అదీ ఎక్కువ ధరకా..?
ఈఆర్‌సీని ప్రశ్నించిన విద్యుత్‌రంగ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉండగా... అధిక ధర చెల్లించి ఏకంగా 25 ఏళ్లపాటు కరెంటు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి, వేణుగోపాల్‌రావు తదితరులు ప్రశ్నించారు. కేస్-1 బిడ్డింగ్ ద్వారా రానున్న 25 ఏళ్లపాటు 250 మెగావాట్ల విద్యుత్‌ను కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డికి చెందిన థర్మల్ పవర్ టెక్ నుంచి కొనుగోలు చేయడంపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) బుధవారం బహిరంగ విచారణ నిర్వహించింది.
సింహాద్రి, హిందూజా తదితర విద్యుత్ ప్లాంట్ల నుంచి తక్కువ ధరకే దీర్ఘకాలంలో విద్యుత అందుబాటులో ఉండగా... యూనిట్‌ను ఏకంగా 15-16 రూపాయలు చెల్లించి థర్మల్ టెక్ నుంచి కొనుగోలు చేయవద్దని తిమ్మారెడ్డి, వేణుగోపాల్‌రావు అభిప్రాయపడ్డారు. ఈ విద్యుత్ కొనుగోలుకు అంగీకారం తెలపవద్దని ఈఆర్‌సీకి విన్నవించారు. ఈ విద్యుత్ కొనుగోలుపై పూర్తి సమాచారం ఇవ్వకుండా హడావుడిగా విచారణ నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అయితే విద్యుత్ అవసరాలు పెరిగిన నేపథ్యంలో ప్రైవేట్ ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేయవద్దనడం ఎంతవరకు సమంజసమని ఈఆర్‌సీ ఇన్‌చార్జి చైర్మన్ శేఖర్‌రెడ్డి, సభ్యుడు అశోకాచారిలు ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు చేయకపోతే కోతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు. అయితే, కేస్-1 బిడ్డింగ్ ద్వారా విద్యుత్ కొనుగోలుపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలియచేసేందుకు మరో మూడు రోజుల పాటు సమయం ఇస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత దీనిపై ఈఆర్‌సీ తుది ఆదేశాలు జారీచేయనుంది.
25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలా?
Published Thu, Aug 8 2013 3:01 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement