మీ అంతు చూస్తాం..
విశాఖ ట్రాఫిక్ పోలీసులకు టీడీపీ నాయకుల బెదిరింపులు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన శ్రీకాకుళం టీడీపీ నేతలు
డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దుర్భాషలు
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పచ్చబిళ్ల చూపిస్తే పనైపోవాలి.. అంటూ గతంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పుణికిపుచ్చుకున్న ఆయన మనుషులు విశాఖలో బరితెగించారు. శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో పూటుగా మద్యం తాగి ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి విశాఖలోని మద్దిలపాలెంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీపీ కాలనీ ట్రాఫిక్ పోలీసులపై ప్రతాపం చూపించారు.
తనిఖీ కోసం కారు ఆపిన పోలీసులను తప్పించుకుని వేగంగా దూసుకెళ్లారు. దీంతో వారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరగా వారిపై రెచ్చిపోయారు. ‘ఒరేయ్ అధికార పార్టీ నాయకుల కారునే ఆపుతారా.. మీ అంతు తేలుస్తాం రా.. అచ్చెన్నాయుడి మనుషులనే అడ్డుకోవడానికి మీకు ఎంత ధైర్యం?..’ అంటూ శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం తామరాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు పోలాకి ఢిల్లీశ్వరరావు తదితరులు రెచ్చిపోయారు.
రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ వీరంగం సృష్టించారు. దీంతో కొందరు పోలీసులు వారి చేష్టలను వీడియో తీసే ప్రయత్నం చేయగా వారిపైనా బెదిరింపులకు తెగబడ్డారు. ‘తీయండ్రా తీయండి.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు తీసుకోండి.. మిమ్మల్ని సస్పెండ్ చేయించి, వీఆర్‌కు పంపించకపోతే మా పేర్లు మార్చుకుంటాం’ అంటూ హెచ్చరించారు.
అసలు వారిని వదిలేసి డ్రైవర్‌పై కేసు
ఎస్‌ఐ, ఏఎస్‌ఐ స్థాయి అధికారులపై పచ్చ మూక బహిరంగంగా బెదిరింపులకు దిగినా.. వారిపై చర్యలకు ఆదేశించడంలో విశాఖ పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం విశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగినా డ్రంక్ అండ్ డ్రైవ్ చలానా నమోదు మినహా విశాఖ పోలీసులు పచ్చమూకపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ఇటీవలే త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌పై దాడి జరిగిన ఘటన విశాఖ ప్రజలు మరువకముందే.. ట్రాఫిక్ పోలీసులపై తెలుగు తమ్ముళ్లు పూటుగా తాగి మద్దిలపాలెంలో బరితెగించిన ఘటన చోటుచేసుకోవడం విశాఖ వాసులతో పాటు పోలీసు వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారాన్ని వీడియోలతో సహా ట్రాఫిక్ పోలీసులు ఉన్నతాధికారులకు పంపినట్టు తెలుస్తోంది.
అయినా ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్యలకు ఆదేశించకపోవడం చర్చకు దారితీసింది. తెలుగు తమ్ముళ్ల బరితెగింపు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు విశాఖ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బుధవారం రాత్రి కారు డ్రైవింగ్ చేస్తున్న టెక్కలికి చెందిన బొమ్మిలి మురళీపై కేసు నమోదు చేసి మమా.. అనిపించారు. ఈ గొడవకు కారకులైన ఢిల్లీశ్వరరావు తదితరులను పక్కన పెట్టి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment