సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారి పనిపట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరింత బలగంతో బరిలోకి దిగుతున్నారు. ఈ విషయంలో ఇకపై ట్రాఫిక్ పోలీసులకు ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ సిబ్బంది సహకరించనుంది. ఐటీ కారిడార్, నగర శివారు ప్రాంతాల్లో రిసార్ట్‌లు, వైన్స్‌లు కుప్పలుతెప్పలుగా ఉండటంతో మద్యం తాగి రోడ్డెక్కిన డ్రంకెన్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు చేస్తుండటాన్ని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ విభాగంలో అంతంత మాత్రంగానే సిబ్బంది ఉండడంతో డ్రంకెన్ డ్రైవ్‌లో ఆర్మ్‌డ్ పోలీసుల సేవల వినియోగానికి చర్యలు తీసుకున్నారు. అల్వాల్, బాలానగర్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మాదాపూర్, మియా పూర్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు, షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో ప్రతి శుక్ర, శనివారాల్లో నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బందిని వినియోగించుకోవాలని ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్‌కు సూచించారు.
మద్యం మత్తు దించుతారు...
సైబరాబాద్ కమిషనరేట్‌లోని పది ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 7,791 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 84,36,550 జరిమానా విధించారు. 1379 మందిని జైలుకు పంపించారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు కూడా బరిలోకి దిగుతుండటంతో రానున్న 4 నెలల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
డ్రంకెన్ డ్రైవ్ కేసులిలా...
జనవరి నుంచి జూన్ వరకు జరిగిన డ్రంకెన్ డ్రైవ్‌లో అత్యధికంగా శంషాబాద్‌లో 1,288 కేసులు నమో దుకాగా ఆ తర్వాతి స్థానంలో రాజేంద్రనగర్‌లో 1,079 కేసులు నమోదయ్యాయి. కూకట్‌పల్లిలో 995, అల్వాల్‌లో 949, బాలానగర్‌లో 850, మియాపూర్‌లో 843, జీడిమెట్లలో 806, మాదాపూర్‌లో 550, గచ్చిబౌలిలో 276, షాద్‌నగర్‌లో 155 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం 7,791 కేసుల్లో 5,811 కేసులు పరిష్కరించారు. 1980 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 7,791 మందిలో 1,100 మందికి ఒకటి నుంచి ఐదు రోజులు, 279 మందికి ఆరు నుంచి 13 రోజులు జైలు శిక్ష పడిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment