Graduate student
-
జాహ్నవికి న్యాయం జరగాల్సిందే
వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల నిర్లక్ష్యంతో జరిగిన కారు ప్రమాదానికి బలైపోవడమే గాక మరణానంతరం కూడా వాళ్ల చేతుల్లో జాత్యహంకార హేళనకు గురైన తెలుగు యువతి జాహ్నవి కందుల ఉదంతాన్ని అక్కడి భారతీయ చట్ట సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి గత జనవరిలో సియాటిల్‌లో రోడ్డు దాటుతుండగా పోలీసు వాహనం ఢీ కొని మరణించడం తెలిసిందే. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్న చోట సదరు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడమే ప్రమాదానికి కారణమని తేలింది. కానీ డేనియల్ ఆడరర్ అనే సియాటెల్ పోలీసు అధికారి ఈ ఉదంతంపై చేసిన అత్యంత అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అయితే ఏమయిందిప్పుడు?! ఆమెకు ఆల్రెడీ 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. ఏ 11 వేల డాలర్లకో ఓ చెక్కు రాసి పారేయండి‘ అంటూ అతనన్న మాటలు బాడీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీరి్ణంచుకుపోయిందో చెప్పేందుకు ఈ ఉదంతం మరో నిదర్శనమని వారన్నారు. డేనియల్‌పై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం డిమాండ్ చేశారు. ‘జాహ్నవి దుర్మరణానికి కారకులైన పోలీసులే ఆమె జీవితం విలువే లేనిదంటూ అంత నీచంగా మాట్లాడటం వింటే చెప్పరానంత జుగుప్స కలుగుతోంది. జాతి విద్వేషం, జాత్యహంకారం అమెరికాలో ఆమోదనీయత పొందుతున్నాయనేందుకు ఇది సంకేతం. ఈ చెడు ధోరణికి తక్షణం అడ్డుకట్ట పడాలి‘ అని కృష్ణమూర్తి అన్నారు. ఈ ఉదంతం మీద పూర్తి అధికారాలతో కూడిన పౌర సంఘ సభ్యుల కమిటీ వేసి స్వతంత్రంగా విచారణ జరిపించాలని సావంత్ కోరారు. డేనియల్ మీద 2014 నుంచి కనీసం 18 విచారణలు జరిగితే అతన్ని ఒక్క దాంట్లోనూ శిక్షించకపోవడం దారుణమన్నారు. పోలీసులే ఇంతటి నోటి దురుసుతో జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డ ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో కూడా విచారణను ఆర్నెల్లు సాగదీయడం, రివ్యూ పేరిట ఏడాది దాకా లాగడం క్షమించరానిదని సౌత్ సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యుడు టామీ జె.మోరల్స్ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్స్ కూడా ఒక ప్రకటనలో కోరింది. వందలాది మంది గురువారం సియాటిల్‌లో నిరసన ప్రదర్శన కూడా చేశారు. దోషులైన పోలీసులకు శిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ అమెరికాలో పోలీసు వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రకటించింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతి పట్ల నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ చాన్సలర్ సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
గూడెం గ్రాడ్యుయేట్..ఆఫ్‌లైన్‌లో లైఫ్ ఇస్తోంది
సంధ్య తన గూడెంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. గతేడాదే డిగ్రీ అయింది. డిగ్రీ చదివిన అమ్మాయిలు చాలామంది ఈమధ్య పిల్లలకు ఉచితంగా ఆన్లైన్ క్లాస్ లు తీసుకుంటున్నారు. సంధ్య మాత్రం ఆఫ్‌లైన్ క్లాస్ లు తీసుకుంటోంది. గూడెంలో పిల్లలకు ఫోన్లు ఉంటాయా? నెట్ ఉంటుందా? అందుకే పిల్లల్ని గూడెంలోనే సేఫ్‌గా ఒక చోట చేర్చి, వారికి ఉచితంగా మేథ్స్, ఇంగ్లిష్ చెబుతోంది. మిగతా సబ్జెక్టులను.. పాఠాలుగా కాకుండా, జనరల్ నాలెడ్జిగా మార్చి చదువుపై ఆసక్తి, శ్రద్ధ కలిగిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ గురించిన భయమే