ప్రపంచం చూపు మనవైపే: ‘ఇన్ఫోసిస్’ మూర్తి
‘ఐఐటీ-హైదరాబాద్’ స్నాతకోత్సవంలో ‘ఇన్ఫోసిస్’ మూర్తి
సాక్షి, సంగారెడ్డి: ‘గ్రాడ్యుయేషన్ తర్వాత నేను 1970లో పారిస్ వెళ్లాను. అప్పట్లో భారత్ అంటే విదేశీయుల దృష్టిలో పనికిరాని దేశం. గ్రాడ్యుయేట్లుగా మీరు బయటకు వస్తున్న ఈ తరుణంలో మాత్రం మన దేశం ప్రపంచం దృష్టిలో ఎంతో నిరూపించుకుంది’ అని ఇన్ఫోసిస్ కార్యనిర్వాహక చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణమూర్తి అన్నారు.
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఎద్దుమైలారంలోని ఓఎఫ్‌డీ కర్మాగారంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న ‘ఐఐటీ-హైదరాబాద్’ కళాశాల ద్వితీయ స్నాతకోత్సవం బుధవారం జరిగింది. బీటెక్, ఎంఎస్సీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు, బంగారు, వెండి పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్‌ఆర్ నారాయణ మూర్తి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ‘ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారంలో నాయకత్వం వహించే దేశాల్లో ఒకటిగా ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. ఈ గొప్ప అవకాశం, బాధ్యత మీపైనే ఉంది. మీ ప్రతి చర్య భవిష్యత్తు తరాలకు అద్భుత దేశాన్ని అందించేలా ఉండాలి. అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడండి. ఇది మీ పవిత్ర బాధ్యత’ అని ఆయన సూచించారు. క్రియాశీలం, వేగం, నిజాయతీ, సార్థకత, ఉత్సాహం, క్రమశిక్షణతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు.