట ఈ నిబంధనలు అమలవుతాయని తెలిపారు. ముంబైలో 30 లక్షల వాహనాలున్నట్లు ఓ అంచనా. -
ట్రాఫిక్ చీఫ్‌కూ ఈ–చలాన్
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరించే అదనపు పోలీసు కమిషనర్ అనిల్‌కుమార్ వాహనానికీ జరిమానా తప్పలేదు. ఆయన వాహనాన్ని డ్రైవర్ నో పార్కింగ్ ఏరియాలో ఉంచారు. ఈ రాంగ్ పార్కింగ్ వ్యవహారాన్ని ఓ నెటిజనుడు తన కెమెరాలో బంధించి ట్రాఫిక్ వింగ్‌కు ట్వీట్ చేశాడు. స్పందించిన అధికారులు తక్షణమే ఈ–చలాన్ జారీ చేయడంతోపాటు బాధ్యుడితో ఫైన్ కూడా కట్టించారు. అనిల్‌కుమార్ గత కొన్ని రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ ట్రాఫిక్ ఠాణాలతోపాటు ఏసీపీ కార్యాలయాలకూ వెళ్తున్నారు. గురువారం నార్త్‌జోన్ పరిధిలో ఉన్న మహంకాళి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు అనిల్‌కుమార్‌తో పాటు డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ సైతం వచ్చారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్ సమీపంలోని భవనం మొదటి అంతస్తులో ఉన్న ఈ ఠాణాకు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన ఈ అధికారులు తమ వాహనాలు దిగి లోపలకు వెళ్లిపోయారు. వాహనాలను సక్రమంగా నిలపాల్సిన బాధ్యత ఆ వాహనాల డ్రైవర్లకే ఉంటుంది. అనిల్‌కుమార్‌కు డ్రైవర్‌గా వ్యవహరించిన సిబ్బంది దాన్ని రోడ్డు పక్కగా ఆపారు. అదే ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన నోపార్కింగ్ బోర్డు ఉంది. నెటిజనుడి ఫొటోతో వెలుగులోకి.. ఇలా రాంగ్ పార్కింగ్‌లో ఉన్న వాహనం, దానికి పోలీసుల అధికారులకు చెందినదని చెప్పే ఆనవాళ్లు ఉండటం గమనించిన ఓ నెటిజనుడు ఫొటో తీశాడు. దీన్ని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగర ట్రాఫిక్ పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్వీట్ చేశాడు. స్పందించిన అధికారులు అదనపు సీపీ వాహనంపై రూ.235 జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేశారు. ఇది తెలుసుకున్న అనిల్‌కుమార్ ఆరా తీయగా డ్రైవర్ చూపిన నిర్లక్ష్యం బయటపడింది. దీంతో తొలుత అతడితో రూ.235 జరిమానా కట్టించి ఈ–చలాన్ క్లోజ్ చేయించారు. ఆపై కొద్దిసేపటికి ట్రాఫిక్ చీఫ్ సదరు డ్రైవర్‌కు తన జేబు నుంచి ఆ మొత్తం ఇచ్చినట్లు తెలిసింది. -
రాంగ్ పార్కింగ్ చేస్తే రూ.వెయ్యి జరిమానా
గద్వాల క్రైం : వాహనదారులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపితే జరిమానా తప్పదని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమోహన్‌రావు స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారులపై రాంగ్ పార్కింగ్‌లో నిలిపిన వాహనదారులకు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఇక నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, సురక్షితమైన ప్రయాణం చేయాలని సూచించారు. మైనర్ బాలలకు వాహనాలు అప్పగిస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరించారు. -
రాంగ్ పార్కింగ్ కేసునూ ఎదుర్కోలేదు: మోడీ
గాంధీనగర్ (గుజరాత్): సుపరిపాలన అందించడం ద్వారా కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించవచ్చని, ప్రజలకు మెరుగైన న్యాయం అందించవచ్చని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) స్వర్ణోత్సవాల్లో భాగంగా శనివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. కనీసం రాంగ్ పార్కింగ్ కేసును కూడా తానెప్పుడూ ఎదుర్కోలేదని...అందువల్ల కోర్టు గదిని ఎప్పుడూ చూడలేదన్నారు. న్యాయ వ్యవస్థ గురించి తనకు తెలిసింది తక్కువని...ఇది ఒకందుకు మంచిదేనని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ మాట్లాడుతూ, ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్లు ఇస్తామంటున్న పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో న్యాయ సంస్కరణలకు చోటు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
ట్రాఫిక్ సిగ్నల్ ‘జంపింగ్’తో జేబు గుల్లే!
సాక్షి, హైదరాబాద్: ఏం కాదులే అని సిగ్నల్ జంపింగ్ చేసేస్తున్నారా? బైక్ నడుపుతూ ఫోన్లు మాట్లాడేస్తున్నారా? రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ బండి పార్కింగ్ చేసేస్తున్నారా? ఇకపై అలా చేస్తే.. జేబుకు భారీగానే చిల్లు పడుతుంది. ఈ నెల 12 నుంచి సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్, అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై 2011 జీవో ఆధారంగా రూ.1,000 చొప్పున భారీ జరిమానాలు విధించనున్నట్లు హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) అమిత్ గార్గ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ పోలీసుల కోణంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ముఖ్యంగా మూడు రకాలు... వాహన చోదకుడికి ప్రమాదకరమైనవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రాణాంతకమైనవి. వీటిలో అన్నింటికంటే చివరి అంశానికి సంబంధించినవి నిరోధించడానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నాలుగు రకాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్లు అమిత్ గార్గ్ తెలిపారు. సైబరాబాద్ పోలీసులు గత నెల నుంచే ఈ విధానాన్ని అమల్లో పెట్టారు. ఇతర ఉల్లంఘనల కంటే మద్యం తాగి వాహనాలు నడపడం, సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, అక్రమ పార్కింగ్ అత్యంత ప్రమాదకరమైనవని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీటికి పాల్పడేది ఎక్కువగా యువత కావడంతో వారు ప్రమాదాలబారిన పడి.. బంగ రు భవిష్యత్తును పాడుచేసుకోవడంతోపాటు తల్లిదండ్రులకూ గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. ఇప్పటికే మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతోపాటు కోర్టులో హాజరుపరిచి, జైలు శిక్షలు సైతం పడేలా చేస్తున్నారు. ఇప్పుడు పైవాటిపై దృష్టి పెట్టారు. ఏమిటా జీవో? తక్కువస్థాయిలో ఉన్న జరిమానా మొత్తాలకు ఉల్లంఘనులు భయపడట్లేదని, ఈ మొత్తాలను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని గతంలో అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేసింది. దాని ఆధారంగా 18 అంశాలకు సంబంధించిన ఉల్లంఘనల జరిమానాలు పెంచుతూ అదే ఏడాది ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో నం. 108ను విడుదల చేసింది. దీనిపై విమర్శలు రావడంతో అమలును అనధికారికంగా నిలిపివేశారు. ఇప్పుడా జీవో దుమ్ము దులిపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పై నాలుగు అంశాల విషయంలో అమలుకు నిర్ణయించారు.