తప్ప, చతికిల పడబోతున్న చదువుల థర్డ్ వేవ్ గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. స్థోమత కలిగిన పిల్లలు ఎలాగో ఆన్లైన్లో కుస్తీలు పడుతున్నారు. కంప్యూటర్, కనీసం ఫోన్ లేని పిల్లలు బడీ లేక, ఇంట్లో పాఠాల సడీ లేక అలా ఉండిపోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోనే ఇలా ఉంటే.. ఇక ఏ టెలిఫోన్ సౌకర్యమూ, నెట్ కనెక్షన్ లేని ఆదివాసీ గూడేలలోని పిల్లల చదువుల మాటేమిటి? ఏ ‘వేవూ’ లేని రోజుల్లోనే పిల్లల్ని బడికి కూడా పంపలేని పేదరికం ఉంటుంది ఆ మారుమూల ప్రాంతాల్లో! మరి వారి పిల్లల భవిష్యత్తు మాటేమిటి?! వారి భవిష్యత్తుకు మాట ఇస్తోంది అన్నట్లుగానే.. సంధ్య అనే ఓ అమ్మాయి.. ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆ అమ్మాయి.. తన గూడెం పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ‘ఆఫ్‌లైన్’ పాఠాలు బోధిస్తోంది. ఆన్‌లైన్‌కి దారే లేనప్పుడు ఆఫ్‌లైన్‌లోనే కదా పిల్లల చేరువకు వెళ్లాలి. సంధ్య కూడా వాళ్ల గూడెం అమ్మాయే. తమిళనాడు, కోయంబత్తూరుకు సమీపంలోని చిన్నంపతి గూడెంలోనే ఆమె పుట్టింది. అక్కడే డిగ్రీ వరకు చదివింది. గూడెంలో తొలి పట్టభద్రురాలు సంధ్య. ఏడాదిన్నరగా పిల్లలు చదువుల్లేకుండా ఉండిపోవడం ఆమె చూస్తూనే ఉంది. అందుకు కారణం కరోనానే అయినా, అంతకన్నా పెద్ద కారణం పేదరికం. ఆ సంగతి గ్రహించింది కనుకనే తనే స్వయంగా చదువు చెప్పడానికి పిల్లల్నందర్నీ జమ చేసింది. చిన్నపిల్లల చేత అక్షరాలు దిద్దించడం, పెద్ద పిల్లలకు మేథ్స్, ఇంగ్లిష్ నేర్పించడం ఇప్పుడు ఆమె దినచర్య. ‘పాఠం’ అనే మాటెప్పుడూ పిల్లలకు ఆసక్తికరంగా ఉండదు. అందుకే మాటగా, ఆటగా పాఠాలను నేర్పిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంధ్యకు ఏదో ఒక ఉద్యోగం రాకుండాపోదు. వర్క్ ఫ్రమ్ ఇవ్వకా పోరు. కానీ తన గూడెం పిల్లలకు దగ్గరగా ఉండి వారి చదువుల్ని చూసుకోవాలనుకుంది. ‘‘బడి వారికి దూరమైంది. బడి తెరిచేవరకు నేను వారికి దగ్గరగా ఉంటాను’’ అంటోంది సంధ్య. -
ప్రపంచం చూపు మనవైపే: ‘ఇన్ఫోసిస్’ మూర్తి
‘ఐఐటీ-హైదరాబాద్’ స్నాతకోత్సవంలో ‘ఇన్ఫోసిస్’ మూర్తి సాక్షి, సంగారెడ్డి: ‘గ్రాడ్యుయేషన్ తర్వాత నేను 1970లో పారిస్ వెళ్లాను. అప్పట్లో భారత్ అంటే విదేశీయుల దృష్టిలో పనికిరాని దేశం. గ్రాడ్యుయేట్లుగా మీరు బయటకు వస్తున్న ఈ తరుణంలో మాత్రం మన దేశం ప్రపంచం దృష్టిలో ఎంతో నిరూపించుకుంది’ అని ఇన్ఫోసిస్ కార్యనిర్వాహక చైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఎద్దుమైలారంలోని ఓఎఫ్‌డీ కర్మాగారంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న ‘ఐఐటీ-హైదరాబాద్’ కళాశాల ద్వితీయ స్నాతకోత్సవం బుధవారం జరిగింది. బీటెక్, ఎంఎస్సీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు, బంగారు, వెండి పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఆర్ నారాయణ మూర్తి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ‘ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారంలో నాయకత్వం వహించే దేశాల్లో ఒకటిగా ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. ఈ గొప్ప అవకాశం, బాధ్యత మీపైనే ఉంది. మీ ప్రతి చర్య భవిష్యత్తు తరాలకు అద్భుత దేశాన్ని అందించేలా ఉండాలి. అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడండి. ఇది మీ పవిత్ర బాధ్యత’ అని ఆయన సూచించారు. క్రియాశీలం, వేగం, నిజాయతీ, సార్థకత, ఉత్సాహం, క్రమశిక్షణతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు.