ట్రాఫిక్ సిగ్నల్ ‘జంపింగ్’తో జేబు గుల్లే!
సాక్షి, హైదరాబాద్: ఏం కాదులే అని సిగ్నల్ జంపింగ్ చేసేస్తున్నారా? బైక్ నడుపుతూ ఫోన్లు మాట్లాడేస్తున్నారా? రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ బండి పార్కింగ్ చేసేస్తున్నారా? ఇకపై అలా చేస్తే.. జేబుకు భారీగానే చిల్లు పడుతుంది. ఈ నెల 12 నుంచి సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై 2011 జీవో ఆధారంగా రూ.1,000 చొప్పున భారీ జరిమానాలు విధించనున్నట్లు హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) అమిత్ గార్గ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ట్రాఫిక్ పోలీసుల కోణంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ముఖ్యంగా మూడు రకాలు... వాహన చోదకుడికి ప్రమాదకరమైనవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ప్రాణాంతకమైనవి. వీటిలో అన్నింటికంటే చివరి అంశానికి సంబంధించినవి నిరోధించడానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నాలుగు రకాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్లు అమిత్ గార్గ్ తెలిపారు.
సైబరాబాద్ పోలీసులు గత నెల నుంచే ఈ విధానాన్ని అమల్లో పెట్టారు. ఇతర ఉల్లంఘనల కంటే మద్యం తాగి వాహనాలు నడపడం, సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, అక్రమ పార్కింగ్ అత్యంత ప్రమాదకరమైనవని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీటికి పాల్పడేది ఎక్కువగా యువత కావడంతో వారు ప్రమాదాలబారిన పడి.. బంగ రు భవిష్యత్తును పాడుచేసుకోవడంతోపాటు తల్లిదండ్రులకూ గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. ఇప్పటికే మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతోపాటు కోర్టులో హాజరుపరిచి, జైలు శిక్షలు సైతం పడేలా చేస్తున్నారు. ఇప్పుడు పైవాటిపై దృష్టి పెట్టారు.
ఏమిటా జీవో?
తక్కువస్థాయిలో ఉన్న జరిమానా మొత్తాలకు ఉల్లంఘనులు భయపడట్లేదని, ఈ మొత్తాలను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని గతంలో అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేసింది. దాని ఆధారంగా 18 అంశాలకు సంబంధించిన ఉల్లంఘనల జరిమానాలు పెంచుతూ అదే ఏడాది ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం జీవో నం. 108ను విడుదల చేసింది. దీనిపై విమర్శలు రావడంతో అమలును అనధికారికంగా నిలిపివేశారు. ఇప్పుడా జీవో దుమ్ము దులిపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పై నాలుగు అంశాల విషయంలో అమలుకు నిర్ణయించారు.