సైబరాబాద్‌లో ‘పగటి డ్రంకన్ డ్రైవ్’ ముమ్మరం
స్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసుల దృష్టి
నాలుగురోజుల్లో 80కి పైగా కేసుల నమోదు
సిటీబ్యూరో: సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పోలీసు కమిషనరేట్ పరిధుల్లో పగటి పూట డ్రంకన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల బంజారాహిల్స్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ నగర కమిషనరేట్‌తో పాటు సైబారాబాద్‌లోనూ పగటి వేళల్లో డ్రంకన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తప్పతాగి వాహనం నడుపుతున్న వారిని పట్టుకొని, వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఈనెల 11 నుంచి గురువారం వరకూ సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ పరిధిలో 46 మంది, వెస్ట్ కమిషనరేట్ పరిధిలో 34 మంది మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే, రాత్రి వేళల్లో వెస్ట్ కమిషనరేట్ పరిధిలో 53 మంది తప్పతాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు.
అక్కడి సిబ్బంది ‘డ్రైవ్’లకు వినియోగం...
పోలీసులు ఇటీవల కొన్ని చోట్ల ట్రాఫిక్ జంక్షన్ మూసివేసి... యూటర్న్ అమలు చేస్తున్నారు. దీంతో ఆయా జంక్షన్‌లో పని చేసి ఖాళీగా ఉన్న సిబ్బందిని డ్రంకన్ డ్రైవ్‌లో వినియోగిస్తున్నారు. గతంలో డ్రైవ్‌లు కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో వారాంతాల్లో రాత్రిపూట జరిగేవి. ఇప్పుడు కొన్ని ప్రత్యేక ప్రాంతాలు, ఆదివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ప్రదర్శనల జాబితాలను సేకరిస్తున్నారు. దీంతో పాటు ఐటీ కారిడార్ కావడం, శివారు ప్రాంతాల్లో కాలేజీలు ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని తనిఖీలు ముమ్మరం చేశారు.
ఐటీ కారిడార్‌లో ప్రత్యేక తనిఖీలు....
ఐటీ కారిడార్‌ల్లో యువతులు, మహిళల కోసం ప్రత్యేకంగా కాక్‌టైల్ పార్టీలను కొన్ని రెస్టారెంట్లు, స్టార్‌హోటళ్లు నిర్వహిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. వారం రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పోలీసు కమిషనర్లు మహేష్ భగవత్, నవీన్‌చంద్‌లు తెలిపారు. ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సమన్వయంతో డ్రంకన్ డ్రైవ్ చేపట్టే ప్రాంతాలపై క్షేత్రస్థాయి అధికారులకు సమాచారం ఇస్తున్నారని చెప్పారు.
ప్రమాదాల నియంత్రణకేపగటిపూట...
మద్యం మత్తులో మితిమీరిన వేగంగాతో వాహనాలు నడుపుతూ నియంత్రణ కోల్పోయి కొందరు ప్రమాదాలకు గురై మృత్యువాతపడుతున్నారు. మరికొందరు ప్రమాదంలో అవయవాలు కోల్పోయి శాశ్వత వికలాంగులుగా మిగులుతున్నారు. మరికొందరు పాదచారులను ఢీకొని వారి ప్రాణం తీస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడాలేకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రాత్రి పూటకే పరిమితమైన డ్రంకన్ డ్రైవ్‌లను పగటిపూట కూడా విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించాం. ఈ డ్రైవ్‌లు ప్రమాదాల నియంత్రణకు ఎంతో దోహదం చేస్తాయి.
-మహేష్ భగవత్, నవీన్‌చంద్, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పోలీసు కమిషనర్‌లు